విద్యాసంస్థలన్నీ విద్యాశాఖ పరిధిలోకే..
♦ కాలేజీలు, వృత్తి విద్య, స్టడీ సర్కిళ్లన్నీ విలీనం
♦ మెడికల్, అగ్రికల్చర్, ఫార్మాకు మినహాయింపు
♦ త్వరలో తెలంగాణ నూతన విద్యా విధానం
♦ వచ్చే విద్యా సంవత్సరం నాటికి రూపకల్పన
♦ డిప్యూటీ సీఎం కడియంతో చర్చించిన సీఎం కేసీఆర్
♦ అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని సీఎస్‌కు ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్న అన్ని రకాల విద్యా సంస్థలను విద్యాశాఖ పరిధిలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. మెడికల్, అగ్రికల్చర్, ఫార్మా మినహా మిగతా అన్ని రకాల, అన్ని స్థాయిల విద్యా సంస్థల నిర్వహణ బాధ్యత విద్యా శాఖకే అప్పగించాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించి అన్ని అంశాలను అధ్యయనం చేయడంతో పాటు విద్యార్థులకు ఉద్యోగావకాశాలను మెరుగుపరిచే నూతన విద్యా విధానం రూపొందించాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మను ఆదేశించారు.
మంగళవారం క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం, సంబంధిత అధికారులతో విద్యా శాఖను ప్రక్షాళన చేసే అంశంపై సీఎం కేసీఆర్ చర్చించారు. ప్రస్తుత విద్యా విధానం వల్ల విద్యార్థులు నిరుద్యోగులుగా మారుతున్నారు తప్ప ఉద్యోగావకాశాలు పొందలేకపోతున్నారని సీఎం అభిప్రాయపడ్డారు. అందుకే పరిస్థితులకు అనుగుణంగా అవసరమయ్యే విద్యను అందించేవిధంగా రాష్ట్ర విధానం ఉండాలని సూచించారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి విధాన రూపకల్పన జరగాలని చెప్పారు.
ఉద్యోగమే లక్ష్యంగా విద్య
విద్యార్థులకు అవసరమైన విద్యా ఉద్యోగావకాశాలు పెంచే శిక్షణ అందడం లేదని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. రాష్ట్రంలో, దేశంలో ఏయే ఉద్యోగావకాశాలున్నాయో తెలుసుకుని, వాటికి అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దే పని కూడా జరగడం లేదని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. రాష్ట్ర స్థాయిలో నిర్వహించే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, జాతీయ స్థాయిలో నిర్వహించే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్వహిస్తున్న పరీక్షల గురించి మాత్రమే విద్యార్థులైనా ప్రభుత్వమైనా దృష్టి పెడుతోంది. ఈ రెండు కాకుండా దేశవ్యాప్తంగా ఉద్యోగావకాశాలున్న అనేక పోటీ పరీక్షలున్నాయి.
రక్షణ, రైల్వే, బ్యాంకింగ్ తదితర రంగాల్లో ఉద్యోగావకాశాలున్నా, వాటికి సంబంధించిన సమాచారం విద్యార్థులకు అందడం లేదు. వీటికి తోడు దేశవ్యాప్తంగా ఉద్యోగావకాశాలున్న రంగాలెన్నో పెరుగుతున్నాయి. వీటికి అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. అవసరాలకు తగిన విధంగా విద్యార్థులు కోర్సులను ఎంపిక చేసుకోవటం లేదు. తెలంగాణ రాష్ట్రంలో డాక్టర్లు ఎంత మంది కావాలి..? ఇంజనీర్లు ఎందరు కావాలి..? ఇంకా ఏయే ఉద్యోగాలకు ఎంత మంది కావాలి..? అనే అంచనా విద్యాశాఖకు ఉండాలి. దీంతో విద్యార్థులను ఆయా ఉద్యోగాల దిశగా సిద్ధం చేసే అవకాశం ఉంటుంది. కాగా, గతంలో దేశవ్యాప్తంగా మోడల్ స్కూళ్లను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కొన్ని రాష్ట్రాలు మోడల్ స్కూళ్ల ప్రతిపాదనలు తిరస్కరించాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని మోడల్ స్కూళ్ల విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు.
విద్యా వ్యవస్థ ప్రక్షాళన
మొత్తంగా విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. బడ్జెట్ రూపకల్పన సందర్భంగా వివిధ శాఖల గురించి కూలంకషంగా అధ్యయనం చేస్తున్న ప్రభుత్వం, అందులో భాగంగా విద్యా శాఖపై దృష్టి పెట్టినపుడు వివిధ అంశాలు సీఎం దృష్టికి వచ్చాయి. విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. పాఠశాలలు, కళాశాలలు, వృత్తి విద్యా సంస్థలు, స్టడీ సర్కిళ్లు.. ఇలా వేర్వేరు విద్యా సంస్థలు వేర్వేరు శాఖల నిర్వహణలో ఉన్నాయి. ఇటీవల ప్రభుత్వం మైనారిటీల కోసం 60 రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభించాలని నిర్ణయించింది. మైనారిటీ సంక్షేమ శాఖ ద్వారా నిధులు విడుదల చేసి, విద్యాశాఖ నిర్వహణ, నియంత్రణలో రెసిడెన్షియల్ స్కూళ్లు ఉంచాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.
ఇదే తరహాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ తదితర శాఖల నిధులతో నడిచే విద్యాసంస్థలు, సొసైటీలు, స్టడీ సర్కిళ్లు ఉన్నాయి. కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఐటీఐలు నడుస్తున్నాయి. ఎవరికివారుగా విద్యా సంస్థలను నిర్వహించడంతో సమగ్రత లోపించింది. అందుకే వీటన్నింటినీ విద్యా శాఖ కిందికి తేవాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు.