రాజయ్యా.. కనవయ్యా.. | doctors negligence in hospitals | Sakshi
Sakshi News home page

రాజయ్యా.. కనవయ్యా..

Published Sun, Dec 28 2014 2:12 AM | Last Updated on Tue, Oct 9 2018 7:11 PM

రాజయ్యా.. కనవయ్యా.. - Sakshi

రాజయ్యా.. కనవయ్యా..

‘ఇక్కడ ప్రతిదానికీ పైసలు అడుగుతుండ్రు. మత్తు సూది డాక్టర్‌కు రూ.1500, పుట్టిన బిడ్డను కడిగినందుకు రూ.800, బిడ్డను చూపించాలంటే రూ.200. డాక్టర్లు, ఇతర పనోళ్లు పీడిస్తుండ్రు. కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా నరకం చూపిస్తుండ్రు. బాత్రూములు కంపుకొడ్తున్నయ్. లైట్లు ఎల్గుతలేవ్. మంచినీటికీ గోసవెడుతుండ్రు...’ గోదావరిఖని ప్రభుత్వాసుత్రిలో రోగుల గోడు ఇది.

ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టి.రాజయ్య ఆస్పత్రిని తనిఖీ చేయడానికి ఆదివారం ఉదయం రానున్నారు. రాత్రికి ఆస్పత్రిలోనే బస చేయనున్నారు. ఈ సమస్యలన్నీ మంత్రికి కనిపించకుండా ఉండేందుకు రెండు రోజులుగా అధికారులు కష్టపడుతున్నారు. ఆస్పత్రి రూపురేఖలు మార్చేశారు. అయినా సమస్యలు వేలెత్తి చూపిస్తున్నాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇన్‌పేషెంట్లు, వారి బంధువులు ఆస్పత్రి లీలలను మంత్రికి విన్నవించేందుకు సిద్ధమవుతున్నారు.                
 
వైద్యుల కొరతతో ఇబ్బందులు
ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో నెలకు 200 నుంచి 250 వరకు రికార్డు స్థాయిలో ప్రసవాలు జరుగుతున్నాయి. అందుకు తగినవిధంగా వైద్య సిబ్బంది లేరు. 2002లో ఆస్పత్రి ప్రారంభమైనప్పుడు ప్రభుత్వం మంజూరు చేసిన మూడు సివిల్ సర్జన్ పోస్టులు ఇప్పటి వరకు భర్తీ కాలేదు. వీటిలో జనరల్ ఫిజీషియన్, గైనకాలజిస్ట్, జనరల్ సర్జన్ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి.

ఎనిమిది సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల్లో ఆర్థోపెడిక్, గైనకాలజిస్ట్, ఈఎన్‌టీ, కంటి వైద్య నిపుణులు, అనస్తీషియా, పాతాలజిస్ట్, పిల్లల వైద్య నిపుణులు తదితర డాక్టర్లు సేవలందించాల్సి ఉండగా, వీరిలో ప్రస్తుతం గైనకాలజిస్ట్, అనస్తీషియా మాత్రమే సేవలందిస్తున్నారు. ఆర్థోపెడిక్ డాక్టర్ వినయ్‌కుమార్ నెల రోజులుగా ఆస్పత్రికి రావడం లేదు. లాంగ్‌లీవ్‌లో ఉండడంతో ప్రజలకు సేవలు అందడం లేదు. ఐదుగురు ఎంబీబీఎస్ డాక్టర్లతో కాంట్రాక్టు పద్ధతిన సేవలందిస్తున్నారు.

ఎనిమిది నెలలుగా ఆస్పత్రికి డైట్ బిల్లులు సుమారు రూ.8 లక్షల వరకు రాలేదు. విద్యుత్ బకాయిలు రూ.7 లక్షలకుపైగా ఉన్నాయి. గత డిసెంబర్ నుంచి ఆస్పత్రి అంబులెన్స్ సేవలు నిలిచిపోయాయి. ఆస్పత్రిలో స్పెషలిస్టు డాక్టర్లను నియమిస్తే ఆస్పత్రిని నమ్మి వస్తున్న నిరుపేద ప్రజలకు మెరుగైన సేవలు అందే అవకాశం ఉంది. ఆరోగ్యశ్రీ సేవలు నీరుగారిపోతున్నాయి. పదేళ్లుగా ఆస్పత్రిని నమ్ముకుని సేవలందిస్తున్న పారిశుధ్య కార్మికులు ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం ఇప్పించాలని కోరుతున్నారు. సమస్యలతో తల్లడిల్లుతున్న ధర్మాస్పత్రికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఎలాంటి చికిత్స అందిస్తారోనని అందరూ ఆసక్తిగా ఉన్నారు.
 
ప్రైవేట్ వ్యక్తులతో ప్రయోగాలు
ఆస్పత్రిలో అనస్తీషియాగా పనిచేస్తున్న డాక్టర్ మోహన్‌రావు కొంతకాలంగా ఓ ప్రైవేట్ మహిళను డాక్టర్‌గా పరిచయం చేస్తూ... ఆస్పత్రిలోని థియేటర్‌లో ప్రయోగాలు చేయిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అధికారుల అనుమతి లేకుండా సదరు మహిళతో చికిత్స చేయించడం వివాదాస్పదంగా మారింది. దీనిపై డీసీహెచ్‌ఎస్‌కు ఫిర్యాదులు వెళ్లాయి. ఈ విషయంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ సూర్యశ్రీరావుకు, డాక్టర్ మోహన్‌రావుకు మధ్య వివాదం చోటు చేసుకుంది. మోహన్‌రావు థియేటర్‌లోకి వస్తే, తాను వైద్య సేవలు అందించనంటూ గైనకాలజిస్ట్‌గా సేవలందిస్తున్న సూర్యశ్రీరావు తేల్చిచెప్పారు.

దీంతో ఇద్దరి మధ్య చోటుచేసుకున్న ఈ గొడవ ఆస్పత్రిలో సేవలకు అంతరాయం ఏర్పడింది. ఇటీవల మహదేవాపూర్ మండలం అన్నారం గ్రామానికి చెందిన నగునూరి శారద అనే నిరుపేద బాలింతకు డాక్టర్లు అందుబాటులో ఉండి కూడా ప్రసవం చేయడానికి ముందుకు రాలేదు. దీంతో గత్యంతరం లేక ఆస్పత్రి సిబ్బంది కరీంనగర్‌కు తరలించారు. కరీంనగర్ ప్రభుత్వాస్పత్రిలో వైద్యం అందకపోవడంతో ప్రైవేట్ ఆస్పత్రిలో రూ.20 వేలు అప్పు చేసి శారదకు కుటుంబసభ్యులకు పురుడు పోయించారు.
 
లంచాల కోసం డిమాండ్
ప్రసవం కోసం ఆస్పత్రికి వస్తే కొందరు వైద్యులు, సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారు. మత్తు సూదికి, పుట్టిన బిడ్డను శుభ్రం చేయడానికి, బిడ్డను చూపించడానికి, బాత్‌రూమ్‌లు శుభ్రం చేయడానికి ఇలా.. వివిధ సేవల పేరుతో కాసులు దండుకుంటున్నారని రోగులు, వారి బంధువులు పేర్కొంటున్నారు. వివిధ సమస్యలతో వస్తున్న పేషెంట్లకు, స్థానికంగానే ఉచితంగా చికిత్స చేయాలి. కొందరు డాక్టర్లు, వాళ్లు పని చేస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించి డబ్బులు దండుకుంటున్నారు. సిబ్బందికి కూడా ఇందులో వాటా ఇస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement