సాక్షి, కోస్గి (కొడంగల్): నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలు ఎన్నో త్యాగాలు, పోరాటాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కేసీఆర్ మోసపూరిత మాటలను నమ్మి మొదటిసారి అవకాశం ఇస్తే పాలించడం చేతకాక ముందస్తు ఎన్నికలకు వెళ్లాడు. కేసీఆర్ గత ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలం అయ్యారు.
ముఖ్యంగా దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని రాష్ట్ర ప్రజలను నమ్మించి అధికారంలోకి రాగానే మాటమార్చి అధికార దాహంతో సీఎం పదవి అధిష్టించారు. యువత ఎన్నో ఆశలతో ఉద్యోగాలు వస్తాయని భావిస్తే.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అలా చేయలేకపోయింది. మైనార్టీలకు 12శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పడం మాటలకే పరిమితమైంది.
ఎల్లప్పుడూ నిరుపేదల అభివృద్ధి కోసం కృషిచేసే కాంగ్రెస్ పార్టీకే ప్రజలంతా ఓటువేసి కేసీఆర్ పాలనకు ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైంది. వెనకబడ్డ పాలమూరు జిల్లాలో భాగమైన కొడంగల్ నియోజకవర్గానికి కృష్ణా నది నీరు తెస్తే సాగునీరు పారడం ద్వారా రైతులు ఎంతో లాభదాయకంగా వ్యవసాయం చేసుకునే వారు. సాగునీరు నియోజకవర్గానికి తేవడంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది.
– కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి
14 స్థానాలు గెలవబోతున్నాం
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కాంగ్రెస్ 14 స్థానాలు గెలవబోతుంది. డిసెంబర్ 12న పీఫుల్స్ ఫ్రంట్ ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేయనుంది. నాలుగున్నరేళ్ల పాటు తెలంగాణ ప్రాంతాన్ని దోచుకున్న కేసీఆర్, కేటీఆర్ బట్టేబాజ్ మాటలతో మరోసారి తెలంగాణను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. నీళ్లు తీసుకురాలే, ఉద్యోగాల ఇయ్యలే. నిధులు వారి జేబుల్లో నింపుకున్నరు. మహబూబ్‌నగర్ జిల్లాలో రైతాంగానికి మోసం జరిగింది.
వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా.. వారి కుటుంబాలకు పరిహారం ఇవ్వలేదు. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏకకాలంలో రూ.2లక్షల రుణ మాఫీ చేస్తాం. పండే ప్రతీ పంటకు మంచి గిట్టుబాటు ధర ఇవ్వబోతున్నాం. రాబోయే ప్రజాఫ్రంట్ ప్రభుత్వంలో లక్ష ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నాం. మెగా డీఎస్సీ నిర్వహించి 20వేల ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకు కూడా పింఛన్లు ఇవ్వబోతున్నాం.
– ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment