
సునీల్ చెక్కేశాడా..?
► వాణిజ్య పన్నుల శాఖలో పన్నుఎగవేత కుంభకోణం కేసు నిందితుడు
► ఫిబ్రవరిలో ఎక్స్‌పైర్డ్ అయిన సునీల్ పాస్‌పోర్టు.?
► బినామీ పాస్‌పోర్టుపై విదేశాలకు వెళ్లాడా..? ఆరా తీస్తున్న సీఐడీ అధికారులు
నిజామాబాద్ :బ్యాంకులకు రూ. వేల కోట్ల కుచ్చుటోపీ పెట్టి విదేశాలకు వెళ్లిపోయిన విజయ్‌మాల్యా మాదిరిగానే.. వాణిజ్య పన్నుల శాఖకు రూ.వందల కోట్ల పన్ను ఎగనామం పెట్టిన సునీల్ కూడా విదేశాలకు చెక్కేశాడా..? బోధన్ వాణిజ్యపన్నుల శాఖలో జరిగిన కుంభకోణంలో కీలక సూత్ర, పాత్రధారి శివరాజ్ కుమారుడు సునీల్ దేశం విడిచి వెళ్లిపోయాడా.? ఈ కోణంలో సీఐడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ మేరకు సునీల్ పాస్‌పోర్టు వివరాలపై ఆరా తీసింది. అయితే సునీల్ పాస్‌పోర్టు మాత్రం ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఎక్స్‌పైర్డ్ అయినట్లు సీఐడీ ఉన్నతాధికారుల దృష్టికి వచ్చినట్లు సమాచారం.
దీంతో సునీల్ దేశంలో రహస్య ప్రాంతంలో తలదాచుకున్నాడా.? బినామీ పాస్‌పోర్టుపై విదేశాలకు వెళ్లిపోయాడా..? అనే కోణంలో ఆరా తీస్తున్నారు. రూ. వందల కోట్లు వ్యాట్, సీఎస్‌టీ ఎగనామం పెట్టిన కేసులో శివరాజ్ తర్వాత సునీల్ రెండో కీలక సూత్ర, పాత్రధారి. అయితే ఎ1 నిందితుడిగా ఉన్న శివరాజ్‌ను సీఐడీ అధికారులు అరెస్టు చేసినప్పటికీ.. అనారోగ్యం పేరుతో ఆయన్ను పూర్తిస్థాయిలో ïసీఐడీ అధికారులు ప్రశ్నించలేకపోతున్నారు. ఇటీవల న్యాయస్థానం అనుమతితో కేవలం ఒకరోజు మాత్రమే కస్టడీలోకి తీసుకున్న సీఐడీ అధికారులు తిరిగి జైలుకు పంపారు.
వైద్యుల పర్యవేక్షణలో శివరాజ్‌ను సీఐడీ ప్రశ్నించాల్సి వచ్చింది. దీంతో అనుకున్న మేరకు ఈ కేసు దర్యాప్తు వేగవంతం కావడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. శివరాజ్‌తో పాటు కుంభకోణాన్ని నడిపిన సునీల్‌ను అరెస్టు చేసి, విచారిస్తే కేసులో కీలక అంశాలు వెలుగులోకి వస్తాయని సీఐడీ అధికారులు భావిస్తున్నారు.
మూడు నెలలుగా జాడ లేదు..
ఈ కుంభకోణంపై వాణిజ్యపన్నుల శాఖ ఉన్నతా«ధికారులు బోధన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శివరాజ్, సునీల్‌లతో పాటు, బోధన్ సీటీఓ కార్యాలయంలో పనిచేస్తున్న ఏసీటీఓ విజయ్‌కృష్ణ, మరో ఇద్దరు సిబ్బంది హన్మాన్‌సింగ్, వేణుగోపాల్‌లపై ఫిబ్రవరి 2న బోధన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. దాదాపు 40 రోజుల అనంతరం విజయ్‌కృష్ణ యాంటిసిపేటరీ బెయిల్ కోసం బోధన్ కోర్టును ఆశ్రయించారు.
ఆయన బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన కోర్టు జుడీషియల్ రిమాండ్‌కు తరలించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు విజయ్‌కృష్ణను బోధన్ జైలుకు తరలించారు. వేణుగోపాల్, హన్మాన్‌సింగ్‌లను కూడా పోలీసులు అరెస్టు చేశారు. తర్వాత శివరాజ్‌ను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. కానీ సుమారు మూడు నెలలుగా సునీల్ జాడ లేకుండా పోయింది.