ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. సీఎం ఎంపికపై మహాయుతి కూటమి మధ్య గత పదిరోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడినట్లే కనిపిస్తోంది. మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఖాయమైనట్లు సమాచారం. ప్రస్తుతం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న ఏక్‌నాథ్ షిండే డిప్యూటీ సీఎం బాధ్యతలు చేపట్టబోతున్నట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి.
ఇక డిసెంబరు 5న మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం జరగనున్నట్లు తెలుస్తోంది. ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు కూడా చకచకా జరిగిపోతున్నాయి. ఈసారి కూడా ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉండనుండగా.. షిండేతో పాటు ఎన్సీపీ నేత అజిత్ పవార్ అదే రోజున ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
అయితే కేబినెట్ కూర్పు ఇంకా పూర్తి కాని కారణంగా.. ఆ రోజు సీఎం, ఇద్దరు డిప్యూటీ సీఎంలు మాత్రమే ప్రమాణం చేయనున్నట్లు సమాచారం. మరోవైపు బుధవారం బీజేపీ శాసనసభాపక్ష నేతల సమావేశం జరగనుంది. ఇందులో కొత్త సీఎంను ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు.
కాగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతికూటమి భారీ విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. కూటమిలోని బీజేపీకి 132 సీట్లు, షిండే శివసేనకు 57, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి 41 సీట్లు దక్కాయి. ఈ నేపథ్యంలో అత్యధిక సీట్లు సాధించిన బీజేపీనే ఈసారి సీఎం పదవి చేపట్టబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
కానీ సీఎం పదవి వదులుకునేందుకు ఏక్‌నాథ్ షిండే సుముఖంగా లేనట్లు శివసేన వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే సీఎం పదవి, శాఖల కేటాయింపుపై మహాయుతి కూటమి మధ్య గత కొంతకాలంగా ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఇక అనేక రోజుల చర్చల తర్వాత షిండే మహాయుతి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేయడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment