నిజామాబాద్‌క్రైం, న్యూస్‌లైన్: ఎన్నికల నియమావళికి విరుద్ధంగా గెలిచారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంఐఎం కార్పొరేటర్ల కేసు రసవత్తంగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా గెలిచిన నలుగురు కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారాన్ని నిలిపి వేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై గురువారం వెకేషన్ కోర్టు(ఫ్యామిలీ)లో వాది, ప్రతివాదుల మధ్య తీవ్ర వాదనలు కొనసాగాయి. నలుగురు కార్పొరేటర్లపై గురువారం వెలువడనున్న తీర్పు ఏ విధంగా ఉంటుందోనని న్యాయవాదులు, కక్షిదారులు, కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థుల మద్దతుదారులతో కోర్టు హాల్ కిక్కిరిసిపోయింది. వాది, ప్రతివాదుల మధ్య వాదనలు విన్న జిల్లా వెకేషన్ కోర్టు(ఫ్యామిలీ) జడ్డి రవీంద్రసింగ్ శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు వెలువరించనున్నట్లు తీర్పు చెప్పారు.
వాదోపవాదనలు
నిజామాబాద్ నగర పాలకసంస్థ పరిధిలోని 25, 29, 36, 39 డివిజన్లకు చెందిన ఎంఐఎం కార్పొరేటర్లు ఇద్దరికంటే ఎక్కువ సంతానం కలిగి ఉన్నారని, ఆధార్‌కార్డు ఆధారంగా వీరి ఎన్నిక చెల్లదంటూ చేసిన ఆరోపణలు సరైనవి కావని వారి తరపున న్యాయవాది కోర్టుకు విన్నవించారు. సాంకేతికపరంగా ఎప్పటికప్పుడు చోటు చేసుకుంటున్న పరిజ్ఞానంతో కంప్యూటర్‌లో ఆధార్‌కార్డులో ఉన్నది లేన్నట్లు, లేనిది ఉన్నట్లుగా చూపించవచ్చన్నారు. పిటిషనర్లు కోర్టుకు సమర్పించిన ఆధార్‌కార్డులు నమ్మకశ్యంగా లేవని, రాజకీయంగా కార్పొరేటర్లను దెబ్బతీసేందుకు ఆధార్‌కార్డును అడ్డం పెట్టుకుని వేసిన ఎత్తుగడ్డ అని వాదించారు.
కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం తేదీ ఇంకా ఖరారు కానప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారాన్ని ఎందుకు నిలిపి వేయాలని ప్రతివాదుల తరపున న్యాయవాది కోరుతున్నారని ప్రశ్నించారు. దీనిపై ప్రతివాది తరపున న్యాయవాది అభ్యంతరం చెబుతూ కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు కాకున్న, ఎప్పుడైనా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంటుందన్నారు. తాము సేకరించిన ఆధార్‌కార్డు అనేది పబ్లిక్ డాక్యుమెంటేషన్.
దీనిని ఇంటర్‌నెట్ ద్వారా ఎవిడెన్స్ యాక్టు ద్వారా తీసుకుని కోర్టుకు సమర్పించామన్నారు. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సుధీర్ఘంగా వాదోపవాదాలు జరిగాయి. వాది, ప్రతివాదుల వాదోపవాదాలు విన్న జడ్జి ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేయవచ్చా లేదా అనే మధ్యంతర ఉత్తర్వులు శుక్రవారం వెలువరించనున్నట్లు తీర్పు నిచ్చారు. ప్రతివాదుల తరపున సీనియర్ న్యాయవాది తులా గంగాధర్, న్యాయవాది నరేష్, వాది తరపున హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది సుజుల్లాఖాన్ వాధించారు.
మరో ఇద్దరి కార్పొరేటర్లపై దావా..
ఇద్దరికంటే ఎక్కువ సంతానం కలిగి ఉన్న నలుగురు ఎంఐఎం కార్పొరేటర్లపై కోర్టులో కేసు కొనసాగుతుండగా, తాజాగా మరో ఇద్దరిపై కోర్టులో దావా దాఖలైంది. 13 డివిజన్‌లో ఎంఐఎం పార్టీ తరపున పోటీచేసిన మహమ్మద్ యూసఫ్ అలీకి, 37వ డివిజన్‌లో మీర్ పర్వేజ్ అలీకి ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్నట్లు వారి సమీప ప్రత్యర్థులు కోర్టును ఆశ్రయించారు. 13వ డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి రెండవ స్థానంలో నిలిచిన ఎండీ జావేద్‌అలీ(సాబెర్‌అలీ), 37వ డివిజన్‌లో కాంగ్రెస్ అభ్యర్థి అబ్దూల్ కరీం బబ్బూలు ఎంఐఎం కార్పొరేటర్లపై దావా వేశారు. వీరి తరపున న్యాయవాది ఆకుల రమేష్ కార్పొరేటర్లపై కోర్డులో దావా వేశారు. గురువారం కోర్డు దావాలను స్వీకరించి రిజిష్ట్రర్ చేసింది. దీంతో ఈ కార్పొరేటర్లకు త్వరలో నోటీసులు జారీ కానున్నాయి. వీరితో కలిసి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంఐఎం పార్టీ కార్పొరేటర్ల సంఖ్య ఆరుకు చేరింది.
కేసులో మరికొందరు..
అధిక సంతానం కలిగి ఉండి ఎన్నికలో పోటీచేసి గెలిచిన వారిపై వారి సమీప ప్రత్యర్థులు కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నటు తెలిసింది. కార్పొరేషన్ ఎన్నికల్లో రెండవ స్థానంలో నిలిచిన అభ్యర్థులు తమపై గెలిచిన అభ్యర్థుల వివరాలు సేకరించే పనుల్లో పడ్డారు. ఎంఐఎం పార్టీకి చెందిన వారే కాకుండా ఇతర పార్టీల నుంచి గెలిచిన అభ్యర్థులపై సమీప ప్రత్యర్థులు వివరాలు సేకరించే పనిలో పడ్డారు.
ఇందులో టీడీపీ నుంచి టీఆర్‌ఎస్ పార్టీలో చేరి పోటీచేసి కార్పొరేటర్‌గా గెలిచిన మహిళా కార్పొరేటర్‌పై సమీప కాంగ్రెస్ అభ్యర్థి కోర్టులో దావా వేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇందుకోసం పూర్తి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ఇలా మరికొందరు ఉండవచ్చనే వారి సమీప ప్రత్యర్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
కార్పొరేటర్ల కేసులో ముగిసిన వాదనలు
Published Fri, May 30 2014 3:24 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement
Advertisement