కలర్ జిరాక్సులతో మార్కుల పెంపు
నకిలీ మార్కులతో మెరిట్ జాబితా
అసలైన అభ్యర్థులకు మొండిచేయి
వైద్య నియామకాల్లో గోల్‌మాల్
బీహర్‌లో జరిగిన నకిలీ ప్రతిభావంతుల స్కాం తరహా గోల్‌మాల్ వ్యవహారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నియూమకాల్లో చోటు చేసుకుంది. బీహార్ కుంభకోణంలో జవాబు పత్రాలను మూల్యాంకనం చేసిన వ్యక్తులు ఎక్కువ మార్కులు వేశారు. వరంగల్‌లో మార్కులు వేసుకునే అవకాశం సైతం అభ్యర్థులకే కల్పించారు. అర్హత కలిగిన అభ్యర్థుల నోట్లో మట్టి కొట్టారు.
హన్మకొండ : జాతీయ ఆరోగ్య రక్ష పథకంలో భాగంగా పట్టణ ఆరోగ్య కేంద్రాలలో సేవలను మెరుగుపరిచేందుకు జిల్లాలోని 12 అర్బన్ హెల్త్ సెంటర్లలో 131 పోస్టుల భర్తీ ప్రక్రియకు ఆమోదముద్ర వేస్తూ ప్రభుత్వం మే నెలలో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎలాంటి అవకతవకలు, పైరవీలకు తావ్వికుండా ఉద్యోగ నియూమకాలు చేపట్టాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నియూమక ప్రక్రియకు ప్రత్యేకమైన మార్గదర్శకాలను పేర్కొంటూ ఉత్తర్వులను సైతం వెలువరించింది. ఇందులో మెరిట్, రూల్ ఆఫ్ రోస్టర్ ఆధారంగా పారదర్శకంగా నియూమకాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌తో పాటు రాష్ట్ర అధికారులు స్పష్టం చేశారు. కానీ, కొంత మంది అభ్యర్థులు ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలనే చాకచాక్యంతో నకిలీ సర్టిఫికెట్ల తయారీకి తెరతీశారు.
ఈ క్రమంలో కొత్త ఎత్తుగడలకు తెరలేపారు. ఏకంగా మెరిట్‌ను నిర్ధారించే మార్కుల లిస్టు జాబితాలో మార్పులు చేశారు. మెరిట్ జాబితాలో అందరికంటే ముందుగా ఉండేందుకు వీలుగా వివిధ సబ్జెక్టుల్లో వచ్చిన మార్కులను పెంచుకున్నారు. ఇందు కోసం కలర్ జిరాక్స్‌లు ఉపయోగించుకున్నారు. టెన్త్, ఇంటర్మీడియట్, ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం, ఎంఎల్‌టీ తదితర కోర్సుల్లో వాస్తవంగా వ చ్చిన మార్కుల కంటే ఎక్కువ మార్కులను ఫోర్జరీ చేసి వేసుకున్నారు. కలర్ జిరాక్సుల ద్వారా అసలును పోలినటువంటి నకిలీ ధ్రువపత్రాలతో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు.
మెరిట్ లీకులు..
నకిలీ ధ్రువపత్రాలతో మెరిట్ పెంచుకునేందుకు వ్యూహం అమలు చేయడంలో వైద్య ఆరోగ్యశాఖకు చెందిన కొందరు ఉద్యోగులు కూడా సహకరించినట్లుగా తెలుస్తోంది. నిబంధనల ప్రకారం ఉద్యోగార్థులు చేసుకున్న దరఖాస్తుల ఆధారంగా అర్హత పరీక్షల్లో వారు సాధించిన మార్కులను బట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓపెన్, మహిళా కేటగిరీల వారీగా జాబితాను రూపొందించారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖలో ఉన్న కొందరు ఉద్యోగులు ఆయా కేటగిరీల వారీగా మెరిట్ జాబితాలో ముందు వరుసలో ఉన్న అభ్యర్థులు సాధించిన మార్కులు (కట్ ఆఫ్) వివరాలను తమను ‘సంప్రదించిన’ వారికి వెల్లడించినట్లుగా తెలుస్తోంది. వీటి ఆధారంగా ఆయా కేటగిరీల వారీగా అధిక మార్కులు ఉండేలా కొందరు అభ్యర్థులు ప్రణాళిక రూపొందించారు. కంప్యూటర్, స్కానర్, కలర్ జిరాక్స్‌ల ద్వారా వివిధ పరీక్షల్లో అధిక మార్కులు పొందినట్లు నకిలీ ధ్రువపత్రాలను సృష్టించారు. దీంతో నకిలీ మార్కులు ఉన్న అభ్యర్థులు మెరిట్ జాబితాలో పై వరుసలోకి వచ్చారు.
