* ఫలితాల కోసం ప్రత్యేక కసరత్తు
* విద్యార్థుల ప్రగతి అంచనా పనిలో విద్యాశాఖ
* ప్రతి మండలానికి ఏడుగురు సభ్యుల కమిటీ
* వెనుకబడిన వారిని గుర్తించేందుకు చర్యలు
* ప్రత్యేక తరగతుల నిర్వహణకు సన్నాహాలు
* అల్పాహారం కోసం ఉన్నతాధికారుల అనుమతి
ఖమ్మం:
పదో తరగతిలో మెరుగైన ఫలితాల కోసం జిల్లా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఈ విద్యాసంవత్సరం సిలబస్, పరీక్షా విధానం మారడంతో ఫలితాలు ఏలా ఉంటాయోనని పకడ్బందీ ప్రణాళిక రూపొందించింది. ఉత్తమ ఫలితాలు సాధించాలంటే గతంకంటే ఎక్కువ కష్టపడాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. ప్రతి పాఠశాలలో విద్యార్థుల స్థాయిని గుర్తించి..దానికి అనుగుణంగా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టిపెట్టారు. జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులు, ప్రముఖులతో జిల్లా విద్యాశాఖాధికారి ఇటీవల సమావేశమై కార్యాచరణ, విధివిధానాలు ఖరారు చేశారు.
మండలానికో ఏడుగురు సభ్యుల కమిటీ
విద్యార్థుల స్థాయిని గుర్తించేందుకు మండలానికో ఏడుగురు సభ్యులు కమిటీని ఏర్పాటు చేస్తారు. సబ్జెక్టుకు ఒకరు చొప్పున ఏడుగురు కమిటీ సభ్యులను ఎంపిక చేస్తారు. మండలంలోని ప్రభుత్వ ఉన్నతపాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు, లేదా సీనియర్ స్కూల్ అసిస్టెంట్‌ను కమిటీ సభ్యులుగా తీసుకుంటారు. ఇలా ఏడుగురు సభ్యులు మండలంలోని హైస్కూల్స్‌లో చదువుతున్న పదో తరగతి విద్యార్థుల ప్రగతిని పరిశీలిస్తారు.
ప్రగతి అంచనా వేసేది ఇలా..
పదో తరగతిలో గతంకంటే మెరుగైన ఫలితాలు సాధించాలి. రాష్ట్రంలో జిల్లాను ప్రథమంగా నిలపాలి అని జిల్లా ఉన్నతాధికారులు విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. ఈ మేరకు నూరుశాతం ఫలితాల సాధనకు ముందుగా విద్యార్థుల స్థాయిని అంచనా వేయాలని విద్యాశాఖాధికారులు భావించారు. ఈ ఏడుగురు సభ్యుల బృందం స్కూల్స్‌కు వెళ్తుంది. ఇప్పటి వరకు పూర్తయిన సిలబస్, ప్రాజెక్టు వర్క్ వివరాలు, విద్యార్థి అవగాహన స్థాయి, సాధించిన ప్రగతి, ఇంతకుముందు నిర్వహించిన పరీక్షల్లో వచ్చిన మార్కుల వివరాలు సేకరిస్తుంది. ఈనెల చివరి వరకు ఈ బృందం సేకరించిన వివరాలతో ఓ నివేదిక తయారు చేస్తుంది. అనంతరం పాఠశాలల్లో అదనపు తరగతుల నిర్వహణ, వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు, నూతన పరీక్ష విధానానికి అనుగుణంగా విద్యార్థులను సిద్ధం చేస్తారు. ఫిబ్రవరిలో ఇదంతా పూర్తి చేసి, మార్చిలో ఈ బృందం మళ్లీ పాఠశాలలకు వెళ్తుంది. విద్యార్థుల్లో వచ్చిన మార్పును గమనిస్తుంది. ఇంకా వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక క్లాస్‌లు మళ్లీ నిర్వహిస్తుంది.
ప్రత్యేక తరగతుల నిర్వహణ
చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు తీసుకోవాలనే యోచనలో విద్యాశాఖ ఉంది. ఇందుకోసం పాఠశాల పనివేళల్లో కాకుండా ఉదయం, సాయంత్రం క్లాస్‌లు నిర్వహిస్తారు. సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు విద్యార్థులు స్కూల్ నుంచి ఇంటికి వెళ్లకుండా సాయంత్రం వేళలో అల్పాహారం ఇస్తారు. దీనికోసం ఏజెన్సీలో ఐటీడీఏ, మైదాన ప్రాంతంలో జిల్లా పరిషత్ నుంచి అల్పాహారం తయారీకి నిధులు మంజూరు చేసేందుకు అధికారులు అంగీకరించినట్లు తెలిసింది. అల్పాహారం కోసం విద్యాకమిటీ చైర్మన్లు, సేవా సంఘాలు, వ్యాపార ప్రముఖులు, పూర్వ విద్యార్థులు, దాతల సహకారం కూడా తీసుకోవాలని విద్యాశాఖ భావిస్తోంది. ఇవన్నీ పక డ్బందీగా అమలైతే రాష్ట్రంలోనే జిల్లా ముందుంటుందనడంలో అనుమానం లేదు. ఇందుకు ఉపాధ్యాయులు, పాఠశాల విద్యా కమిటీలు, అధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు ఏవిధంగా సహకరిస్తారనేదానిపైనే ఫలితాలు ఆధారపడి ఉంటాయి.
పకడ్బందీగా పది
Published Thu, Jan 22 2015 9:10 AM | Last Updated on Fri, Sep 28 2018 4:43 PM
Advertisement
Advertisement