జీతాలివ్వండి మహాప్రభో..! | engineering college staff not getting salaries properly | Sakshi
Sakshi News home page

జీతాలివ్వండి మహాప్రభో..!

Published Fri, Apr 17 2015 3:30 AM | Last Updated on Sun, Sep 3 2017 12:23 AM

జీతాలివ్వండి మహాప్రభో..!

జీతాలివ్వండి మహాప్రభో..!

రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందిలో అత్యధిక శాతం మంది సకాలంలో జీతాలు అందక అల్లాడుతున్నారు.

  • వేతనాల్లేక అల్లాడుతున్న లక్ష మంది ఇంజనీరింగ్ కాలేజీల సిబ్బంది
  • ఆరేడు నెలలుగా జీతాలివ్వని వందకుపైగా కాలేజీలు
  • రీయింబర్స్‌మెంట్ బకాయిలను సాకుగా చూపుతున్న యాజమాన్యాలు
  • ఈ ఏడాది ఇప్పటికీ పైసా ఫీజు చెల్లించని రాష్ట్ర ప్రభుత్వం
  • సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందిలో అత్యధిక శాతం మంది సకాలంలో జీతాలు అందక అల్లాడుతున్నారు. హైదరాబాద్ సహా రాష్ట్రంలో ఉన్న 354 ఇంజనీరింగ్ కాలేజీల్లో పనిచేస్తున్న దాదాపు లక్షన్నర మందిలో సుమారు లక్ష మంది సిబ్బంది యాజమాన్యాల అనుచిత వైఖరితో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను సాకుగా చూపుతూ దాదాపు వంద కాలేజీల యాజమాన్యాలు విడతలవారీగా జీతాల బకాయిలు చెల్లిస్తుండటంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. అయితే కనీస వేతనాలు కూడా అమలు చేయని ఈ కాలేజీలు బకాయిలను బూచీగా చూపడం పచ్చి మోసమని, అది కారణం కానే కాదని సిబ్బంది సంఘాలు ఆరోపిస్తున్నాయి.
     
    సకాలంలో జీతాలిస్తున్నవి 113 కాలేజీలే...
    రాష్ట్రంలో ప్రస్తుతం 113 కాలేజీలు మాత్రమే నెలా నెలా సిబ్బందికి వేతనాలు చెల్లిస్తున్నాయి. వీటిలో (విశ్వవిద్యాలయాల గ్రాంట్ల సంఘం) యూజీసీ స్కేళ్లు అమలు చేస్తున్న కాలేజీలు 25 మాత్రమే ఉండగా మిగిలిన 88 కాలేజీలు నెలానెలా వేతనాలు చెల్లిస్తున్నా మామూలుగా ఇచ్చే దానిలో (నిబంధనల ప్రకారం) సగం కూడా ఇవ్వట్లేదు. ఇక మిగిలిన 241 కాలేజీల్లో 140 కాలేజీలు ప్రతి 45 రోజులు లేదా రెండు నెలలకు ఒకసారి వేతనాలు చెల్లిస్తున్నాయి. మిగిలిన 101 కాలేజీలు మాత్రం ఆరేడు నెలలు గడిచినా జీతాలు చెల్లించట్లేదు.
     
    కోచింగ్ సెంటర్లే దిక్కు...
    యాజమాన్యాలు నెలలు గడిచినా జీతభత్యాలు ఇవ్వకపోవడంతో బోధనా సిబ్బంది ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటున్నారు. హైదరాబాద్‌లో పుట్టగొడుగుల్లా వెలిసిన కోచింగ్ సెంటర్లు ఇప్పుడు వారికి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు చూపుతున్నాయి. దాదాపు వందకుపైగా ఉన్న కోచింగ్ కేంద్రాల్లో దాదాపు లక్ష మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు గ్రాడ్యుయేట్ ఆప్టిట్యుడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్) కోచింగ్ ఇవ్వడంలో వారంతా తలమునకలవుతున్నారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకూ...తిరిగి సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ శిక్షణ ఇస్తున్నారు. ఓవైపు పగలంతా కాలేజీలకు వెళ్లి పాఠాలు బోధిస్తూ మరోవైపు కోచింగ్ సెంటర్లకు ఉరుకులు పరుగులు పెడుతున్నారు.
     
