పర్యావరణ పరిరక్షణకు కృషి
మంచిర్యాల టౌన్ : ప్రజా సంక్షేమంతో పాటు పర్యావరణ పరిరక్షణకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. ఆదివారం మంచిర్యాలలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మూడేళ్ల ప్రణాళికలో భాగంగా రూ.230 కోట్లతో మొక్కల పెంపకం చేపట్టనున్నట్లు తెలిపారు. ఇంటింటా మరుగుదొడ్డి నిర్మించుకునేందుకు మహిళల్లో చైతన్యం రావాలన్నారు.
రాష్ట్రంలో ఆర్‌అండ్‌బీ ద్వారా నిర్మించనున్న 506 కిలో మీటర్ల బీటీ రోడ్లకు రూ.1230 కోట్లు, పంచాయతీరాజ్ ద్వారా నిర్మించనున్న 1790 కిలో మీటర్ల బీటీ రోడ్లకు రూ.257 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. అర్హులందరికీ ఆహారభద్రత కార్డులు, పింఛన్లు అందేలా చూస్తామన్నారు. ఇంటింటా కుళాయి ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరించి సాగు విస్తీర్ణాన్ని పెంచుతామన్నారు. ఎమ్మెల్యే దుర్గం చిన్న య్య, మున్సిపల్ చైర్ పర్సన్ వసుంధర, వైస్ చైర్మన్ శంకర్, నాయకులు రాజయ్య, శంకర్ పాల్గొన్నారు.
దురుద్దేశంతోనే ఆరోపణలు..
బెల్లంపల్లి : దురుద్దేశంతోనే ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అసత్య ఆరోపణలు చేస్తున్నాయని మంత్రి జోగు రామన్న అన్నారు. ఆదివారం బెల్లంపల్లికి వచ్చిన ఆయన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వచ్చే నాలుగేళ్లలోపు ప్రతీ ఇంటికి నల్లా కనెక్షన్ ఇప్పించి తాగునీటి సమస్య లేకుండా చూస్తామన్నారు. చంద్రబాబు పాలనలోనే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, రైతులపై చిత్తశుద్ధి ఉంటే అప్పటి మృతుల కుటుంబాలకు ఆర్థికసాయం అందించి ఆదుకోవాలని హితవు పలికారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మున్సిపల్ చైర్‌పర్సన్ సునీతారాణి, వైస్ చైర్మన్ ఎన్.సత్యనారాయణ, ఎంపీపీ పి.సుభాష్‌రావు, టీఆర్‌ఎస్ నాయకులు ఆర్.ప్రవీణ్, ఎస్.నర్సింగం పాల్గొన్నారు.
మున్నూరు కాపుల అభ్యున్నతికి కృషి
మంచిర్యాల టౌన్ : మున్నూరు కాపు కుల బాంధవుల అభ్యన్నతికి తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. ఆదివారం మంచిర్యాలలో మున్నూరుకాపు సంఘం పట్టణ గౌరవ అధ్యక్షుడు గొంగళ్ల శంకర్ నివాస గృహానికి మంత్రి రామన్న ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరు కాగా ఆయనను ఘనంగా సన్మానించారు. మున్నూరు కాపు కులస్తుల సంక్షేమానికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు.
ఐక్యతగా రాణిస్తూ మున్నూరు కాపులు రాజకీయాల్లో కూడా రాణించాలని సూచించారు. పిల్లలు ఉన్నత చదువుల్లో రాణించేలా వారికి తల్లిదండ్రులు తగిన ప్రోత్సాహం అందించాలన్నారు. మంత్రి వెంట బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మందమర్రి తహశీల్దార్ ఇత్యాల కిషన్, మున్సిపల్ వైస్‌చైర్మన్ నల్ల శంకర్, వేంపల్లి సర్పంచ్ డేగ బాపు, మున్నూరు కాపు సంఘం సభ్యులు రాజయ్య, సత్యం, శ్రీనివాస్, సంతోష్, సత్యనారాయణ, బొలిశెట్టి కిషన్, ఆకుల దిలీప్, పానగంటి శ్రీనివాస్, బొడ్నాల శ్యాం, దీటి రవి పాల్గొన్నారు.