పథకాల అమలులో ఉద్యోగులే కీలకం
నిరంజన్‌రెడ్డి వెల్లడి
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేయాలంటే ఉద్యోగు లు సమర్థవంతంగా పనిచే యాలని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో నాలుగు జిల్లాలకు చెందిన జిల్లాస్థాయి అధికారులకు పున:శ్చరణ, సామర్థ్య పెంపుపై నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు అనుకూలంగా ఉందని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి వేగంగా తీసుకెళ్లాలని సూచించారు.
అనంతరం ప్రభుత్వ సలహాదారు ఏకే గోయల్ మాట్లాడుతూ.. నీటిపారుదల, విద్య, ఆరోగ్యం తదితర రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయాల గురించి వివరించారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీపీ ఆచార్య మాట్లాడుతూ.. సృజనాత్మక ప్రణాళికలను రూపొందించేందుకు సమగ్ర కుటుంబ సర్వే సమాచారం ఉపయోగ పడుతుందన్నారు. జిల్లా పరిపాలన పనితీరును మెరుగుపర్చడంలో జిల్లా నాలెడ్జ్ అండ్ ఇన్నొవేటీవ్ సెంటర్లు దిక్సూచిగా నిలుస్తాయన్నారు. ఉద్యోగులు విధినిర్వహణలో ఎదుర్కొంటున్న సవాళ్లు శాఖోపశాఖలుగా విస్తరిస్తున్నాయని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రాస్ వివరించారు.