ఆకాశమార్గాన బస్సులు..! | Elevated Bus Rapid Transit System In Hyderabad | Sakshi
Sakshi News home page

ఆకాశమార్గాన బస్సులు..!

Published Sat, Jul 13 2019 7:12 AM | Last Updated on Sat, Jul 13 2019 7:42 AM

Elevated Bus Rapid Transit System In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : గ్రేటర్‌వాసుల కలల మెట్రోకు అనుసంధానంగా ఎలివేటెడ్‌ బస్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టం(బస్సులు మాత్రమే రాకపోకలు సాగించే ఆకాశ మార్గం) ఏర్పాటుకు హైదరాబాద్‌ మెట్రో రైలు సంస్థ సన్నాహాలు చేస్తోంది. ప్రధానంగా ఐటీ కారి డార్, గచ్చిబౌలి ఫైనాన్షియల్‌ జిల్లా పరిధిలో ట్రాఫిక్‌ చిక్కులను తప్పించడంతోపాటు మెట్రో సౌకర్యం లేని ప్రాంతాలను స్టేషన్లతో అనుసంధానించేందుకు ఈ ప్రాజెక్టును రూపొందించారు. ఈ ప్రాజెక్టును సుమారు 20 కి.మీ. మార్గంలో ఏర్పాటు చేయనున్నారు. ఇందుకయ్యే వ్యయం ప్రాథమికంగా రూ.2,800 కోట్ల మేర ఉంటుందని నిర్ణయించారు. సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేసేందుకు బిడ్ల దాఖలుకు హెచ్‌ఎంఆర్‌ సంస్థ వారంపాటు పొడిగించిన నేపథ్యంలో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

బీఆర్‌టీఎస్‌ మార్గం ఇలా...  
ఈ బీఆర్‌టీఎస్‌ ప్రాజెక్టును కేపీహెచ్‌బీ మెట్రో స్టేషన్‌ నుంచి ఫోరం మాల్, హైటెక్‌ సిటీ ఎంఎంటీఎస్‌ స్టేషన్, హెచ్‌ఐసీసీ, శిల్పారామం, రాయదుర్గం, గచ్చిబౌలి ఫైనాన్షియల్‌ జిల్లా, రాయదుర్గం, నార్సింగి తదితర ప్రాంతాలను కలుపుతూ సుమారు 20 కిలోమీటర్ల ఎలివేటెడ్‌ మార్గంలో బీఆర్‌టీఎస్‌ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. అంటే ఈ మార్గం కూడా మెట్రో మార్గాన్ని తలపించినప్పటికీ.. ఈ కారిడార్‌లో ప్రత్యేకంగా ఎలక్ట్రికల్‌ ఏసీ బస్సులు మాత్రమే రాకపోకలు సాగిస్తాయి. ఇతర వాహనాలను ఈ మార్గంలో అనుమతించరు. ప్రతీ కిలోమీటర్‌కు ఒక బస్‌ స్టేజీ ఉంటుంది. ప్రయాణికుల రద్దీని బట్టి ఈ బస్సుకు సైతం రైలు తరహాలో మూడు కోచ్‌లుంటాయి. రద్దీని బట్టి తొలుత రెండు కోచ్‌లు.. ఆ తరువాత మూడు కోచ్‌లు ఏర్పాటు చేయనున్నారు.

ఈ ప్రాజెక్టు కోసం సుమారు రూ.2,800 కోట్ల అంచనా వ్యయాన్ని ప్రాథమికంగా నిర్ధారించారు. సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేసిన తరువాత నిధుల వ్యయంపై స్పష్టత రానుంది. ఈ ప్రాజెక్టును సైతం పబ్లిక్‌–ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తితో మెట్రో కారిడార్‌తోపాటు, ఐటీ కారిడార్, గచ్చిబౌలి ఫైనాన్షియల్‌ జిల్లా పరిధిలో విస్తరించిన ఐటీ, బీపీఓ, కెపిఓ కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, స్థానికులకు ట్రాఫిక్‌ చిక్కులు తొలగిపోనున్నాయి. ప్రజా రవాణా వ్యవస్థ బలోపేతం కానుంది. ఇదిలా ఉండగా బీఆర్‌టీఎస్‌ను పబ్లిక్‌–ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టనున్న నేపథ్యంలో నిధుల కొరత ఉండదు. ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు పలు దేశీయ, విదేశీ కంపెనీలు ఆసక్తి చూపుతుండటం విశేషం.

బీఆర్‌టీఎస్‌తో ప్రయోజనాలివే


  • ఐటీ కారిడార్, గచ్చిబౌలి ఫైనాన్షియల్‌ జిల్లా పరిధిలో పలు ఐటీ, బీపీఓ, కేపీఓ కంపెనీల్లో పని చేస్తున్న లక్షలాది మంది ఉద్యోగులకు వ్యక్తిగత వాహనాల వినియోగం భారీగా తగ్గనుంది.  

  • ట్రాఫిక్‌ చిక్కులు తొలగిపోవడంతో విలువైన పని గంటలు ఆదా అవుతాయి.

  •  మెట్రోకు కూడా ప్రయాణికులు పెరిగి లాభాల బాట పట్టే అవకాశం ఉంటుంది.  

  • ఐటీ కారిడార్, ఫైనాన్షియల్‌ జిల్లా పరిధిలో లాస్ట్‌మైల్‌ కనెక్టివిటీ ఇబ్బందులు తీరతాయి.

  • పలు అభివృద్ధి చెందిన దేశాల్లో అమల్లో ఉన్న బీఆర్‌టీఎస్‌ రాకతో నగర రూపురేఖలు మారతాయి.  

  • బీఆర్‌టీఎస్‌ మార్గంలోనూ నూతన కంపెనీల ఏర్పాటు, వాణిజ్య, ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి.
  • మెట్రోతో పోలిస్తే బీఆర్‌టీఎస్‌ ఏర్పాటు సాంకేతికంగా, ఆర్థికంగా అంత భారంగా పరిణమించదు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

బీఆర్‌టీఎస్‌ నమూనా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement