
యువతకు అండగా ఉంటాం
► స్కిల్స్‌పై శిక్షణకు ప్రణాళిక
► పరిశ్రమలకు ప్రోత్సాహం
► కేంద్ర మంత్రి దత్తాత్రేయ
► పరిశ్రమలు వృద్ధి చెందాలి
► ఉత్సాహంగా సృజన-16
తిమ్మాపూర్ : విద్యార్థులు మాస్టర్స్, రీసెర్చ్ చేయాలని, యువతకు ఎన్డీఏ ప్రభుత్వం అండగా ఉంటుందని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో మండలంలోని శ్రీ చైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో నాలుగు రోజులపాటు నిర్వహించనున్న సృజన-16 రాష్ట్రస్థాయి టెక్నికల్ సింపోజియంను ఆదివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులకు ఉన్నత విద్య చాలా ముఖ్యమని, టెక్నికల్ విద్యకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ కేంద్రం రూ.18 వేల కోట్లు కేటాయించిందన్నారు. మేక్ ఇన్ ఇండియా.. మేడిన్ ఇండియా లక్ష్యసాధన కోసం ప్రధాని నరేంద్రమోడీ దృఢ సంకల్పంతో ఉన్నారన్నారు. వ్యక్తిత్వాన్ని కోల్పోతే సర్వం కోల్పోయినట్లేనని, క్రమశిక్షణ ముఖ్యమని అన్నారు. యువత దేశాభివృద్ధికి, పునఃనిర్మాణానికి కృషి చేయాలని కోరారు. టెక్నాలజీలో దేశాన్ని నంబర్‌వన్‌గా నిలుపుతామన్నారు. చిన్న పరిశ్రమల స్థాపనను కేంద్రం ప్రోత్సహిస్తోందని, రూ.2 కోట్ల వరకు రుణం ఇచ్చి పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దుతుందని తెలిపారు.
పరిశ్రమలు వృద్ధి చెందితేనే బంగారు తెలంగాణ కల సాకారమవుతుందని, సాంకేతిక నైపుణ్యాలతో యువత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు స్కిల్స్‌పై శిక్షణ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తోందన్నారు. సింగరేణిలాంటి సంస్థల్లో ఇంజినీర్ల అవసరం చాలా ఉందని పేర్కొన్నారు. ‘సృజన’ విద్యార్థుల్లో పోటీతత్వాన్ని, ఆలోచనను పెంచుతుందన్నారు. రాజకీయాలకు అతీతంగా కొనసాగుతున్న అతి పెద్ద సంస్థ ఏబీవీపీ అని అన్నారు.
పలు సంస్థలు కుల, మత, భాష పేరుతో విభేదాలు సృష్టిస్తుంటే, తామంతా భారతీయలమని గర్వంగా చెబుతున్న ఏబీవీపీని ఆయన అభినందించారు. కార్యక్రమంలో హైదరాబాద్ జేఎన్టీయూ రెక్టార్ కిషన్‌కుమార్‌రెడ్డి, శ్రీ చైతన్య కళాశాల చైర్మన్ ఎం.లక్ష్మారెడ్డి, సెక్రటరీ ముద్దసాని రమేశ్‌రెడ్డి, ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చెన్నకేశవరెడ్డి, అయ్యప్ప, జోనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రామ్మోహన్‌జీ, సృజన కార్యక్రమ కన్వీనర్ రాకేశ్, జాయింట్ సెక్రటరీ జగదీశ్, రిసెప్షన్ కమిటీ జనరల్ సెక్రటరీ ఎం.శ్రీనివాస్, ఏబీవీపీ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.