పీఏసీఎస్‌లో అవినీతి బాగోతం | CEO of the corrupt money loan waiver | Sakshi
Sakshi News home page

పీఏసీఎస్‌లో అవినీతి బాగోతం

Published Mon, Apr 27 2015 1:24 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

CEO of the corrupt money loan waiver

- రుణమాఫీ డబ్బులు దండుకున్న సీఈఓ
- సభ్యత్వం డబ్బులు స్వాహా...
- దొంగ రశీదులు ఇచ్చాడని ఫిర్యాదు
- సీఈఓ మురళీధర్‌పై పలు ఆరోపణలు
- రాజగోపాల్‌పేట  పీఎస్‌లో కేసు నమోదు
నంగునూరు:
పాలమాకుల పీఏసీఎస్‌లో అవినీతి ఆరోపణలు వెళ్లువెత్తుతున్నాయి. రైతుల రుణమాఫీ డబ్బులు సీఈఓ సొంతానికి వాడుకొని రైతులను మోసం చేశాడని ఫిర్యాదు రావడంతో సొసైటీ తీర్మానం మేరకు అతనిపై కేసు నమోదైంది.

ఇదే కాకుండా ఎన్నికల సమయంలో సభ్యత్వ నమోదు కోసం 199 మంది రైతుల వద్ద తీసుకున్న డబ్బులు సొసైటీ ఖాతాలో జమ చేయకుండా అవినీతికి పాల్పడ్డాడని ఆరోపణలు వస్తున్నా యి. సొసైటీ యాక్ట్ ప్రకారం సెక్షన్ 51 కింద పాలమాకుల సొసైటీలో జరిగిన అవకతవకలపై విచారణకు అధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.

నంగునూరు మండలం పాలమాకుల పీఏసీఎస్‌లోని 16 గ్రామాల రైతులకు 2012-13కి గాను పంట రుణాలు మాఫీ అయ్యాయి. అప్పటికే చాల మంది రైతుల రుణాలు చెల్లించగా సొసైటీ నుంచి డబ్బులు ముట్టినట్లుగా రశీదు అందజేశారు. వారి నుంచి డబ్బులు తీసుకున్న సీఈఓ మురళీధర్ సొసైటీ ఖాతాలో డబ్బులు జమ చేయకుండా సొంతానికి వాడుకున్నాడని ఆరోపణలు వస్తున్నాయి.

ఇదిలా ఉంటే లెటర్ నంబర్ సీ7-48-2008-09 పేరిట సొసైటీకి పావలా వడ్డీ కింద రూ 9,27,466 విడుదలయ్యాయి. ఈ డబ్బులను మూతపడ్డ మగ్దుంపూర్ సొసైటీ పేరిట సిండికేట్ బ్యాంక్ పాలమాకులలో సింగిల్ అకౌంట్ తీసి రూ.18 లక్షల17 వేలు అకౌంట్‌లో జమచేశారు. పంట రుణాలకు సంబంధించిన డబ్బులు రూ 8,17,675 జేడీఏ అగ్రికల్చర్‌కు పంపినట్లు 2013న లెడ్జర్‌లో నమోదు చేశారు. ఆ డబ్బులో నుంచి రూ.8 లక్షలు 2013 జనవరిలో కరీంనగర్ జిల్లా మెట్‌పల్లి సిండికేట్ బ్యాంక్‌లో జేడీరావ్ (జే.దామోదర్‌రావు) పేరిట నెఫ్ట్ ద్వారా అకౌంట్‌లో బదిలీ చేశారు.

రైతుల సభ్యత్వం డబ్బులు స్వాహా...
సొసైటీ పాలక వర్గం పదవీ కాలం ముగియడంతో 2012 డిసెంబర్‌లో ఎన్నిల నోటిఫికేషన్ వచ్చింది. దీంతో కొత్త సభ్యత్వాలు తీసుకోవాలని నిర్ణయించడంతో ఒక్కో సభ్యుని నుంచి రూ.330 చొప్పున 199 మంది రైతుల వద్ద రూ.65,670 వసూలయ్యాయి. ఈ డబ్బులు సొసైటీ ఖాతాలో జమ చేయాల్సి ఉన్నప్పటికీ సొంతానికి
వాడుకున్నట్లు తెలుస్తోంది.

ఎరువుల డబ్బులు స్వాహా..
కొన్ని సంవత్సరాలుగా సొసైటీ తరపున రైతులకు ఎరువులు అమ్ముతున్నారు.  వ్యవసాయశాఖ నుంచి యూరియా, డీఏపీ, ఎరువులు తీసుకొని డబ్బులు చెల్లించకపోవడంతో ఇప్పటి వరకు రూ 4.50 లక్షలు సొసైటీ బకాయి పడ్డారు. ఎరువులు అమ్మగా వచ్చిన కమీషన్ డబ్బులను సొసైటీ సొంత అవసరాలకు, వేతనాలకు చైర్మన్ అనుమతితో వాడుకోవాలి. ఇందుకు విరుద్ధంగా సిబ్బందికి వేతనాలు ఇచ్చినట్లు లెక్కలు చూపారు.

ఫిర్యాదుల వెల్లువ..
పాలమాకుల పీఏసీఎస్‌లో తాను తీసుకున్న అప్పు తిరిగి చె ల్లించినప్పటికి తన పేరిట రుణమాఫీ ఎలా వస్తుందని నర్మేటకు చెందిన గోనెపల్లి రవి 2015 ఫిబ్రవరిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సిద్దిపేట సబ్‌డివిజన్ కోఆపరేటివ్ అధికారి ఎల్లయ్య విచారణ చేపట్టారు. గోనెపల్లి రవితోపాటు చాల మంది రైతులు డబ్బులు కట్టగా సీఈఓ దొంగ రశీదులు సృష్టించి రైతులకు ఇచ్చాడని విచారణలో తేలింది.

విచారణకు అధికారుల ఆదేశాలు: సొసైటీ చైర్మన్
సీఈఓ మురళీధర్ నుంచి రూ.6.70లక్షలు రికవరీ చేశాం.విచారణకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
ఎత్తుగడతో ఆరోపణలు: మురళీధర్, సీఈఓ రాజకీయంగా ఇబ్బందులకు గురి చేసేందుకే అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. అధికారులు పారదర్శకంగా విచారణ చేస్తే నిజానిజాలు తెలుస్తాయి. నేను ఎలాంటి అవినీతికి పాల్పడలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement