సాక్షి, దమ్మపేట: ఎన్నికల వేళ..ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారానే వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు విస్తృత ప్రచారం చేసుకుంటున్నారు. ఇటీవల కాలంగా గ్రామాల్లో వాట్సాప్ గ్రూపుల సంఖ్య బాగా పెరిగిపోయింది. ఓట్లే లక్ష్యంగా నాయకులు ప్రతి అవకాశాన్ని తమదైన శైలిలో ఉపయోగించుకుంటున్నారు. అందులో భాగంగా రాజకీయ పార్టీల నాయకులు సామాజిక మాధ్యమాన్ని బాగా వినియోగించుకుంటున్నారు. నాయకులు, వారి అనుచరులు గ్రూపు అడ్మిన్లుగా ఉంటూ పార్టీల వారీగా గ్రామ, మండల, నియోజకవర్గస్థాయిలో విస్తృతంగా వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఒక పార్టీలోని ఒక్కొక్క సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల ద్వారా వాట్సాప్ గ్రూపులు ఏర్పడుతున్నాయి.
ఇంకా ఫేస్‌బుక్, ఇతర సోషల్ మీడియా యాప్‌లను వినియోగించుకుంటున్నారు. అందులో ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సామాజిక వర్గాల వారీగా సంఖ్యను క్రమంగా పెంచుకుంటూ..తమ అభిప్రాయాలను, పార్టీ కార్యక్రమాలను తెలియజేస్తున్నారు. ఇటీవల కాలంగా రాజకీయాలు అస్తవ్యస్తంగా మారాయి ఏ నాయకుడు, కార్యకర్త ఏ పార్టీలో ఉన్నాడో.. ఏ పార్టీకి మద్దతు ఇస్తున్నాడో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో ఎవరు ఏ గ్రూప్‌లో ఏం పోస్టు చేస్తున్నారో.. కొన్నిసార్లు ఒక పార్టీకి చెందిన గ్రూప్‌లో ఆ పార్టీకి చెందిన వ్యతిరేక ప్రచార ఫొటోలు, వీడియోలు పోస్ట్‌లు చేసుకుంటున్నారు. దీంతో అక్కడక్కడా ఇబ్బందులు తప్పట్లేదు. సామాజిక వర్గాల గ్రూపులో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఏ గ్రూప్‌లో ఎవరిని చేరుస్తున్నారో.. ఎవరిని తొలగిస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. విచ్చలవిడిగా పోస్టులు చేస్తుండటంతో కొంతమంది సభ్యులు గ్రూపుల నుంచి బయటకు (ఎగ్జిట్) అవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment