మురికి కాలువ నుంచి వేసిన మంచినీటి పైపులైన్
సాక్షి, రాజేంద్రనగర్: తాగునీటి పైపులైన్‌లోకి మురుగు నీరు ప్రవేశించి నీరు కలుషితమవుతుంది. అభివృద్ధి కార్యక్రమాల నేపథ్యంలో మంచినీటి పైపులైన్ పగలడంతో ఈ సమస్య ఏర్పడింది. అత్యవసరంగా ఈ పైపులైన్‌కు మరమ్మతులు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ జలమండలి అధికారులు పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. వివరాల ప్రకారం బండ్లగూడ గ్రామం నుంచి కిస్మత్‌పూర్‌కు వెళ్లే ప్రధాన రహదారి ఎస్‌ఎంఆర్ ప్రాంతంలో కల్వర్టు ఉంది. ఈ కల్వర్టు మూసుకుపోవడంతో మురుగు నీరు పొంగి పొర్లుతుంది. దీంతో ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ పైపులైన్‌ను వేసి కల్వర్టు వెడల్పు చేశారు. ఈ సమయంలో బండ్లగూడ నుంచి కిస్మత్‌పూర్‌కు వెళ్లే తాగునీటి ప్రధాన పైపులైన్‌కు చిల్లు ఏర్పడింది.
దీని మీదుగా తాగునీరు ఎగజిమ్ముతుంది. నీరు సరఫరా అయిన సమయంలో తాగునీరు బయటకు వస్తుంది. నీటి సరఫరా లేని సమయంలో మురుగు నీరు ఉదయం వేలల్లో పైపులైన్‌ను ముంచి ప్రవహిస్తుంది. ఈ సమయంలో ఈ మురుగు నీరంతా పైపులైన్‌లోకి కలుస్తుంది. దీంతో తాగునీరు కలుషితమై ఇళ్లల్లోకి చేరుతుంది. స్థానికులు ఈ విషయమై గత 4–5రోజులుగా ఫిర్యాదులు చేస్తున్నారు. దాదాపు 50కాలనీలకు ఈ పైపులైన్ నీరే సరఫరా అవుతుంది. అత్యవసరంగా ఈ పైపులైన్‌కు జలమండలి అధికారులు మరమ్మతులు నిర్వహించాలి.
కానీ అధికారులు ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదు. డీజీఎం మణికొండలో ఉండడం, ఏఈ పీరంచెరువులో ఉండడంతో ఈ ప్రాంతంపై ఏ ఒక్కరి అజమాయిషి లేదు. అలాగే ఫిర్యాదులు చేసేందుకు సైతం ఈ అధికారులు ఎవరూ అందుబాటులోకి రావడం లేదు. దీంతో స్థానికులు లబోదిబోమంటున్నారు. మురుగు నీరు తాగడంవల్ల అనారోగ్యాలకు గురవుతున్నామని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. ప్రధాన పైపులైన్ ప్రాంతంలో పనులు జరుగుతున్నా అధికారులు పట్టించుకోరా అని ప్రశ్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment