మందుల మాఫియా బేరసారాలు
- నిషేధిత మందులతో పట్టుబడిన వ్యక్తితో రాజీ!
- రూ. 5 లక్షల పరిహారంతోపాటు, శ్రీనివాస్‌ను జైలు నుంచి విడిపిస్తామని ఆఫర్
మోర్తాడ్: గల్ఫ్ దేశాల్లో నిషేధించబడిన నొప్పి నివారణ, నిద్ర మాత్రలను యదేచ్ఛగా రవాణా చేస్తున్న మాఫియా ముఠా గుట్టు రట్టుకాకుండా ఉండటానికి ఎత్తులు వేస్తోంది. దుబాయ్‌లో 10 రోజుల కింద నిషేధిత మందులతో పట్టుబడిన నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం తడపాకల్ వాసి పూసల శ్రీనివాస్ కుటుంబంతో రాజీకోసం ఈ ముఠా సభ్యులు ప్రయత్నా లు మొదలు పెట్టారు. శ్రీనివాస్‌కు దుబాయ్‌కు వెళ్లడానికి ముందు మందుల పార్శిల్‌ను ఇచ్చిన వ్యక్తులపై కేసు పెట్టకుండా ఉండటానికి భారీ మొత్తంలో పరిహారం ఇవ్వడానికి ఈ ముఠా సభ్యులు ముందుకు వచ్చినట్లు సమాచారం.
ఇప్పటికే బాధితుడి భార్య లతిక, ఇతర కుటుంబ సభ్యు లు గల్ఫ్ రిటర్నింగ్ మెంబర్స్ వెల్ఫేర్ సొసైటీ చైర్మన్ చాంద్‌పాషాతో కలిసి తెలంగాణ సచివాలయంలోని ఎన్‌ఆర్‌ఐ సెల్‌లో ఫిర్యాదు చేశారు. గల్ఫ్‌లో నిషేధించబడిన మందుల విషయంపై శ్రీనివాస్‌కు ఎలాం టి అవగాహన లేదని, కేవలం సహా యం చేయాలనే ఉద్దేశంతోనే అతను వారిచ్చిన మందుల పార్శిల్‌ను తీసుకువెళ్లి, పోలీసుల తనిఖీల్లో పట్టుబడినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే గల్ఫ్‌లో నిషేధిత మందుల ముఠా సభ్యులు తక్కువ వ్యవధిలోనే రూ.లక్షలు గడిస్తున్నారు. ఇప్పటివరకు మందుల మాఫియా సూత్రధారులెవరూ అరెస్టు కాలేదు.