
సాక్షి, హైదరాబాద్ : కేరళను వణికిస్తున్న నిపా వైరస్‌పై రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య, ఆరోగ్య మంత్రి సి.లక్ష్మారెడ్డి అన్నారు. నిపా వ్యాధికి టీకాలు లేవని నివారణ ఒక్కటే మార్గమని ఆయన పేర్కొన్నారు. పుణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో నిపా వ్యాధి నిర్ధారణ పరీక్షల అవగాహనకు వచ్చిన మంత్రి.. ఢిల్లీలోని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్(ఎన్‌సీడీసీ)తో, మణిపాల్‌లోని మణిపాల్ సెంటర్ ఫర్ వైరాలజీ, రీసెర్చ్(ఎంసీవీఆర్)తో మాట్లాడినట్లు తెలిపారు. ప్రధాన వైద్యశాలల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసి రాష్ట్రంలోని ఐపీఎం ఆధ్వర్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. ప్రజల్లో చైతన్యంతో ఇలాంటి వ్యాధులను అదుపు చేయడం, నివారించడం సాధ్యమన్నారు.