హన్మకొండ: తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తల్లి వెంకటమ్మ కుక్కకాటుకు గురైంది. వరంగల్ జిల్లా హన్మకొండలోని టీచర్స్ కాలనీలో నివాసముంటున్న కడియం తల్లి వెంకటమ్మ శనివారం ఇంటి ముందు నిల్చొని ఉండగా.. వీధి కుక్క కరిచింది. అదే కుక్క మరో నలుగురిని గాయపరిచింది. వీరు ప్రైవేటు వైద్యుడి వద్ద చికిత్స పొందారు.
కాగా, గతంలో ఓ బాలుడిని తీవ్ర గాయాలపాలు చేయగా.. బాధితులు లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపి, బాధితుడికి పరిహారం అందించాలని నగరపాలక సంస్థను ఆదేశించింది. సీఎం కేసీఆర్ జనవరిలో వరంగల్ నాలుగు రోజుల పర్యటన సందర్భంగా హన్మకొండ టీచర్స్ కాలనీకి చెందిన విద్యార్థి నవీన్ సోలంకి.. సీఎం కేసీఆర్‌ను కలిసి కుక్కలు, కోతుల బెడద తీవ్రంగా ఉందని చెప్పారు.
దీంతో కేసీఆర్ ఎక్కడ ఉంటావని అడుగగా.. టీచర్స్ కాలనీలోని కడియం శ్రీహరి ఇంటి సమీపంలో ఉంటానని చెప్పాడు. వెంటనే స్పందించిన సీఎం కేసీఆర్ ఈ సమస్యలు చూడమని ఎంపీ శ్రీహరికి సూచించారు. సీఎం దృష్టికి తీసుకెళ్లిన సమస్య పరిష్కారం కాకపోగా.. ఆ సమస్య నేరుగా కడియం శ్రీహరికి తన తల్లి ద్వారా ఎదురుకావడం గమనార్హం.
డిప్యూటీ సీఎం తల్లికి కుక్కకాటు
Published Sun, Mar 1 2015 6:54 PM | Last Updated on Tue, Oct 30 2018 7:30 PM
Advertisement