
సాక్షి, హైదరాబాద్: కరోనా బాధితులకు చికిత్స అందించే వైద్యులు, ఇతర సిబ్బంది ఆ వైరస్ బారిన పడకుండా ఉండేందుకు డీఆర్‌డీవో వినూత్న బయోసూట్‌ను రూపొందించింది. పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్ (పీపీఈ) సూట్‌ను వివిధ డీఆర్‌డీవో లేబొరేటరీలకు చెందిన శాస్త్రవేత్తలు.. టెక్స్‌టైల్, కోటింగ్, నానోటెక్నాలజీ తదితర సాంకేతికతలను పరిశీలించి వినూత్నమైన కోటింగ్ ద్వారా ఈ సూట్ తయారుచేశారు. ఈ సూట్‌లను అధిక మొత్తంలో ఉత్పత్తి చేసి, వైద్యులు, ఇతర సిబ్బందిని కరోనా నుంచి కాపాడేందుకు ఎంతగానో శ్రమిస్తున్నట్టు డీఆర్‌డీవో గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది.
కుసుంఘర్ ఇండస్ట్రీస్ అనే సంస్థ ఈ సూట్ తయారీకి సంబంధించిన ముడి సరుకు సహా, కోటింగ్ మెటీరియల్ ఉత్పత్తి చేయడమే కాకుండా, పూర్తి సూట్‌ను కూడా తయారు చేస్తున్నట్టు వెల్లడించింది. ప్రస్తుతం రోజుకు 7 వేల సూట్లను తయారుచేసే సామర్థ్యం ఉన్నట్టు పేర్కొంది. వస్త్ర రంగంలో అనుభవం ఉన్న మరో సంస్థతో కలసి రోజుకు 15వేల సూట్లను తయారుచేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు వివరించింది. సూట్‌ను అతికించే టేప్‌ల కొరత కారణంగా వీటి ఉత్పిత్తి తగ్గుతోందని తెలిపింది. దీనికి ప్రత్యామ్నాయంగా సబ్‌మెరైన్‌ల తయారీలో ఉపయోగించే ఓ పదార్ధాన్ని వినియోగిస్తున్నట్టు వెల్లడించింది.