
భార్యను కాల్చి, తాను కాల్చుకున్న దుబ్బాక ఎస్‌ఐ
దుబ్బాక: సిద్ధిపేట జిల్లా దుబ్బాకలో శుక్రవారం దారుణం చోటుచేసుకుంది. దుబ్బాక ఎస్‌ఐ చిట్టిబాబు తన సర్వీస్ రివాల్వర్‌తో భార్యను కాల్చి, అనంతరం తాను కూడా కాల్చుకున్నారు. పోలీస్ స్టేషన్ సమీపంలోని క్వార్టర్స్‌లో ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనలో భార్య రేఖ అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడ్డ చిట్టిబాబు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కాగా అవినీతి ఆరోపణలతో మూడు రోజులు క్రితం ఎస్‌ఐ సస్పెండ్ అయినట్లు సమాచారం. అయితే ఇంతవరకూ సస్పెన్షన్ ఉత్తర్వులు అందలేదని తెలుస్తోంది. చిట్టిబాబు స్వస్థలం కడప.
కాగా ఉన్నతాధికారుల వేధింపుల వల్లే ఎస్‌ఐ ఈ ఘటనకు పాల్పడినట్లు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. చిట్టిబాబుకు కూతురు, కుమారుడు ఉన్నారు. అయితే కుమారుడు ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం వల్ల చిట్టిబాబు అసహనానికి గురైనట్లు తెలుస్తోంది. చిట్టిబాబు మృదుస్వభావి అని, ఏదైనా కష్టం వచ్చినా ఆదుకునే మనస్తత్వం ఉన్నవారిని తోటి సిబ్బంది చెబుతున్నారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న డీఐజీ ఘటనా స్థలానికి చేరుకుని, సంఘటన పై ఆరా తీశారు.