నల్లగొండ అర్బన్ : ఈ ఏడాది ఇంజినీరింగ్ కాలేజీల పోరాటం మళ్లీ మొదటికి వచ్చింది. 2014-15 విద్యాసంవత్సరానికి నిబంధనలు పాటించలేదనే కారణంతో తెలంగాణ రాష్ట్రంలో 174 కాలేజీలకు జేఎన్‌టీయూ అనుమతి నిరాకరించింది. ఆ తర్వాత హైకోర్టు ఆ వాదనను సమర్థించడంతో సుప్రీంకోర్టు దాకా వెళ్లి షరతులతో కూడిన అడ్మిషన్ల అవకాశం తెచ్చుకున్నా ఆశలపై చివరకు నిపుణుల కమిటీ నీళ్లు చల్లింది. వివరాల్లోకి వెళితే.. పలు ఇంజినీరింగ్ కాలేజీల్లో ల్యాబ్‌లు, గ్రౌండ్, ఫ్యాకల్టీ తదితర లోపాలతో పాటు ప్రమాణాలు పాటించడం లేదని జేఎన్‌టీయూ 2014 ఎంసెట్ ఇంజినీరింగ్ అభ్యర్థులకు తెలంగాణలోని 174 ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు అడ్డు చెప్పింది. జిల్లాలో ఆ విధంగా 34 కాలేజీలకు అడ్మిషన్లు అవకాశం లేకుండా పోయింది. ఆ తర్వాత వారు సుప్రీంకోర్టుకు వెళ్లి షరతులతో అడ్మిషన్లను పొందేందుకు అవకాశాన్ని తెచ్చుకున్నారు. 174 కాలేజీలకు గాను 163 కాలేజీల వారే అడ్మిషన్లు తీసుకునేందుకు ముందుకు వచ్చారు. రెండవ విడత కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేసుకునేందుకు అంగీకరించారు. దాదాపు 60 వేల సీట్లు ఉండగా కేవలం 3 వేల మంది విద్యార్థులు మాత్రమే చేరారు.
7 కాలేజీల్లో 839 మంది విద్యార్థుల ప్రవే శం
జిల్లాలో 34 కాలేజీల్లో దాదాపు 10 వేల సీట్లున్నా 27 కాలేజీల్లో ఎవరూ చేరలేదు. 7 కాలేజీల్లో 839 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. కోదాడలోని రెండు కాలేజీల్లో 454 మంది, దేవరకొండలోని ఓ కాలేజీలో 150 మంది, మిర్యాలగూడలో 50 మంది, నల్లగొండలో సాగర్ రోడ్డులోని ఓ కాలేజీలో 22 మంది, హైదరాబాద్ రోడ్డులోని ఓ కాలేజీలో 13 మంది, చౌటుప్పల్, రామోజీ ఫిలిం సిటీ సమీపంలోని ఓ కాలేజీలో 150 మంది ప్రవేశాలు పొందారు. సుప్రీంకోర్టుకు ఇచ్చిన హామీ ప్రకారం ఆయా కాలేజీల్లో వసతులు లేకపోవడాన్ని నిపుణుల కమిటీ తేల్చి చెప్పింది. తాజాగా అన్ని కాలేజీలను రద్దు చేయాలని నిర్ణయించడం వల్ల ఇంతకాలం ప్రదర్శించింది మేకపోతు గాంభీర్యమని తేలిపోయింది.
పలు కాలేజీల్లో ల్యాబ్‌లు, క్రీడా మైదానాలు లేకపోవడం, కొన్ని కాలేజీల్లో అవి ఉన్నా ముఖ్యంగా పీహెచ్‌డీ కలిగిన బోధకులు లేకపోవడం, విద్యార్థుల నిష్పత్తికి అనుగుణంగా ఉపాధ్యాయులు లేకపోవడంతో చివరి అవకాశం కూడా చేజారింది. 7 కాలేజీలకు గాను కేవలం ఒకటి లేదా రెండు కాలేజీలు మాత్రమే కొనసాగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. దీంతో కోర్టుకు ఇచ్చిన హామీ ప్రకారం కన్వీనర్ కోటాలో సీట్లు పొందిన వారిని, మేనేజ్‌మెంట్ ద్వారా అడ్మిషన్లు తీసుకున్న వారిని సమీపంలోని కాలేజీల్లో సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. అయితే జేఎన్‌టీయూ తీసుకునే నిర్ణయం, ఇవ్వనున్న మార్గదర్శకాల ప్రకారం ఏ ఏ కాలేజీల్లో సర్దుబాటు చేస్తారనే విషయంపై మరికొద్ది రోజుల్లో స్పష్టత రానుంది.
అనుమతికి మళ్లీ కొత్తగా దరఖాస్తు చేయాల్సిందే..
జిల్లాలో 41 ఇంజినీరింగ్ కాలేజీలు ఉండగా మొదటి విడత కౌన్సెలింగ్‌కు అనుమతించిన ఆరు కాలేజీలు, ఎంజీ యూనివర్సిటీ పరిధిలోని ఒక కాలేజీ మాత్రమే భవిష్యత్తులో కొనసాగే అవకాశాలున్నాయి. 34 కాలేజీలకు అడ్మిషన్లు పొందేందుకు అవకాశం ఇవ్వగా వాటిల్లో 7 కాలేజీల్లో మాత్రమే విద్యార్థులు చేరడం తెలిసిందే. అయినప్పటికీ వాటిల్లో కూడా ఒకటి, రెండు కాలేజీలు మాత్రమే కొనసాగే అవకాశాలుండడంతో మిగతా కాలేజీలు రద్దుబాట పట్టక తప్పని పరిస్థితి. పలు కాలేజీల్లో అడ్మిష
న్లను రద్దు చేయడంతో వాటి మనుగడ ముగిసినట్లేనని భావిస్తున్నారు. వాళ్లు మళ్లీ కొత్తగా అడ్మిషన్లు తీసుకోవాలంటే ఏఐసీటీఈ నార్మ్స్ ప్రకారం కొత్త కాలేజీ ప్రారంభంలో తీసుకోవాల్సిన నిబంధనలే పాటించాల్సి ఉంటుందని తెలిసింది. ల్యాబ్, గ్రౌండ్, ఫ్యాకల్టీ తదితర అన్ని వసతులను చూపి ప్రెష్‌గా దరఖాస్తు చేసుకోవాలని సమాచారం.
కింకర్తవ్యం..?
Published Mon, Feb 2 2015 5:44 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM
Advertisement