    కన్వీనర్ కోటాలో సీటు పొందిన 90% మంది పేదలేనట...
    ప్రస్తుత విద్యా సంవత్సరంలో కన్వీనర్ కోటాలో సీటు పొందిన వారిలో 90 శాతం మంది పేదలేనట! ఈ ఏడాది కన్వీనర్ కోటాలో 68 వేలకుపైగా సీట్లు భర్తీ అవగా అందులో 60 వేల మంది ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులని ప్రభుత్వమే తేల్చింది. ఇందులో తమ తప్పు ఎక్కడుందని ఇంజనీరింగ్ కాలేజీలు అంటున్నాయి. ‘మా కాలేజీలో చదువుతున్న కొందరు విద్యార్థులు కార్లలో వస్తారు. మీకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎందుకని అడిగితే ప్రభుత్వం ఇస్తున్నప్పుడు ఎందుకు వద్దనాలన్నది వారి సమాధానం. తహసీల్దార్‌లు ఇష్టానుసారం సర్టిఫికెట్లు ఇవ్వడం వల్లే ఈ దుస్థితి ఏర్పడింది’ అని ప్రముఖ కాలేజీలోని ఓ సీనియర్ ఫ్యాకల్టీ వాపోయారు.
     
    టాప్ కాలేజీలకూ తప్పని కష్టాలు
    రాష్ట్రంలో టాప్ 25 స్థానాల్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలూ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ ఏడాది ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజులో ఇప్పటిదాకా పైసా రాలేదు. ఒక్కో కాలేజీకి గరిష్టంగా రూ. 23 కోట్లు, కనిష్టంగా రూ. 16 కోట్ల మేర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. బకాయిల కోసం ఎదురుచూడకుండా టాప్ కాలేజీలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడమో లేదా కార్పస్ ఫండ్ వాడుకోవడమో చేస్తున్నాయి. 2013-14 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం రెండు విడతల్లో చెల్లించింది. ఈ ఏడాది (2014-15)కి సంబంధించి మాత్రం పైసా విడుదల కాలేదు. మరో రెండు మాసాల్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతున్నా సర్కారు ఇంకా బకాయిలు చెల్లించలేదు.
     
     అప్పు తెచ్చి జీతాలిస్తున్నాం
     ఈ ఏడాది ప్రభుత్వం నుంచి పైసా రాలేదు. అయినా జీతాలు ఇవ్వక తప్పదు కాబట్టి బ్యాంకు నుంచి రూ. 17 కోట్లు అప్పుగా తీసుకున్నాం. దానికి ఇప్పటివరకూ రూ. 2.5 కోట్లు వడ్డీ చెల్లించాం.                 

                                                                               - వి.మాలకొండారెడ్డి, సీబీఐటీ చైర్మన్
     
    3 నెలలకోసారి బకాయిలివ్వాలి
     కన్వీనర్ కోటాలో సీటు పొందిన విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం ప్రతి మూడు నెలలకోసారి ఇస్తే బాగుంటుంది. అప్పుడు ఆర్థికంగా మాకు ఇబ్బందులు ఉండవు. సిబ్బందికి కూడా నెలానెలా వేతనాలు ఇవ్వగలుగుతాం.
                                                - గౌతంరావు, ఇంజనీరింగ్, వృత్తి విద్యా కాలేజీల సంఘం చైర్మన్
     
    తంటాలు తప్పట్లేదు
     పగలంతా కాలేజీలో పాఠాలు చెప్పి రాత్రి 10 గంటల దాకా, మళ్లీ పొద్దున్నే 4 గంటల నుంచి కోచింగ్‌కు వెళ్లాల్సి వస్తోంది. సర్వీసుకు బ్రేక్ పడుతుందేమోనని  నెలల తరబడి జీతాలు ఇవ్వకున్నా పని చేస్తున్నాం.
                                                                         - డాక్టర్ మురళీధర్‌రావు, ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్
     
    బోధన అంతంత మాత్రమే
     జీతాలు ఇవ్వని కాలేజీల్లో బోధన అంతంత మాత్రంగా ఉంటోంది. సిబ్బంది బోధనపై తగిన శ్రద్ధ చూపట్లేదు. ఫలితంగా ఆయా కాలేజీల్లో ఉత్తీర్ణత శాతం కనిష్టంగా ఏడు, గరిష్టంగా 19 శాతంగా ఉంది.
                                                                           - సీనియర్ అధికారి, జేఎన్‌టీయూహెచ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement