పాతవన్నీ పోతాయ్ !
- అన్ని సంక్షేమ పథకాలు అంతే
- ప్రస్తుత లబ్ధిదారులూ కొత్తగా అర్జీ పెట్టుకోవాల్సిందే
- అర్హత ఉన్న అందరూ దరఖాస్తు చేసుకోవాల్సిందే...
- ప్రాథమిక దశలోనే భారీగా తగ్గుదల
- క్షేత్రస్థాయి ఉద్యోగులకు కలెక్టర్ కిషన్ ఆదేశాలు
సాక్షి ప్రతినిధి, వరంగల్ : సంక్షేమ పథకాలు అమలు చేయాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం అర్హుల నుంచి దరఖాస్తులు తీసుకునే ప్రక్రియను మొదలుపెట్టింది. అర్హులందరు దరఖా స్తు చేసుకోవాలని సూచించింది. ప్రధానంగా కుటుంబ ఆహార భద్రత కార్డులు (రేషన్), సామాజిక పింఛన్లకు సంబంధించిన దరఖాస్తులే ఎక్కువగా రానున్నాయి.
దరఖాస్తు ప్రక్రియలో ప్రభుత్వం మెలిక పెట్టింది. ప్రస్తుతం రేషన్‌కార్డు ఉన్నవారు, సామాజిక పింఛన్లు పొందుతున్న వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, చేనేత కార్మికులు, కల్లు గీత కార్మికులు, ఎయిడ్స్ బాధితులు మళ్లీ కొత్తగా దరఖా స్తు చేసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. అన్ని రకాల సంక్షేమ పథకాలకు సంబంధించి కొత్త రాష్ట్రంలో కొత్తగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది.
గ్రామ స్థాయిలో ఈ విషయాన్ని అందరికీ తెలియజేయాలని కలెక్టర్లు క్షేత్ర స్థాయి సిబ్బందిని ఆదేశించారు. ‘అర్హత ఉన్న వారు సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలి. ప్రస్తుతం ఉన్న వారికీ ఇది వర్తిస్తుంది’ అని వరంగల్ జిల్లా కలెక్టర్ జి.కిషన్ గురువా రం విలేకరులు సమావేశంలో వెల్లడించారు. ఈ మేరకు గ్రామ స్థాయిలో ప్రభుత్వ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. సంక్షేమ పథకాలకు సంబంధించి కొత్తగా దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించిన నేపథ్యంలో రేషన్ కా ర్డుల సంఖ్య భారీగా తగ్గే అవకాశం కనిపిస్తోం ది.
రాష్ట్రంలో ప్రస్తుతం 91 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. సమగ్ర కుటుంబ సర్వే నేపథ్యంలో ఇప్పటికే ప్రజలు వారి సామాజిక పరిస్థితిపై నివేదకలు ఇచ్చారు. ప్రభుత్వం వీటి ఆధారం గా కొత్త రేషన్ కార్డులు ఇవ్వనుండడంతో దరఖాస్తుల సంఖ్య భారీగా తగ్గుతుందని అధికారు లు చెబున్నారు. సమాజిక పించన్ల పరిస్థితి ఇలా గే ఉండనుంది. అన్ని రకాల సామాజిక పించ న్లు కలిపి రాష్ట్రంలో ప్రస్తుతం 26.95 లక్షలు ఉన్నాయి. వీటితో పోల్చితే కొత్తగా వచ్చే దరఖాస్తుల సంఖ్య తగ్గే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన అర్హుల ఎంపిక మొదలైంది.
రేషన్ కార్డులు, పింఛన్లు, ఫీజు రాయితీలు తదితర ఫలాలు పొందుతున్న వారందర్ని రద్దు చేస్తూ... వాటిస్థానంలో కొత్త గా అర్హులను గుర్తిస్తోంది. ఇందులో భాగంగా అన్ని వర్గాల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోం ది. రేషన్ కార్డు స్థానంలో ఆహార భధ్రత కార్డు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. అదేవిధంగా కొత్త పిం ఛన్ విధానం.. ఫీజు రాయితీ పథకాలను అమ లు చేయనుంది. ఈ క్రమంలో అర్హులైన ప్రతి ఒక్కరు ఫలాలు అందుకునేందుకు తప్పనిసరి గా దరఖాస్తు చేసుకోవాల్సిందే. ఈ నెల 15 దరఖాస్తు దాఖలుకు చివరి తేదీగా ప్రకటించారు.
తెల్లకాగితమే దరఖాస్తు పత్రం..
సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు చేసుకునే అంశంలో రాష్ట్ర సర్కారు కొత్త ప్రక్రియకు శ్రీకా రం చుట్టింది. గతంలో ఏదైనా పథకం కోసం దరఖాస్తు చేసుకునేందుకుగాను ప్రత్యేక నమూనాతో కూడిన దరఖాస్తులో వివరాలు సమర్పిం చేవారు. ఇలా చేయడం వల్ల దళారులు దరఖాస్తులను అమ్ముకోవడం వంటివి జరిగేవి. నిరక్షరాస్యుల నుంచి దరఖాస్తులు పూర్తి చేసినందు కు ఎంతో కొంత మొత్తం వీరు తీసుకునేవారు. తెల్ల కాగితం నిబంధనతో ఈ పరిస్థితి మారనుంది. దరఖాస్తు వివరాలను సమగ్ర సర్వే వివరాలతో సరిపోల్చడంతో పాటు క్షేత్ర పరిశీలన చేసిన అనంతరమే అర్హులను ఎంపిక చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. దరఖాస్తుల పరిశీలనకు ప్రభుత్వం ఒకట్రెండు రోజుల్లో మార్గదర్శకాలు ఇవ్వనున్నట్లు సమాచారం.