తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.. వారంలో కమిషనర్ నియామకం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని తొమ్మిది లేదా పదో షెడ్యూల్‌లో చేర్చకుండా వదిలేయడంతో రెండుమూడు నెలలపాటు రాష్ట్ర ఎన్నికల సంఘంలో పనిచేసే సిబ్బందికి వేతనాలు చెల్లింపు సమస్యగా మారింది. వేతనాలు, నిధుల విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం రెండు రాష్ట్రాల ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శులు, పంచాయతీరాజ్ శాఖల ముఖ్యకార్యదర్శులకు లేఖ రాసేది. ఆ తరువాత సమస్య పరిష్కారం అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రం సొంతగా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు, గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌ల నుంచి అనుమతి రావడంతో శనివారం రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేస్తూ పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి రేమండ్ పీటర్ ఉత్తర్వులు జారీ చేశారు. వారంరోజుల్లో కమిషన్‌కు కొత్త ఎన్నికల కమిషనర్‌ను నియమించనున్నట్టు తెలిసింది.