ప్రచార సభలో మాట్లాడుతున్న పరిపూర్ణానంద స్వామి. చిత్రంలో బీజేపీ ఖమ్మం అభ్యర్థి ఉప్పల శారద
ఖమ్మంమామిళ్లగూడెం: ‘మొన్నటి వరకు ఖమ్మం కమ్యూనిస్టుల గుమ్మం.. ఇకనుంచి కమలం గుమ్మంగా మారనుంది.. 2018 డిసెంబర్ నుంచి కాషాయానికి పట్టుగొమ్మగా నిలవనుంది’ అని బీజేపీ స్టార్ క్యాంపెయినర్ పరిపూర్ణానంద స్వామి అన్నారు. ఖమ్మం నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఉప్పల శారద గెలుపును ఆకాంక్షిస్తూ నగరంలోని పెవిలియన్ గ్రౌండ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఖమ్మంలో అడుగు పెట్టగానే తనకు కమల వికాసం కనిపించిందన్నారు. ఖమ్మంలో వ్యాపారులు, మహిళలు, ఉద్యోగులపై దాడులు రోజురోజుకూ పెరుగుతున్నాయని, రౌడీ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ఆయన విమర్శించారు.
వచ్చే నెల 7వ తేదీన అందరూ తమ బద్ధకాన్ని వీడి.. ఓటు వేసి.. రౌడీ రాజకీయాలను పారదోలాలన్నారు. ఒక్కరోజు ఓటు వేస్తే ఐదేళ్లు తమను తాము కాపాడుకోగలుగుతామని వివరించారు. మోసం, దగా చేసిన టీఆర్‌ఎస్ పార్టీకి ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలన్నారు. గతంలో ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కిందని, బీజేపీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో 6లక్షల ఉద్యోగాలు కల్పిస్తుందన్నారు. కచ్చితంగా రాష్ట్రంలో కమలం వికసిస్తుందని, ‘కారు’ చీకట్లు తొలగిపోతాయని ఆయన పేర్కొన్నారు. ఖమ్మం పరిసర ప్రాంతాల్లో రైతులను టీఆర్‌ఎస్ మోసం చేసిందని, గత ప్రభుత్వాల పరిస్థితి కూడా అదేనని అన్నారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు నానాటికీ పెరిగిపోతున్నాయని, బీజేపీ అధికారంలోకి రాగానే రైతులకు భారంగా మారిన రుణాలను మాఫీ చేస్తుందన్నారు. విద్యార్థులకు చదువు తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలు లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఒక్కో విద్యార్థిపై లక్షల రూపాయల అప్పులను టీఆర్‌ఎస్ ప్రభుత్వం మిగిల్చిందన్నారు. బీజేపీ.. విద్యార్థులపై ఉన్న రూ.6,850కోట్ల అప్పులను మాఫీ చేసి.. ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని హామీ ఇచ్చారు. బీజేపీ అధికారంలోకి రాగానే లక్ష గోవులను పంపిణీ చేసి సంప్రదాయాలను కాపాడుతుందని చెప్పారు. పూజించే గోవులపై, సంస్కృతిపై దాడి చేసే వారికి గుణపాఠం చెబుతుందన్నారు. త్రిబుల్ తలాక్‌ను రద్దు చేసి.. ముస్లిం మహిళలకు ప్రధాని మోదీ పెద్దన్నగా నిలిచారన్నారు. మహిళలను కాపాడేందుకే బేటీ బచావో.. బేటీ పడావో పథకాన్ని తీసుకొచ్చారన్నారు. ముస్లింలు.. ముస్లింలని పాకులాడుతున్న టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు.. ముస్లింల సంక్షేమానికి ఏం చేశాయో చెప్పాలన్నారు.
ఖమ్మంలోని ముస్లింలంతా బీజేపీకి ఓటు వేసి ఉప్పల శారదను గెలిపించాలన్నారు. కార్యకర్తలు రేయింబవళ్లు పనిచేసి ఖమ్మంలో బీజేపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. నగరంలో రోడ్లు, డ్రెయినేజీ వ్యవస్థ అధ్వానంగా ఉందని, కాలుష్యం విపరీతంగా పెరిగిపోయిందన్నారు. కారు గుర్తు.. హస్తం గుర్తు పెద్ద కాలుష్యంగా మారాయన్నారు. ప్రజాకూటమికి ఓటు వేస్తే ఇరిటేషన్‌కు ఓటు వేసినట్లేనన్నారు. ఈ ఎన్నికల్లో తల్లి కావాలో.. లొల్లి కావాలో తేల్చుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు.
బీజేపీ అంటేనే బీసీల పార్టీ అని.. బడుగు, బలహీన వర్గాల హక్కులను కాపాడే పార్టీ అని అన్నారు. బీజేపీ ఖమ్మం అభ్యర్థి ఉప్పల శారద మాట్లాడుతూ ధన రాజకీయాలకు స్వస్తి పలకాలని, అభివృద్ధి చేసే పార్టీలను అధికారంలోకి తీసుకురావాలన్నారు. ఎన్నికల్లో తనకు ఓట్లు వేసి గెలిపిస్తే ఖమ్మంను మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తానన్నారు. సభలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సన్నె ఉదయ్‌ప్రతాప్, పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు గంటెల విద్యాసాగర్, దొంగరి సత్యనారాయణ, కోకిల మంజుశ్రీ, దుద్దూకూరి వెంకటేశ్వర్లు, యాదగిరిరెడ్డి, తాడం మురళి, బాల్దూరి శివ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment