సామాన్యులకు వైద్యం అందుబాటులోకి రావాలి
• వరల్డ్ ఎండోస్కోపి ఆర్గనైజేషన్ అధ్యక్షుడు డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి
• హైదరాబాద్‌లో ‘ఎండో–2017’ ప్రపంచ సదస్సు ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: వైద్య రంగంలో అధునాతన పరిజ్ఞానాన్ని సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చేందుకు వైద్యులు కృషి చేయాలని వరల్డ్ ఎండోస్కోపి ఆర్గనైజేషన్ అధ్యక్షుడు నాగేశ్వర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఉదరకోశ వ్యాధులకు సంబంధించిన అంశాలపై వరల్డ్ ఎండోస్కోపి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ‘ఎండో–2017’ప్రపంచ సదస్సు గురువారం హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో ప్రారంభమైంది. నాలుగు రోజుల పాటు జరుగనున్న ఈ సదస్సును నాగేశ్వర్‌రెడ్డి ప్రారంభించి, ప్రసంగించారు.
అభివృద్ధి చెందిన దేశాల్లోని వైద్య పరిజ్ఞానాన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలకు పరిచయం చేయడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశమని ఆయన చెప్పారు. ప్రపంచంలోనే వైద్య రంగానికి ఇండియా కేరాఫ్ అడ్రస్‌గా నిలవగా.. అన్ని దేశాల వారికి హైదరాబాద్ మెడికల్ హబ్‌గా ప్రసిద్ధి గాంచిందని పేర్కొన్నారు. ఉదరకోశ వ్యాధులకు సంబంధించిన పరిజ్ఞానాన్ని నేర్చుకునేందుకు ఏ దేశానికి చెందిన వైద్యులు హైదరాబాద్ వచ్చినా.. సాదర స్వాగతం çపలికేందుకు తాము సిద్ధంగా ఉంటామన్నారు. కాగా ఈ సదస్సులో 68 దేశాలకు చెందిన 3,500 మంది వైద్యులు పాల్గొంటున్నారు. తొలిరోజున ఉదరకోశ కేన్సర్, పాంక్రియాటిస్, మలద్వారం ద్వారా రక్తస్రావం తదితర వ్యాధులు, అధునాతన చికిత్సలపై చర్చించారు.