ఏఈఈ అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయం వద్దు
తెలంగాణ విద్యుత్ సంస్థలకు హైకోర్టు ఆదేశం
మధ్యంతర ఉత్తర్వులు జారీ
విచారణ ఈ నెల 20కి వాయిదా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కోలలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి సంబంధించి అభ్యర్థుల ఎంపికపై ఈ నెల 20 వరకు తుది నిర్ణయం తీసుకోవద్దని హైకోర్టు మంగళవారం తెలంగాణ ప్రభుత్వాన్ని, విద్యుత్ పంపిణీ సంస్థలను ఆదేశించింది. ఈ పోస్టుల నిబంధనల్లో చేసిన సవరణలతోపాటు జారీ అయిన నోటిఫికేషన్‌ను సవాల్‌చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై లోతైన విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని...అందువల్ల కేసు తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన వ్యాజ్యాలపై మంగళవారం విచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది డాక్టర్ కె.లక్ష్మీనర్సింహ వాదనలు వినిపిస్తూ ఉద్యోగ నిబంధనలకు సవరణలు చేసిన విద్యుత్ సంస్థలు తెలంగాణను ఉత్తర, దక్షిణ జోన్‌లుగా విభజించి వాటిలో ఏదో ఒక జోన్‌లో జన్మించిన లేదా ఆరేళ్లకు మించి చదివిన వారినే స్థానికులుగా పరిగణిస్తున్నాయన్నారు.
ఈ జోన్‌లలో భర్తీ కాని పోస్టులేవైనా మిగిలితే వాటిని ఆ జోన్‌లలో స్థానిక పోస్టులుగా పరిగణించి 70 శాతం స్థానికులకు, 30 శాతం స్థానికేతరులకు కేటాయించే అవకాశం ఉంటుందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నాయని, కానీ నోటిఫికేషన్‌ను లోతుగా పరిశీలిస్తే 100 శాతం పోస్టులన్నీ తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారికే పరిమితమయ్యేలా ఉందన్నారు. ఈ విధమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని, ఒకవేళ అటువంటి రిజర్వేషన్లు కల్పించాలంటే అది పార్లమెంటు మాత్రమే చేయాలి తప్ప, విద్యుత్ సంస్థలు కాదన్నారు. ప్రస్తుత విధానం వల్ల ఏఈఈ పోస్టులకు దేశంలో ఏ ఒక్కరూ అర్హులు కాదన్నారు. వాదనలు విన్న ధర్మాసనం దీనిని ఎలా సమర్థించుకుంటారని తెలంగాణ రాష్ట్ర అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) జె.రామచంద్రరావును ప్రశ్నించింది. అయితే తాము చట్ట విరుద్ధంగా ఏమీ చేయడం లేదని, రాష్ట్రపతి ఉత్తర్వులను అనుసరించే రిజర్వేషన్లను అమలు చేస్తున్నామని రామచంద్రరావు తెలిపారు. విద్యుత్ సంస్థ ఎక్కడ ఉంటుందో దాని పరిధిలోని అభ్యర్థులే పోస్టులకు అర్హులని, ఇది తాము కొత్తగా తీసుకొచ్చిన విధానం కాదని, అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇదే విధానం కింద పోస్టులను భర్తీ చేశారని రామచంద్రరావు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.
ఈ వాదనలపై సంతృప్తి చెందని ధర్మాసనం... 70 శాతం పోస్టులను స్థానికులకు రిజర్వ్ చేసినప్పుడు మిగలిన 30 శాతం పోస్టులను ఆంధ్రప్రదేశ్ సహా దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలవారికీ అందుబాటులో ఉంచాలని, ఇది తమ ప్రాథమిక అభిప్రాయమని వ్యాఖ్యానించింది. ప్రస్తుతం పోస్టుల భర్తీ ప్రక్రియ ఏ దశలో ఉందని ధర్మాసనం ప్రశ్నించగా రాతపరీక్ష పూర్తయిందని... ఫలితాల వెల్లడికి 2-3 వారాలు పడుతుందని విద్యుత్ సంస్థల తరఫు న్యాయవాది ప్రియాంకా సింగ్ తెలిపారు. దీంతో ఈ వ్యాజ్యాలపై తదుపరి విచారణను 20న చేపడతామంటూ, అప్పటి వరకు అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయం తీసుకోవద్దని విద్యుత్ సంస్థలను ఆదేశిస్తూ ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.