భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ గుడ్ గవర్నెన్స్ డే సందర్భంగా మాఫియా గ్యాంగ్‌లు, గుండాలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తన మూడ్ అసలే బాగోలేదని, రాష్ట్రంలో మాఫియాగాళ్లు తట్టా బుట్టా సర్దుకుని వెళ్లాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలు ఆపకుంటే పది అడుగుల గోతిలో పాతిపెడతానని ముఖ్యమంత్రి హెచ్చరించారు. ‘మామా ఇప్పుడు ఫామ్‌లో ఉన్నాడు. రాష్ట్రాన్ని విడిచి వెళ్లకపోతే.. మీరు ఎక్కడ ఉన్నారో కూడా తెలియకుండా 10 అడుగుల గోతిలో పాతి పెడతా’అని ట్విటర్ వేదికగా సీఎం చౌహన్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. ప్రజలకు సమస్యలు లేకుండా ఉన్నప్పుడే అది గుడ్ గవర్నెన్స్ అవుతుందని, అలాంటి రాష్ట్రంగా మధ్యప్రదేశ్ మారుస్తామని ఆయన పేర్కొన్నారు.
చట్టాలను గౌరవించే పౌరుల పట్ల రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం పువ్వు మాదిరిగా సున్నితంగా వ్యవహరిస్తుందని, రాక్షసంగా ప్రవర్తించేవారి పట్ల పిడుగులు వర్షం కురిపిస్తుందని అన్నారు. డ్రగ్స్ పెడ్లర్, భూ దందా, చిట్ ఫండ్ మాఫియా, గూండాలు ఇలాంటివారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని సీఎం స్పష్టం చేశారు. అలాగే, రాష్ట్రంలో పాతుకుని ఉన్న డ్రగ్స్ మాఫియాను మట్టుబెట్టడానికి కేంద్ర సంస్థలతో మంతనాలు జరుపుతున్నామని తెలిపారు. ఇక నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) సూచనల మేరకు డ్రగ్స్ మాఫియాపై చర్యల కోసం డిసెంబర్ 15 నుంచి 22 వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహణకు సీఎం చర్యలు తీసుకున్నారు. ఇదిలాఉండగా.. మధ్యప్రదేశ్‌లోని 15 జిల్లాల్లో డ్రగ్స్ దందా జోరుగా సాగుతోందని ఎన్‌సీబీ తెలిపింది. ముఖ్యంగా మాల్వా, మహాకోషల్ ప్రాంతాల్లో డ్రగ్స్ దందా అధికంగా సాగుతోందని వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment