రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్లపై ప్రధాని ఫొటో ఉండాల్సిందే
లేకపోతే కేంద్రం నిధులు నిలిపివేసి, లబ్దిదారులకు నేరుగా అందిస్తాం
కేంద్ర మంత్రి బండి సంజయ్
సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరిన కరీంనగర్ మేయర్ సునీల్‌రావు
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ‘కేంద్రం ఇచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర పథకాలకు మళ్లిస్తున్నాయి. గతంలో నేను నిలదీయడం వల్ల వరంగల్, కరీంనగర్ స్మార్ట్‌సిటీ నిధులను గత ప్రభుత్వం విడుదల చేసింది. ఇకపై కేంద్ర నిధులతో నిర్మించే ఇందిరమ్మ ఇండ్లు, అలాగే రేషన్‌కార్డులపై సీఎంతోపాటు ప్రధాని ఫొటో తప్పకుండా ఉండాల్సిందే. లేకపోతే ఆయా పథకాలకు నిధులు నిలిపివేస్తాం’అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు.
శనివారం కరీంనగర్‌లో నగర మేయర్ సునీల్‌రావు, పలువురు కార్పొరేటర్లు బీఆర్‌ఎస్ నుంచి బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ, కేంద్రం ఇచ్చే నిధులతో అమలయ్యే పథకాలకు ప్రధాని ఫొటోను వాడకుంటే తామే లబ్దిదారులకు నేరుగా నిధులు ఇచ్చేలా ఆలోచన చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ప్రసంగంలో ఆయన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు.
రేవంత్‌రెడ్డికి గురువు కేసీఆరేనని, అందుకే.. ఆయన బాటలోనే రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. ‘సీఎం రేవంత్ బీఆర్‌ఎస్ నేతలను తొలుత కేసులతో భయపెట్టి, ఆపై కాంగ్రెస్ అధిష్టానానికి డబ్బులు ఇవ్వగానే.. వాటిని పక్కనబెడుతున్నారు. గతంలో పెట్టిన కేసులన్నీ ఇలాగే నీరుగార్చారు’అని ధ్వజమెత్తారు.
కంపెనీలు, నిధులపై శ్వేతపత్రం ప్రకటించాలి
‘పార్టీలకు చందాలిచ్చిన గ్రీన్‌కో లాంటి సంస్థపై ఏసీబీ దాడులు చేయడం రాష్ట్రానికి నష్టం. ఫలితంగా పలు కంపెనీలు రాష్ట్రం నుంచి తరలివెళ్తున్నాయి. అసలు 2014 నుంచి రాష్ట్రానికి వచ్చిన కంపెనీలు, నిధులు, కల్పించిన ఉద్యోగాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి. రాష్ట్రానికి కేంద్రం ఎన్ని నిధులిచ్చినా.. కరీంనగర్‌కు స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు ఇచి్చనా, ఏ కార్యక్రమానికీ నన్ను పిలవలేదు.
బీఆర్‌ఎస్ పాలన మొత్తం అవినీతిమయం. సునీల్‌రావు చేరికతో రాబోయే బల్దియా ఎన్నికల్లో కరీంనగర్‌లో బీజేపీ విజయబావుటా ఎగరేస్తుంది’అని సంజయ్ అన్నారు. అనంతరం సునీల్‌రావు మాట్లాడుతూ.. మాజీ మంత్రి గంగుల కమలాకర్‌పై పలు ఆరోపణలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment