అసెంబ్లీలో ఆర్థిక సంఘాల ఎన్నికలకు ప్రభుత్తం కసరత్తు మొదలు పెట్టింది.
- పీఏసీ, పీయూసీ, అంచనాల కమిటీలకు ప్రభుత్వం ప్రతిపాదన
- 23న నామినేషన్లు, 25న ఎన్నిక
సాక్షి, హైదరాబాద్ : అసెంబ్లీలో ఆర్థిక సంఘాల ఎన్నికలకు ప్రభుత్తం కసరత్తు మొదలు పెట్టింది. శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి హరీష్ రావు బుధవారం సభలో మూడు కమిటీల ఎన్నికలకు సంబంధించి స్రభుత్వం తరపున ప్రతిపాదించారు. ప్రజా (పద్దుల) లెక్కల కమిటీ (పీఏసీ), అంచనాల కమిటీ (ఎస్టిమేట్స్), ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ (పీయూసీ)ల్లో శాసనసభ నుంచి 9 మంది సభ్యుల చొప్పున 2015-16 ఆర్థిక సంవత్సరానికి ఎన్నుకోనున్నారు. 23న మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్ల దాఖలు, మూడు నుంచి అయిదు గంటల వరకు నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 24న మూడు గంటల వరకు ఉపసంహరణకు గడువుగా నిర్ణయించారు. 25న ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓటింగ్ ఉంటుంది.
మండలిలో... శాసన మండలి నుంచి పీఏసీ, ఎస్టిమేట్స్, పీయూసీ కమిటీల్లో నలుగురేసి సభ్యుల చొప్పున ఎన్నుకునేందుకు మండలి చైర్మన్ కె.స్వామి గౌడ్ షెడ్యూల్ ప్రకటించారు. ఈ కమిటీలకు మండలి నుంచి నలుగురేసి సభ్యుల చొప్పున ఎన్నుకునేందుకు ప్రభుత్వ ప్రతిపాదనను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖమంత్రి కె. తారక రామారావు కౌన్సిల్ లో ప్రవేశపెట్టారు.