లోగుట్టులో లొసుగులు
వైద్య నియూమకాల్లో ఎటువంటి అవినీతికీ తావివ్వబోమని, పారదర్శకంగా ప్రక్రియ చేపడతామని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటిస్తూ వచ్చారు. అందుకు తగ్గట్లుగానే మెరిట్ జాబితాను ప్రకటించారు. అనంతరం మిగిలిన పనులు పూర్తి చేసి ఇటీవల నియామక పత్రాలు జారీ చేశారు. అసలైన మెరిట్ జాబితాను వెల్లడించడం, నకిలీ మార్కుల ఆధారంగా కొత్త జాబితా రూపకల్పన వంటి పనులు కోసం ఒక్కో అభ్యర్థి నుంచి దాదాపు రెండు లక్షల రూపాయలు తీసుకున్నట్టు సమాచారం. ఈ తెరవెనక జరిగిన తతంగంలో పాలుపంచుకున్న వ్యక్తుల మధ్య పంపకాల విషయంలో బేధాభిప్రాయాలు రావడంతో విషయం బయటకు పొక్కింది.
పత్రాలు పరిశీలిస్తే..
వైద్య ఆరోగ్యశాఖ చేపడుతున్న నియామకాల సందర్భంగా ధ్రువపత్రాల పరిశీలన తూతూమంత్రంగా జరుగుతోంది. దీన్ని ఆసరాగా తీసుకుని ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి నకిలీ మార్కుల దందాకు తెరలేపారు. ప్రస్తుతం నియామకపత్రాలు అందుకున్న వారి విద్యార్హత ధ్రువపత్రాలను ఆయా బోర్డుల పరిశీలనకు పంపితే నిజానిజాలు వెలుగు చూసే ఆస్కారం ఉంది. వైద్య ఆరోగ్యశాఖ నియామకాలపై నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తే అనర్హుల చేతిలో ప్రజల ప్రాణాలు ఫణంగా పెట్టినట్టు అవుతుంది. అంతేకాదు అర్హతలు కలిగిన వారికి అన్యాయం చేసినట్టవుతుంది.
పారదర్శకంగా జరిగాయి.. : బి.సాంబశివరావు, డీఎంహెచ్‌ఓ
జాతీయ ఆరోగ్య రక్ష పథకంలో భాగంగా చేపట్టిన నియామకాల ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరిగింది. ఎటువంటి అక్రమాలకూ తావు ఇవ్వలేదు. ఎవరైనా సందేహాలు వ్యక్తం చేస్తే తీర్చేందుకు సిద్ధంగా ఉన్నాం. నియామకాల ప్రక్రియ ఇంకా పూర్తిగా ముగియలేదు. కొన్ని విభాగాలకు సంబంధించి ఇంకా కొనసాగుతోంది. ఫార్మసిస్టులు 31 మందిలో 16 మంది రిపోర్టు చేశారు. మిగిలిన వారి విషయంపై ఆరా తీస్తున్నాం. అదేవిధంగా సోషల్ వర్కర్, డీఈఐసీ మేనేజర్ పోస్టుల నియామకం విషయంలో మరింత వివరణ కావాలని ప్రభుత్వానికి లేఖ రాశాము.
కలరింగ్ మెరిట్
Published Sat, Jul 16 2016 1:45 AM | Last Updated on Tue, Oct 9 2018 7:11 PM
Advertisement
Advertisement