మక్కల పైసలు ఎప్పుడిస్తరు?
జగిత్యాల అగ్రికల్చర్ :
‘పత్తి, మొక్కజొన్న, వరి ధాన్యం విక్రయించిన రైతులకు వెంటనే చెల్లించాలి’ రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశాలు.
మొక్కజొన్న ధాన్యం డబ్బులకు మరో 15 రోజులవుతుందని స్థానికంగా మొక్కజొన్న కొనుగోలు చేస్తున్న మార్క్‌ఫెడ్ అధికారుల బుజ్జగింపులు.
‘మాకు డబ్బులు అవసరముండే కదా పంట అమ్ముకుంటిమి. రెండు,మూడు రోజుల్లో డబ్బులు ఇస్తామని చెప్పడంతో మొక్కజొన్నలు అమ్మితిమి. ఇప్పటికి పది రోజులైంది. మరో పది రోజులవుతుందని అధికారులు అనడం ఎంతవరకు న్యాయం’ ఇది రైతుల ఆవేదన.
కొనుగోలు కేంద్రాల్లో మొక్కజొన్న అమ్మిన రైతులు డబ్బులకోసం ఎదురుచూస్తున్నారు. పది రోజులుగా అధికారుల చుట్టూ ప్రదక్షిణ చేయూల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా దాదాపు లక్ష క్వింటాళ్ల మొక్కజొన్న ధాన్యాన్ని కొనుగోలు చేశారు. జగిత్యాల మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం ద్వారా దాదాపు 15వేల క్వింటాళ్ల మొక్కజొన్నలు మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేశారు.
అక్టోబర్ 30న మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రం ప్రారంభం కాగా, అప్పటి నుంచి కొనుగోలు చేసిన మొక్కజొన్నకు డబ్బులు ఇవ్వడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ మేరకు ధాన్యం అమ్మిన రైతులు చెక్కుల కోసం రోజు మార్క్‌ఫెడ్ అధికారులను కలిసి వెళ్తున్నారు. అధికారులు సైతం అదిగో.. ఇదిగో అంటూ తిప్పించుకుంటున్నారని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చే స్తున్నారు.
రావాల్సినవి.. రూ.1.96 కోట్లు..
జగిత్యాల మార్కెట్‌యార్డులో మార్క్‌ఫెడ్ కొనుగోలు చేసిన దాదాపు 15వేల క్వింటాళ్ల ధాన్యానికి రైతులకు రూ.1.96 కోట్లు రావాల్సి ఉంది. రబీ సీజన్‌లో పెట్టుబడికి, ఇంటి ఖర్చులకు అవసరమై మొక్కజొన్నను అమ్ముకుంటే ఇలా ఇబ్బంది ఎందుకు పెడుతున్నారని రైతులు ప్రశ్నిస్తున్నారు. అధికారుల వద్ద గురువారం ఆందోళన కూడా చేశారు. ఇలా జగిత్యాల డివిజన్‌లోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు రోజు డబ్బుల కోసం తిరిగి ప్రదక్షిణలు చేస్తున్నారు. దీనిపై మార్కెట్ కార్యదర్శి పురుషోత్తంను వివరణ కోరగా.. సెలవులతో ఇబ్బందులు వచ్చాయని, చెక్కులు సిద్ధమవుతున్నాయని చెప్పారు. వాటిని రైతులకు త్వరలో పంపిణీచేస్తామని తెలిపారు.