మూడేళ్లలో తాగునీటి ప్రాజెక్టు పూర్తి
సాక్షి, హైదరాబాద్: వచ్చే మూడేళ్లలో తెలంగాణ తాగునీటి ప్రాజెక్టు (వాటర్ గ్రిడ్)ను పూర్తిచేస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రాజెక్టు పురోగతిపై గురువారం సచి వాలయంలో సీఎస్ రాజీవ్ శర్మతో సమీక్షించారు. లైన్ సర్వే జరిగిన తీరును, ప్రాజెక్టు కింద చేపట్టబోతున్న నిర్మాణాల వివరాలను, ఇందుకోసం ప్రభుత్వం నుంచి అందాల్సిన సహకారాన్ని ఈ సందర్భంగా మంత్రి సీఎస్‌కు వివరించారు. ప్రాజెక్టు పనుల కోసం సేకరించాల్సిన భూముల వివరాలను అందజేశారు. రాష్ట్ర స్థాయిలో పనులు సాగేందుకు అవసరమైన అనుమతుల కోసం ఆర్డినెన్స్ ఇచ్చినప్పటికీ అటవీ శాఖ, ప్రభుత్వ భూముల సేకరణ నిమిత్తం ఆయా శాఖల నుంచి వేగంగా అనుమతులు వచ్చేలా చూడాలని మంత్రి కోరారు.
వెంటనే స్పందించిన సీఎస్ అటవీశాఖ అధికారులను సమావేశానికి పిలిపించారు. ఈ నెల 27న గ్రామీణ నీటిపారుదల శాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించాలని అటవీ అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్‌ఈలు, డీఎఫ్‌ఓలతో సమీక్ష నిర్వహించి పక్కా గా చర్యలు చేపట్టాలని సూచించారు. ఇప్పటికే స్థానిక అధికారుల సహకారంతో ఆదిలాబాద్ జిల్లాలో, మెదక్‌లో కొంతమేరకు ప్రభుత్వ భూముల సేకరణ పూర్తయిందని అధికారులు తెలిపారు. నిధుల సేకరణపై తెలంగాణ ప్రభుత్వం నాబార్డ్, జైకా, ఎల్‌ఐసీ వంటి సంస్థలతో చర్చలు ప్రారంభించిందని, ఆయా సంస్థలు ప్రాజెక్టు నిధులు ఇచ్చేం దుకు సానుకూలత వ్యక్తం చేశాయని, త్వరలోనే మరిన్ని సంస్థలతో చర్చలు జరుపుతామని మంత్రికి సీఎస్ వివరించారు.
తెలంగాణ తాగునీటి ప్రాజెక్టును కాస్ట్ ఎఫిషియెన్సీ ప్రాజెక్టుగా మలిచేందుకు తమ శాఖ ప్రయత్నిస్తోం దని మంత్రి కేటీఆర్ తెలిపారు. ముఖ్యంగా ఇంట్రా విలేజ్ లైన్ నెట్‌వర్క్ కోసం చేపట్టాల్సిన పనుల అంచనాలపై మరింత కసరత్తు చేస్తున్నారన్నారు. సీఎం ఆకాంక్షల మేరకు ప్రాజెక్టును పూర్తి చేస్తామన్న నమ్మకం తమకు ఉందని మంత్రి చెప్పారు.
ఇంజనీరింగ్ సిబ్బంది చెబుతున్న విధంగా టెండర్లు పూర్తయిన 36 నెలల్లో ప్రాజెక్టు పూర్తవుతుందన్నారు. ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన డిజై న్లు పూర్తయిన వెంటనే టెండర్లు పిలుస్తామని చెప్పారు. ఢిల్లీలో ఇటీవల జరిగిన గ్రామీణ నీటి పారుదల శాఖ అధికారుల సమావేశంలో తెలంగాణ నీటి పారుదల శాఖ పనిచేస్తున్న తీరును చాలా రాష్ట్రాలు మెచ్చుకున్నాయని... సిబ్బం దికి మంత్రి అభినందనలు తెలిపారు.