‘సెకండ్’ సెల్‌ఫోన్లు కొనుగోలు చేయొద్దు
చాదర్‌ఘాట్: సెకండ్ హ్యాండ్ సెల్‌ఫోన్‌లను రసీదులు లేకుండా కొనుగోలు చేయవద్దని సుల్తాన్ బజార్ ఏసీపీ రావుల గిరిధర్ సూచించారు. చాదర్‌ఘాట్ పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సెకండ్‌హ్యాండ్ సెల్‌ఫోన్‌లు కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారులు తప్పకుండా రసీదులు తీసుకోవాలన్నారు. ఒకవేళ రసీదులు లేకుండా కొనుగోలు చేస్తే, వాటి వల్ల కలిగే చట్టపరమైన ఇబ్బందులు కొనుగోలుదారులు ఎదుర్కొవాల్సి వస్తుందన్నారు.
సెల్‌ఫోన్‌లను కొందరు దొంగలించి తక్కువ ధరకు అమ్ముతూ వినియోగదార్లను ఆకర్షిస్తున్నరన్నారు. అలాగే ఆటోల్లో ప్రయాణించేప్పుడు తప్పనిసరిగా ఆటో నంబర్‌ను రాసుకోవటం లేదా గుర్తు పెట్టుకోవటం చేయాలన్నారు. ఇటీవల ఆటోల్లో ప్రయాణించే వారిపై దాడి చేసి నగదు, సెల్‌ఫోన్‌లు దోపిడీ చేస్తున్నందున ప్రజలకు ఈ హెచ్చరికలు చేస్తున్నట్లు ఏసీపీ చెప్పారు.