కొత్త చట్టాలపై అవగాహన కల్పిస్తున్న జేడీ రవికుమార్
నిజామాబాద్ అగ్రికల్చర్(నిజామాబాద్ అర్బన్): తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన మార్కెటింగ్ చట్టాలు, నిబంధనలపై వ్యాపారులు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని, అందరి శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని వీటిని అమలుచేస్తున్నామని మార్కెటింగ్‌శాఖ జాయింట్ డైరెక్టర్ రవికుమార్ తెలిపారు. నగరంలోని నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కిసాన్ మీటింగ్ హాల్లో మార్కెటింగ్ చట్టాలు, నిబంధనలపై సోమవారం వ్యాపారులకు అవగాహనాసదస్సును ఏర్పాటుచేశారు.
ఈసందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం గత డిసెంబర్ 29వ తేదీ నుంచి మార్కెటింగ్ శాఖలో కొత్త చట్టాలు, నిబంధనలను అమల్లోకి తెచ్చిందన్నారు.మూడునెలల్లోపు వ్యాపారులు కొత్త చట్టాలకు లోబడి లైసెన్సులను పొందాలని, అందులోకి తమ వ్యాపారాన్ని మార్చుకోవాలని సూచించారు. ఇక నుంచి తమ వ్యాపార సముదాయాల నుంచే నేరుగా లైసెన్సులు పొందవచ్చని, ఒకే లైసెన్స్‌తో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా పంట ఉత్పత్తులను కొనుగోలు చేసుకోవచ్చన్నారు. ఈ–పర్మిట్లు, ఈ–తక్‌పట్టీల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేదని, నేరుగా ఆన్‌లైన్‌లో పొందవచ్చని తెలిపారు. కొత్తగా లైసెన్సులు పొందే వారికి రూ.5లక్షలు, రెన్యూవల్ చేసుకునే వ్యాపారులకు రూ.10లక్షల బ్యాంక్ గ్యారెంటీ నిబంధన తప్పనిసరి చేసిందన్నారు. రూ.10లక్షల బ్యాంక్ గ్యారెంటీతో కోటీ వరకు టర్నోవర్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. సామర్థ్యాన్ని బట్టి వ్యాపారులు వ్యాపారం చేసుకోవాలని, మించి వ్యాపారం చేయడం వల్ల మోసాలు జరుగుతున్నాయన్నారు.
నిజామాబాద్ వ్యాపారులు మంచి వారేనని, రాష్ట్రంలోని అన్ని మార్కెట్ల వ్యాపారులను ఉద్ధేశించి చట్టాలను రూపొందించామని తెలిపారు. ఇప్పటి నుంచి వ్యాపారుల లైసెన్సులు రాష్ట్రస్థాయిలో నోటిఫై అవుతాయన్నారు. రాబోయే రోజుల్లో జాతీయస్థాయి లైసెన్సులుగా మారవచ్చని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 44 మార్కెట్లను ఈ–నామ్ ద్వారా అనుసంధానం చేశామని, ప్రస్తుతానికి ఈ మార్కెట్లలో ఏ పంట ఉత్పత్తినైనా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చని తెలిపారు. మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షులు గంపా శ్రీనివాస్ గుప్త, రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మోటూరి దయానంద్ గుప్త మాట్లాడుతూ కొత్త చట్టాలకు అనుగుణంగా తాము వ్యాపారం చేసేందుకు సుముఖంగా ఉన్నామని, కానీ బ్యాంకు గ్యారెంటీని తగ్గించాలని కోరారు.బ్యాంకు గ్యారెంటీ వ్యాపారులకు భారమని, జిల్లా రైతులను ఏనాడూ మోసం చేసిన చరిత్ర లేదన్నారు. వ్యాపారులతో చర్చించకుండా బ్యాంకు గ్యారెంటీని నిర్ణయించారని, కావున పాత విధానాన్నే అనుసరించాలని డిమాండ్‌చేశారు.మంత్రి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని జేడీని కోరారు.
అంతకుముందు జేడీ రవికుమార్ పాలకవర్గం ప్రతిపాదించిన కవర్ షెడ్స్ ఆవశ్యకతను ఆయా గ్రామాల ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను తీసుకున్నారు. మార్కెట్‌కమిటీ పరిధిలోని గ్రామాల్లో కవర్ షెడ్స్ నిర్మాణానికి పాలకవర్గం మంత్రికి ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఈకార్యక్రమంలో మార్కెట్‌కమిటీ వైస్ చైర్మన్ చంద్రశేఖర్‌రెడ్డి, సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీ స్వరూపారాణి, డీఎంఓ రియాజ్, అసిస్టెంట్ సెక్రటరీ విజయ్‌కిషోర్, రవీందర్‌రెడ్డి, వ్యా పారులు కరిపె సత్యం, మాస్టర్ శంకర్, మల్లేష్, దేవేందర్, హన్మంతు, సాయిరాం, పిండి గంగాధర్, రాధాకిషన్, మురళీ, గంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment