జూడాలపై చర్యలు తీసుకుంటా
ఉపముఖ్యమంత్రి రాజయ్య
సాక్షి, సంగారెడ్డి: కోర్టు మొట్టికాయవేసినా మొండిగా వ్యవహరిస్తున్న జూనియర్ డాక్టర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ రాజయ్య హెచ్చరించారు. వైద్య ఆరోగ్యశాఖను వికేంద్రీకరించి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మంగళవారం మెదక్ జిల్లా కేంద్రం సంగారెడ్డిలోని ఎంఎన్‌ఆర్ వైద్యకళాశాల వార్షిక వేడుకలకు హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు.
జూడాలు వ్యవహరిస్తున్న తీరు బాధ కలిగిస్తున్నట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందజేయబోమని చెప్పటం దారుణమన్నారు. వైద్యులైన నా పిల్లలను గ్రామీణ ప్రాంతాలకు పంపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. జూడాల ఐదు డిమాండ్లను నెరవేర్చేందుకు ప్రభుత్వం అంగీకరించినా.. వారు మొండిగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.