సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రం ఏటా పురోగమన దిశలోకి వెళుతోంది. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో బడ్జెట్ రాబడులు, వ్యయాలు, అప్పులు కలిపి ఆర్థిక వ్యవస్థ విలువ రూ. 4 లక్షల కోట్లు ఉంటే గత ఐదేళ్లలో అది రూ. 9 లక్షల కోట్లకు చేరింది. ఇందులో ముఖ్యంగా సొంత పన్నుల రాబడిలో అద్భుత ప్రగతి నమోదవుతోంది. ముగిసిన ఆర్థిక సంవత్సరంలో పన్ను రాబడి గతేడాదితో పోలిస్తే 29 శాతం వృద్ధి నమోదు చేసుకుంది. మొత్తం రూ. 77,514 కోట్ల సొంత పన్ను రాబడిని 2018–19లో లక్ష్యంగా పెట్టుకుంటే డిసెంబర్ నాటికే అది రూ. 49,203 కోట్లు వచ్చింది. మిగిలిన త్రైమాసికంలోనూ మంచి ఫలితాలు ఉండటంతో 2018–19 ఆర్థిక సంవత్సరం రూ.64,714 కోట్లతో ఆశాజనకంగా ముగిసింది. మొత్తానికి గత ఐదేళ్లలో సొంత పన్ను రాబడులు రూ. 29 వేల కోట్ల నుంచి
రూ. 70 వేల కోట్లకు చేరడం గమనార్హం.
రిజిస్ట్రేషన్లు.... సూపర్
రెవెన్యూ రాబడులను పరిశీలిస్తే రిజిస్ట్రేషన్ల ఆదాయం రాష్ట్రంలో గత ఐదేళ్లలో అద్భుత ప్రగతిని నమోదు చేసుకుంది. ఏటా రిజిస్ట్రేషన్ల ఆదాయం విపరీతంగా పెరుగుతోంది. ఒక్కో నెలలో ఏకంగా రూ. 500 కోట్లు దాటుతున్న రిజిస్ట్రేషన్ల రాబడులు ఖజానాకు భారీగా నిధులు తెచ్చిపెడు తున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ల శాఖ రికార్డులు నమోదు చేసింది. గతేడాదితో పోలిస్తే 27 శాతం అధికంగా రూ. 5,357 కోట్లు సమకూరాయి. దేశంలోనే ఈ మేర వృద్ధి సాధించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. రాష్ట్రంలో 2014–15 ఆర్థిక సంవత్స రంలో రిజిస్ట్రేషన్ల ఆదాయం రూ. 2,531 కోట్లుగా ఉంటే అది ఐదేళ్లలో రూ. 5,357 కోట్లకు చేరింది. అంటే గత ఐదేళ్లలో రిజిస్ట్రేషన్ల ఆదాయం రెట్టింపుకన్నా ఎక్కువ పెరిగిందన్న మాట.
జీఎస్టీలో రికార్డు...
అమ్మకాలు, వర్తకపు పన్ను విషయంలోనూ రాష్ట్రంలో గణనీయ వృద్ధి నమోదవుతోంది. గత ఐదేళ్లలో పన్నుల ఆదాయం కూడా రెట్టింపు కన్నా ఎక్కువ కావడం గమనార్హం. 2017–18లో జీఎస్టీ అమల్లోకి వచ్చాక కూడా పన్నులు భారీగానే వసూలయ్యాయి. ఊహించిన దానికన్నా తక్కువే అయినా 2017–18లో రూ. 37,439 కోట్ల పన్నులు వసూలు కాగా, 2018–19లో ఆల్‌టైం రికార్డు సాధించింది. కేంద్రం నుంచి వచ్చే పరిహారంతోపాటు అన్ని పన్నులు కలిపి రూ. 45 వేల కోట్లకుపైనే వసూలయ్యాయి.
17 శాతం వృద్ధి నమోదు...
2014 మే నుంచి 2018 మార్చి వరకు రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులనుబట్టి కాగ్ నివేదికలో రాష్ట్ర ఆర్థిక వృద్ధి 17 శాతంగా నమోదు కావడం విశేషం. ఇది దేశంలోనే అత్యధికం కాగా, మన తర్వాత హరియాణా, మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి. వరుసగా నాలుగేళ్లపాటు రాష్ట్రం ఆర్థిక వృద్ధిలో ప్రగతి నమోదు చేసుకుందని, అన్ని రాష్ట్రాలకన్నా పన్నుల రాబడిలో తెలంగాణ మంచి వృద్ధి సాధిస్తోందని కాగ్ నివేదికలో స్పష్టం చేసింది.
సంక్షేమ భారాలను అధిగమిస్తూ...
సంక్షేమం, అభివృద్ధితోపాటు రాష్ట్రంలో సాగునీటి వనరుల కల్పనే ధ్యేయంగా నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఆసరా పింఛన్లు, రైతు రుణమాఫీ, రైతుబంధు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లాంటి సంక్షేమ పథకాల అమలుకోసం ఏటా రూ. 30 వేల కోట్ల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఆసరా పింఛన్ల కోసమే రూ. 12 వేల కోట్ల మేర వెచ్చించాల్సి వస్తోంది.
అప్పులూ చేయాల్సిందే...
రాష్ట్రం ఏర్పాటయ్యాక రూ. 1.13 లక్షల కోట్ల మేర అప్పులు చేయాల్సి వచ్చింది. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలు, ప్రణాళికేతర వ్యయానికి తోడు సాగునీటి ప్రాజెక్టులకు కలిపి భారీగా నిధులు వెచ్చించాల్సి రావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు తీసుకోవాల్సి వస్తోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనల ప్రకారం రాష్ట్ర ఆర్థిక సామర్థ్యంలో 25 శాతం మేర అప్పులు తీసుకునే అవకాశం ఉండగా ప్రభుత్వం 22 శాతం అప్పులు తీసుకుంది. తెలంగాణ ఏర్పాటైన తొలి ఏడాది రూ. 9,410 కోట్లు అప్పు తీసుకుంటే ఆ తర్వాత వరుసగా రూ. 18,856 కోట్లు, రూ. 35,280 కోట్లు, రూ. 26,738 కోట్లు, రూ. 23,470 కోట్ల మేర అప్పులు తీసుకోవాల్సి వచ్చింది. 2019–20 ఆర్థిక సంవత్సరానికిగాను ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలకు అనుగుణంగా మరో రూ. 29,800 కోట్ల మేర అప్పులు తీసుకునే అవకాశం ఉంది.
పన్నుల రాబడి పెరుగుతోంది!
Published Sun, Jun 2 2019 5:50 AM | Last Updated on Sun, Jun 2 2019 5:50 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment