సిద్దిపేట అర్బన్: దేశ వికాసానికి మూలమైన విద్యపై విషం చిమ్ముతున్నారని సంఘటిత పోరాటంతో అడ్డుకోకుంటే ప్రమాదమని తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నందిని సిధారెడ్డి హెచ్చరించారు. సిద్దిపేట ఎన్‌జీఓ భవన్‌లో సోమవారం రాత్రి విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ విద్యారంగంలో విలువలు మంటగలిసి పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యలో వ్యాపారీకరణ పెరుగుతోందన్నారు. పాలకుల బాధ్యతా రాహిత్యం వల్ల ఏర్పడుతున్న సంక్షోభాన్ని ఎదుర్కోవాలన్నారు. ప్రభుత్వ యాజమాన్యంలోనే విద్యా రంగం ఉండాలన్నారు.
టీవీ, సినిమాల ప్రభావం విద్యార్థులను శాసించే స్థాయికి ఎదగడం సరికాదన్నారు. హైదరాబాద్ యునివర్సిటీ ప్రొఫెసర్ కె. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రశ్నించలేని వారు మేధావులు కాదన్నారు. పెట్టుబడి దారులు విద్యను ధ్వంసం చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం విద్యను కాషాయీకరణ దిశగా మళ్లించడం సరికాదన్నారు. అమెరికా, యూరప్‌లో కామన్ స్కూల్ విద్య కొనసాగుతుండగా ఇక్కడెందుకు అమలు కావడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నాలుగు లక్షల మంది బాల కార్మికులను విద్యా స్రవంతిలో కలపాలన్నారు.
71 శాతం ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు సరిగా లేరని, 76 శాతం పాఠశాలల్లో గదులు సరిగా లేవన్నారు. కాంట్రాకుటు బోధన ప్రమాదకరమన్నారు. ప్రభుత్వం అందరికి సమాన విద్యను అమలు చేస్తేనే సమసమాజం ఏర్పడుతుందన్నారు. సమావేశానికి విద్యా పరిరక్షణ కమిటీ జిల్లా కన్వీనర్ తిరుపతిరెడ్డి అధ్యక్షత వహించగా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ స్వాగతం పలికారు.
సభలో గురుకుల పాఠశాలల సంఘం అధ్యక్షుడు రవిచంద్రన్, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి సభ్యులు పాపయ్య, జేఏసీ పశ్చిమ జిల్లా కన్వీనర్ అశోక్‌కుమార్, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు గౌతం ప్రసాద్, కార్యదర్శి యాదగిరి, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు స్టాలిన్, డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కిష్టప్ప, జేవైఎల్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్, టీపీఎఫ్ రాష్ట్ర నేతలు సత్తయ్య, నర్సింలు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు సిద్దిపేట హైస్కూల్ నుంచి మెదక్ రోడ్డు, పాతబస్టాండ్, సుభాష్‌రోడ్, మెయిన్ రోడ్ల మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు.
విద్యారంగంపై విషం
Published Tue, Nov 25 2014 1:05 AM | Last Updated on Sat, Sep 2 2017 5:03 PM
Advertisement
Advertisement