ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలు | Entrances in iiit | Sakshi
Sakshi News home page

ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలు

Published Tue, May 20 2014 1:55 AM | Last Updated on Tue, Aug 27 2019 4:36 PM

Entrances in iiit

 3 కళాశాలలు
 రాష్ట్రంలో మూడు ట్రిపుల్‌ఐటీ కళాశాలలు ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా బాసర, కృష్ణా జిల్లా నూజివీడు, కడప జిల్లా ఇడుపులపాయలో ఏర్పాటు చేశారు. వీటిని 2008 సంవత్సరంలో ప్రారంభించారు. ఇవి రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలో పని చేస్తాయి. ఈ విద్యా సంవత్సరంలో తొలి ప్రయత్నంలోనే పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ప్రస్తుతం తెలంగాణ ఏర్పడిన నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతంలో రెండు, తెలంగాణ ప్రాంతంలో ఏకైక ట్రిపుల్‌ఐటీ మిగలనుంది. విభజనకు ముందే నోటిఫికేషన్ జారీ చేసిన ఆర్‌జీయూకేటీ 3 వేల మంది విద్యార్థుల ప్రవేశాలకు కలిపి ఒకే చోట దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
 
  దరఖాస్తు
 http:///admissions2014.rgukt.in సైట్  ద్వారా అభ్యర్థి నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసిన దరఖాస్తు పత్రం ప్రింట్ ప్రతిని తీసుకోవాలి. దానిని డీడీ లేదా చలానా లేదా ఏపీ ఆన్‌లైన్‌లో చెల్లించిన రూ.150 రశీదు ఒరిజినల్ ప్రతికి అభ్యర్థుల విద్యా ధ్రువీకరణ పత్రాలు జత చేయాలి. వాటినిరిజిస్టార్, ఆర్‌జేయూకేటీ, వింధ్య సీ-4, గచ్చీబౌలి, హైదరాబాద్-500032 చిరునామాకు రిజిస్టరు పోస్టు గానీ స్పీడ్ పోస్టు ద్వారా గానీ పంపించాలి. 21-05-2014 నుంచి 16-06-2014 వరకు దరఖాస్తులు పంపవచ్చు.
 
  ప్రాంగణ నియామకాలు
 2008లో నెలకొల్పిన బాసర ట్రిపుల్‌ఐటీలో 2014  చివరి బ్యాచ్‌కు మొదటి ప్రాంగణ నియామకాలు జరిగాయి. కార్పొరేట్ కంపెనీలు ట్రిపుల్‌ఐటీకే చేరుకొని ప్రతిభ ఉన్న విద్యార్థులను సెలెక్ట్ చేసుకుని కొలువులు అందించాయి. చదువుపై ఆసక్తి ఉండి ఆరేళ్ల కోర్సు పూర్తి కాగానే యూనివర్సిటీ నేరుగా క్యాంపస్ నియామకాల కోసం కంపెనీలను ఆహ్వానిస్తుంది. కంపెనీలు వచ్చి ప్రతిభ గల విద్యార్థులకు కొలువులు అందిస్తున్నాయి.
 
   ఎంపిక ప్రక్రియ  
 గతంలో మూడు ట్రిపుల్ ఐటీలకు కలిపి ఆరువేల మంది విద్యార్థులకు ప్రవేశం కల్పించేవారు. రెం డేళ్లుగా ఒక్కో కళాశాలలో 1000 మందికే ప్రవేశం కల్పిస్తున్నారు. అంటే రాష్ట్రవ్యాప్తంగా మూడు వేల మంది విద్యార్థులకు ట్రిపుల్ ఐటీల్లో చేరే అవకాశం ఉంటుంది. ఉస్మానియా, ఆంధ్రా, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయాలను రీజియన్లుగా విభజించి ఒక్కో రీజియన్‌కు 42:36:22 నిష్పత్తిలో సీ ట్లు కేటాయిస్తారు. 85 శాతం స్థానాలను సంబంధిత విశ్వవిద్యాలయం రీ జియన్ పరిధిలోని స్థానిక విద్యార్థులకు కేటాయిస్తారు. మిగతా 15 శాతం స్థానాలను ఓపెన్ విభాగంలో భర్తీ చేస్తారు. పదో తరగతిలో సాధించిన గ్రేడ్‌పాయింట్(జీపీఏ)ల ఆధారంగా ఎంపిక జరుగుతుంది. రిజర్వేషన్ కేట గిరీ విద్యార్థులకు నిబంధనల మేరకు నిర్ధిష్ట సంఖ్యలో స్థానాలు కేటాయిస్తారు.

