కేపీహెచ్‌బీ టూ ఓఆర్‌ఆర్‌.. మెట్రో నియో పట్టాలెక్కేనా! | Metro Neo Project from KPHB To ORR In Hyderabad | Sakshi
Sakshi News home page

కేపీహెచ్‌బీ టూ ఓఆర్‌ఆర్‌.. మెట్రో నియో పట్టాలెక్కేనా!

Published Thu, Nov 10 2022 8:05 AM | Last Updated on Thu, Nov 10 2022 9:17 AM

Metro Neo Project from KPHB To ORR In Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లో ట్రాఫిక్‌కు చెక్‌ పెట్టేందుకు ఐటీ కారిడార్‌ పరిధిలో మెట్రో నియోగా పిలిచే ఎలివేటెడ్‌ బస్‌ ర్యాపిడ్‌ సిస్టం (బీఆర్‌టీఎస్‌) ప్రాజెక్టును చేపట్టేందుకు నిధుల లేమి శాపంగా మారింది. పనులు చేపట్టేందుకు అవసరమైన రూ.3,100 కోట్ల నిధులు వెచి్చంచేందుకు ప్రైవేటు సంస్థలకు రాష్ట్ర సర్కారు రెడ్‌కార్పెట్‌ పరిచి ఆహ్వానిస్తోంది. మరోవైపు రూ.450కోట్ల మేర ఆర్థిక సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వానికి విన్నవించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.  

లాభాలు రాకపోవడంతో.. 
ఇప్పటికే నగరంలో మూడు మార్గాల్లో 69.2 కి.మీ మార్గంలో అందుబాటులో ఉన్న తొలిదశ మెట్రో ప్రాజెక్టును పబ్లిక్‌–ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టినప్పటికీ ఆశించిన స్థాయిలో లాభదాయకం కాలేదు. ఈ నేపథ్యంలో యాన్యుటీ విధానంలో ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు ఏ ప్రైవేటు సంస్థ ముందుకొస్తుందా అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది.  
సర్కారు అంచనాల ప్రకారం..  యాన్యుటీ విధానంలో మెట్రో నియో ప్రాజెక్టును చేపట్టేందుకు ముందుకొచ్చే సంస్థ ప్రాజెక్టుకయ్యే మొత్తం వ్యయాన్ని భరించాల్సి ఉంటుంది. తర్వాత అయిదు నుంచి పదేళ్ల అనంతరం వడ్డీతో కలిపి ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు చేసిన వ్యయాన్ని వాయిదా పద్ధతిలో సదరు సంస్థకు చెల్లిస్తుందన్న మాట. అంతేకాదు సదరు నిర్మాణ సంస్థకు ఈ ప్రాజెక్టు చేపట్టే మార్గంలో విలువైన ప్రభుత్వ భూములను దీర్ఘకాలిక పద్ధతిన తక్కువ మొత్తానికి లీజుకిచ్చే అవకాశం కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 

ప్రాజెక్టు స్వరూపం ఇలా.. 
మెట్రో నగరాల్లో పెరుగుతున్న ట్రాఫిక్‌ రద్దీకి మెట్రో నియో చక్కటి పరిష్కారమని నిపుణులు సూచిస్తున్నారు. ఈవిధానంలో మెట్రో ప్రాజెక్టు తరహాలోనే రహదారి మధ్యలో  పిల్లర్లు ఏర్పాటుచేసి దానిపై రహదారిని ఏర్పాటు చేస్తారు. దీన్ని ఎలివేటెడ్‌ బస్‌ ర్యాపిడ్‌ సిస్టం(ఈబీఆర్‌టీఎస్‌) లేదా మెట్రో నియో మార్గం అని పిలుస్తారు. ఈ మార్గంలో కేవలం బ్యాటరీ బస్సులు మాత్రమే నడపాల్సి ఉంటుంది. 

- ట్రాఫిక్‌ రద్దీ అధికంగా ఉండే ఐటీ కారిడార్‌ సహా పలు రూట్లలో ఇది అనువైన ప్రాజెక్టు. ఈ రూట్లో అన్ని రకాల వాహనాలు రాకపోకలు సాగించే అవకాశం ఉన్నప్పటికీ.. కేవలం ప్రజారవాణా వ్యవస్థలో భాగమైన బ్యాటరీ బస్సులను మాత్రమే అనుమతించాలి. దీంతో ట్రాఫిక్‌ చిక్కులు, కాలుష్య ఆనవాళ్లు ఉండవు. 

- ఉద్యోగులు, విద్యార్థులు, వివిధ పనుల నిమిత్తం బయలుదేరిన వారు ట్రాఫిక్‌ జంజాటం లేకుండా సమయానికి గమ్యస్థానం చేరుకునే వీలుంటుంది. నగరంలో కేపీహెచ్‌బీ– హైటెక్స్‌–రాయదుర్గం– కోకాపేట్‌– ఓఆర్‌ఆర్‌ వరకు సుమారు 19 కి.మీ మేర సుమారు రూ.3,100 కోట్ల అంచనా వ్యయంతో మెట్రోనియో ప్రాజెక్టు చేపట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చాయి. కానీ నిధులు వెచి్చంచే విషయంలో ప్రైవేటు సంస్థల వైపు చూస్తుండడం గ్రేటర్‌ పిటీ.  
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement