
భిక్షమెత్తుకుంటున్న అన్నదాత
కరువు కాటుకు మెదక్ జిల్లాలో ఓ రైతు యాచకుడిగా మారాడు. తనకున్న కొద్దిపాటి భూమిలో వేసిన పంట ఎండిపోవడంతో వీధిన పడ్డాడు.
రామాయంపేట: కరువు కాటుకు మెదక్ జిల్లాలో ఓ రైతు యాచకుడిగా మారాడు. తనకున్న కొద్దిపాటి భూమిలో వేసిన పంట ఎండిపోవడంతో వీధిన పడ్డాడు. కూలీ పనులు చేయడానికి వయస్సుతోపాటు ఆరోగ్యం సహకరించకపోవడంతో అర్ధాకలితో అలమటిస్తున్నాడు. తన భార్యను పోషించుకునేందుకు యాచక వృత్తిని చేపడుతున్నాడు. చేగుంట మండలం నార్సింగి వడ్డెర కాలనీకి చెందిన వడ్డె దుర్గయ్య, మల్లవ్వ దంపతులు. వీరికి ఐదుగురు కొడుకులు, నలుగురు కూతుళ్లు. రోడ్డు ప్రమాదం, అనారోగ్యం కారణాలతో ఓ కూతురు, ముగ్గురు కొడుకులు మరణించారు. మిగతా అందరి వివాహాలు కాగా.. వృద్ధులైన తల్లిదండ్రులను వదిలి ఎవరికి వారు వేరుగా ఉంటున్నారు.
తనకున్న ఎకరం భూమిలో దుర్గయ్య వరినాటు వేయగా, వర్షాభావంతో పంట ఎండిపోరుుంది. దీనికితోడు ఆయన భార్య మల్లవ్వ పక్షవాతానికిగురై మంచానికే పరిమితమైంది. బండలు కొట్టడానికి వెళ్లిన దుర్గయ్య కాలు విరిగింది. దీంతో ఏ పని చేసుకోలేని పరిస్థితిలో మంచం పట్టిన భార్యను పోషించుకోవడానికి దుర్గయ్య యాచకుడిగా మారాడు. 68 ఏళ్లు ఉన్న దుర్గయ్యకు పింఛన్ వస్తుండగా ఆ డబ్బులు తనకు, తన భార్య మందులకు ఏ మాత్రం సరిపోవడంలేదు. దీంతో బతుకు దెరువుకోసం బిచ్చమెత్తుకుంటున్నాడు.
సిగ్గిడిసి బిచ్చెం ఎత్తుకుంటున్న..
రెండు నెల్ల నుంచి పింఛను వస్తలేదు. తినేతందుకు ఏం లేదు. మా ముసల్ది పచ్చవాతంతో మంచం పట్టింది. బిచ్చమెత్తుకోవాలంటే బాధ అనిపిస్తున్నా.. మేం బతికెందుకు? ఇంత తిండికోసం సిగ్గిడిసి బిచ్చెం ఎత్తుకుంటున్న. 12 కిలోల రేషన్ బియ్యం సరిపోతలె.
- వడ్డె దుర్గయ్య, నార్సింగి