 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వెనుకబాటు కింద 0.4 జీపీఏ అదనంగా కలుపుతారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదివిన వారికి వెనుకబాటు సూచీ పాయింట్లు కలుపరు. జీపీఏ సమానంగా ఉంటే.. ఆ విద్యార్థులకు జీపీఏ సమానంగా ఉంటే గ్రేడ్‌పాయింట్ల ఆధారంగా విద్యార్థులను ఎంపి క చేస్తారు. సమానంగా పాయింట్లు ఉన్న విద్యార్థులు వేల సంఖ్యలో ఉన్నప్పుడు గణితంలో ఎక్కువ మార్కులు ఉన్న వారికే మొదటి ప్రాధాన్యం ఇస్తారు. గణితంలోనూ సమాన జీపీఏ ఉంటే భౌతికశాస్త్రం.. అందులోనూ సమానంగా వస్తే రసాయనశాస్త్రం.. అందులోనూ అదే విధానం కనిపిస్తే ఇంగ్లిష్ మార్కులను పరిగణలోకి తీసుకుంటారు. ఇలాంటప్పుడు కూడా ఎక్కువ మంది విద్యార్థులు సమానంగా ఉంటే పుట్టిన తేదీ ఆధారంగా ఎక్కువ వయసు ఉన్న వారికి తొలి ప్రాధాన్యాన్నిస్తూ ప్రవేశం కల్పిస్తారు.
 
 బోధన రుసుము
 తక్కువ ఆదాయం ఉన్న పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి ఇంజినీరింగ్ విద్యను అందించాలన్న సదుద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ట్రిపుల్‌ఐటీలను నెలకొల్పారు. ట్రిపుల్ ఐటీల్లో కుటుంబ ఆదాయం రూ.లక్ష లోపు ఉన్న వారందరికీ బోధన, వసతికి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం ఉండదు. లక్ష రూపాయల లోపు ఆదాయం ఉన్న అన్ని సామాజిక వర్గాల వారికి ఈ విధానం వర్తిస్తుంది. తక్కువ ఆదాయం ఉన్న వారంతా రూ.3వేల కాశన్ డిపాజిట్ చెల్లిస్తే ఇది కూడా కోర్సు పూర్తయ్యాక తిరిగి ఇచ్చేస్తారు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.లక్షకు పెరిగితే రూ.36 వేల బోధన రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
 
  ప్రవేశం తర్వాత...

 ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశం తర్వాత విద్యార్థులు ఆరేళ్ల కోర్సు పూర్తి చేయాల్సి ఉంటుంది. మొదటి రెండేళ్లు పీయూసీ కోర్సు చదవాలి. ఈ కోర్సు ఇంటర్మీడియట్‌తో సమానం. రెండేళ్ల కోర్సు పూర్తయ్యాక ఇతర అవకాశాలు వస్తే విద్యార్థులు బయటకు వెళ్లిపోయే అవకాశం ఉంటుంది. ఈ విద్యార్థులకు పీయూసీ ఉత్తీర్ణత పత్రాన్ని కళాశాల అధికారులు అందజేస్తారు. పీయూసీ తర్వాత నాలుగేళ్ల ఇంజినీరింగ్ కోర్సు ఉంటుంది. ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బీటెక్ ట్రిపుల్ ఐటీల ప్రధాన లక్ష్యం కావడంతో విద్యార్థులంతా ఆరేళ్ల కోర్సు ఇక్కడే పూర్తి చేసేందుకు మొగ్గుచూపుతారు.
 
  కోర్సుల ఎంపిక ఇలా...
 ట్రిపుల్ ఐటీల్లో చేరిన విద్యార్థులకు మొదటి రెండేళ్ల పీయూసీ మార్కులే బీటెక్ కోర్సుల కేటాయింపునకు కీలకం అవుతాయి. కళాశాలలో చేరిన విద్యార్థులు మొదటి నుంచే చదువుపై దృష్టిసారించాలి. పాఠశాల స్థాయి దాటాక ట్రిపుల్ ఐటీల్లో చేరే విద్యార్థులకు పరీక్షలు సెమిస్టర్ విధానంలో ఉంటాయి. రెండేళ్ల పీయూసీ శ్రద్ధగా చదివి మంచి మార్కులు సాధిస్తే ఉత్తమ కోర్సులు చదివే అవకాశం ఉంటుంది. ఇక మూడో సంవత్సరం బీటెక్‌లో విద్యార్థులందరికీ ఒకే కోర్సు ఉంటుంది. రెండేళ్ల పీయూసీ పూర్తయ్యాక మూడో సంవత్సరం బీటెక్ ఆఖరులో కోర్సుల ఆప్షన్లను ఎంచుకోవచ్చు.

ఇంజినీరింగ్ విభాగంలో సివిల్, కెమికల్, కంప్యూటర్ సైన్స్, ఈసీఈ, మెటలార్జికల్ అండ్ మెటీరియల్ సైన్స్ కోర్సులు మూడు ట్రిపుల్‌ఐటీల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ ఆరింటిలో ఎక్కువ డిమాండ్ ఉన్న కోర్సుల్లో సీటు కోసం మార్కులను పరిగణలోకి తీసుకోవాలి. బీటెక్ చదివే విద్యార్థులు తప్పనిసరిగా మైనర్ సబ్జెక్టును ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కోర్సుతో పాటు మైనర్ సబ్జెక్టు కింద సంగీతం, నృత్యం, హ్యుమానిటీస్, గణితం, ఇంజినీరింగ్ సైన్స్ వంటివి ఎంచుకోవాలి. మేజర్ డిగ్రీతోపాటు అదనంగా విశ్వవిద్యాలయం ఈ మైనర్ డిగ్రీని ప్రదానం చేస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement