డీజేపై నిషేధం విధించండి
అభ్యంతర పదాలున్నాయంటూ హైకోర్టులో పిల్
సాక్షి, హైదరాబాద్: అల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాథం (డీజే) సినిమాలోని శృంగార గీతాల్లో యజుర్వేదంలోని నమకం, చమకం వంటి పవిత్ర పదాలను ఉపయోగించారని, వాటిని తొలగించే వరకు సినిమాను ప్రదర్శించకుండా నిషేధం విధించాలని ఉమ్మడి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. రంగారెడ్డి జిల్లాకు చెందిన గోగులపాటి కృష్ణమోహన్ దాఖలు చేసిన ఈ వ్యాజ్యంలో ప్రాంతీయ సెన్సార్ బోర్డు అధికారి, వెంకటేశ్వర క్రియేషన్స్, డీజీపీ తదితరులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం వ్యాజ్యంపై విచారణ జరపనుంది.
డీజే సినిమాలోని శృంగార గీతాల్లో అభ్యంతరకర పదాలున్నాయని..వాటిని తొలగించేలా చర్యలు తీసుకోవాలని సెన్సార్ బోర్డు అధికారులకు వినతిపత్రం సమర్పించినా పరిగణనలోకి తీసుకోలేదని, మరో ప్రత్యామ్నాయం లేక హైకోర్టును ఆశ్రయించామని పిటిషనర్ తెలిపారు. నమకం, చమకం వంటి పదాలను శృంగార గీతాల్లో నుంచి తొలగించే వరకు డీజే ప్రదర్శనపై నిషేధం విధించేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కృష్ణమోహన్ కోరారు.