నిపా వైరస్‌కు గబ్బిలాలే కారణం కాదా ? | Is Bats Behind Nipah Virus | Sakshi
Sakshi News home page

నిపా వైరస్‌కు గబ్బిలాలే కారణం కాదా ?

Published Thu, May 24 2018 11:28 PM | Last Updated on Fri, May 25 2018 2:14 PM

Is Bats Behind Nipah Virus - Sakshi

కేరళలో కలకలం రేపుతూ 12  మంది మృతికి కారణమైన నిపా వైరస్‌కు గబ్బిలాలే కారణం కాదా ? ఇప్పటివరకు పండ్లు తినే గబ్బిలాల ద్వారా ఈ ప్రాణాంత వైరస్‌ వ్యాపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా ఎందరో చెబుతూ వచ్చారు.  కానీ గబ్బిలాలపై పరిశోధనలు చేస్తున్న  కొందరు బయోలజిస్టులు మాత్రం నిపా వైరస్‌ వ్యాప్తి చెందడానికి గబ్బిలాలే కారణమని చెప్పడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని అంటున్నారు. ఒకప్పుడు ఎబోలా వైరస్‌ బయటకు వచ్చినప్పుడు కూడా అందరూ గబ్బిలాల వల్లే వచ్చిందని అన్నారని, కానీ తర్వాత ఆ వైరస్‌ చింపాంజీ, గొరిల్లాల నుంచి వ్యాప్తి చెందిందని తేలిందని వారు గుర్తు చేస్తున్నారు. అసలు మనుషులు సంచరించే ప్రదేశాల్లో గబ్బిలాలు తిరగవని, వాటి నుంచి వైరస్‌లు వ్యాప్తి చెందడం అత్యంత అరుదుగా జరుగుతూ ఉంటుందని బయోలజిస్టులు వాదిస్తున్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితులు, గబ్బిలాలు ఆవాసం ఉండడానికి ఎక్కడా చోటు లేకపోవడం, సరైన తిండి దొరకకపోవడం వల్ల వాటిల్లో రోగనిరోధక శక్తి తగ్గిపోయి వైరస్‌లు వెదజల్లుతున్నాయని,అందువల్ల గబ్బిలాల సంరక్షణకు సరైన చర్యలు తీసుకుంటే, వాటి వల్ల వచ్చే ప్రమాదమేమీ లేదని వారు అభిప్రాయ పడుతున్నారు.

అసలు  భారత్‌లో ఎందరో గిరిజనులు గబ్బిలాల్ని ఆహారంగా తీసుకుంటారని, కానీ వారిలో ఎవరికీ ప్రాణాంతక వ్యాధి నిపా సోకిందనడానికి ఆధారాలు లేవని గబ్బిలాలపై పరిశోధనలు చేస్తున్న నిపుణులు చెబుతున్న మాట. ‘పండ్లు తినేగబ్బిలాలు చూడడానికి భారీ సైజులో కనిపిస్తాయి. కానీ కేరళలో సీజ్‌ చేసిన బావిలో ఉన్న గబ్బిలాల్ని చూస్తే ఆకారంలో చాలా చిన్నగా కనిపిస్తున్నాయి. అందువల్ల కేరళలో వైరస్‌కు గబ్బిలాలే కారణమని ఇప్పట్నుంచి నిర్ధారించలేం‘ అని  ఉస్మానియా యూనివర్సిటీకి డాక్టర్‌ సీహెచ్‌. శ్రీనివాసులు అభిప్రాయపడ్డారు. మరో శాస్త్రవేత్త రోహిత్‌ చక్రవర్తి కూడా ప్రాణాంతక వైరస్‌లు వచ్చినప్పుడల్లా ఇలా గబ్బిలాలే కారణమని భయపెట్టకుండా,  శాస్త్రీయమైన ఆధారాలు కనుగొనే ప్రయత్నం చేయాలని సూచించారు. అయితే గబ్బిలాల ద్వారా 60 రకాల వైరస్‌లు వ్యాపిస్తాయని, అందులో నిపా, సార్స్‌ వంటి డజనకు పైగా వైరస్‌లు ప్రాణాంతకమైనవని మరికొందరు శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ సీజన్‌లో కొన్ని రకాల గబ్బిలాలు మామిడి పళ్లు, పనస పండ్లు కొరికి పడేస్తాయని, అలా కొరికి పడేసిన పండ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదని వారు హెచ్చరిస్తున్నారు. 

ఆందోళన వద్దు : కేంద్ర బృందం
కేరళలో నిపా వైరస్‌ వ్యాప్తిపై అధ్యయనం చేసిన నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ (ఎన్‌సీడీసీ) నేతృత్వంలోని  కేంద్ర బృందం దీనికి స్థానిక పరిస్థితులే కారణమని అంటోంది. ప్రజలు భయాందోళనలకు గురి కావ్సలిన పనిలేదని చెబుతోంది. కేరళలోని ఒక ఇంట్లో బావిలో ఉన్న గబ్బిలాల నుంచే వైరస్‌ వ్యాప్తి చెందిందా లేదా అన్నది నిర్ధారించడానికి అక్కడ్నుంచి 60 రకాల శాంపిల్స్‌ సేకరించింది. ఈ శాంపిల్స్‌ను పరీక్షించే వరకు మరణాలకు కారణాలు వివరించలేమని చెబుతోంది. కేరళలో వైరస్‌కు గబ్బిలాలు కారణం కాకపోవచ్చునని అభిప్రాయపడుతోంది. 

కర్ణాటకకూ విస్తరించిన నిపా ? 
కేరళ సరిహద్దుల్ని దాటి నిపా వైరస్‌ కర్ణాటకకూ విస్తరించిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేరళ పర్యటనకు వెళ్లి తిరిగి స్వస్థలం మంగుళూరుకు వచ్చిన ఇద్దరు వ్యక్తులు నిపా వ్యాధి లక్షణాలతో బాధపడడంతో వారికి చికిత్స అందిస్తున్నారు. అయితే వారిపై నిపా వైరస్‌ దాడి చేసిందా లేదా అన్నది ఇంకా నిర్ధారణ కావల్సి ఉందని కర్ణాటక ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.
(సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌)
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement