పోషకాహారంలో అగ్రభాగాన నిలిచే కోడిగుడ్డు సామాన్యులకు అందకుండా పోతోంది. దానికి భిన్నంగా చికెన్ ధర నేలచూపులు చూస్తోంది. ఇప్పటికే కూరగాయల ధరలు మండిపోతుండగా, ఇప్పుడు కోడిగుడ్డు ధర కూడా పెరగడంతో జనాలు బెంబేలెత్తుతున్నారు. మొన్నటి దాక రూ.4 పలికిన గుడ్డు ధర ఇప్పుడు అమాంతం రూ.6కి పెరిగింది. దీంతో కోడిగుడ్డు ధర వింటేనే సామాన్యులు అమ్మో అంటున్నారు. అలాగే వారంలో కిలో చికెన్ ధర రూ.40 తగ్గింది. దీంతో మాంసప్రియులకు ఇది శుభవార్తే అయ్యింది. మార్కెట్‌లో గుడ్ల ఉత్పత్తి తగ్గడం, కోళ్ల పెంపకం పెరగడంతోనే ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటున్నాయని వ్యాపారులు పేర్కొంటున్నారు.
మోర్తాడ్(బాల్కొండ): కోడిగుడ్డు తినండి.. ఆరోగ్యంగా ఉండండి.. అంటూ నిత్యం పత్రికల్లో, టీవీల్లో ప్రకటనలు చూస్తూనే ఉంటాం. అలాంటి పోషకాహారమైన గుడ్డు ధర ప్రస్తుతం రూ.6 పలుకుతోంది. ఇంట్లో కూరగాయలు లేకపోతే ఉడికించిన గుడ్డుతోనో, లేదా ఆమ్లెట్‌తోనో ఆ పూటకు సరిపెట్టుకునే వారు న్నారు. తక్కువ ధరకే దొరికే బలవర్ధక ఆహారం కావడంతో చిన్నపిల్లల ఆహారంలోనూ గుడ్డుకు ప్రాధాన్యత ఉంది. సాధారణంగా మూడు, నాలు గు రూపాయల ధర ఉండే గుడ్డు ఇప్పుడు రూ.6కి చేరింది. మారుమూల గ్రామాల్లో అయితే రూ.7కు కూడా అమ్ముతున్నారు. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు, వినియోగం పెరగడంతో ధర పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఏటా డిసెంబర్‌లో గుడ్ల ధరలు పెరుగుతుంటాయి. కానీ, ఈ ఏడాది నవంబరులోనే ధర గరిష్ట స్థాయికి చేరింది. ఇప్పటికే కూరగాయల ధరలు మండిపోతుండగా ప్రస్తుతం గుడ్డు ధర కూడా సామాన్యులు కొనలేని స్థాయికి చేరింది.
తగ్గిన చికెన్ ధర..
కోళ్ల పెంపకం పెరగడంతో చికెన్ రేట్లు తగ్గినట్టు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. రేట్లు తగ్గడంతో మాంసప్రియులు చికెన్‌ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం కోడి లైవ్ కిలోకు హోల్‌సెల్ ధర రూ.50 నుంచి రూ.60గా ఉండగా, గతంలో రూ.90 నుంచి రూ.100 ఉంది. అలాగే చికెన్ స్కిన్‌తో కిలోకు రూ.130 నుంచి రూ.140 వరకు ధర ఉండగా, ఇప్పుడు రూ.90 నుంచి రూ.100కు తగ్గింది. స్కిన్‌లెస్ చికెన్ కిలోకు రూ.160 నుంచి రూ.170 వరకు ఉన్న ధర, ఇప్పుడు కిలోకు రూ.130 నుంచి రూ.140కి తగ్గింది. చికెన్ ధరలు మార్కెట్‌లో పతనం కాగా కోడి గుడ్డు ధర మాత్రం అమాంతం పెరిగింది.
మార్కెట్లో కోడిగుడ్లకు కొరత..
పౌల్ట్రీ పరిశ్రమలో కోడిగుడ్లకు సంబంధించిన షెడ్లు వేరుగా, బాయిలర్ చికెన్ ఉత్పత్తి కోసం కోళ్లు పెంచడానికి షెడ్లు వేరుగా ఉంటాయి. అంతేకాక కొంతమంది పౌల్ట్రీ వ్యాపారులు కేవలం గుడ్ల ఉత్పత్తికి మొగ్గు చూపుతుండగా, మరికొందరు కోళ్లను పెంచడంపై ఆసక్తి కనబరుస్తున్నారు. రెండు, మూడు సంవత్సరాల నుంచి కోడిగుడ్లకు సంబంధించిన పరిశ్రమ నష్టాలను చవిచూసింది. దీంతో గుడ్ల ఉత్పత్తి తగ్గిపోవడంతో మార్కెట్‌లో కోడిగుడ్లకు కొరత ఏర్పడింది. అందువల్లనే గుడ్ల ధరలు అమాంతం పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. కాగా బాయిలర్ కోళ్ల ఉత్పత్తి గతంలో కంటే ఎక్కువగా ఉండటంతో మార్కెట్‌లో చికెన్ సరఫరా బాగానే ఉంది. దీంతో చికెన్ ధరలు తగ్గిపోయాయని వ్యాపారులు తెలిపారు. కోడి, గుడ్డు ధరల్లో భిన్నమైన మార్పులు చోటు చేసుకోవడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment