అభివృద్ధి, సంక్షేమమే ఎజెండా | ESL narasimhan participates in republicDay | Sakshi
Sakshi News home page

అభివృద్ధి, సంక్షేమమే ఎజెండా

Published Wed, Jan 27 2016 4:05 AM | Last Updated on Sun, Sep 3 2017 4:21 PM

అభివృద్ధి, సంక్షేమమే ఎజెండా

అభివృద్ధి, సంక్షేమమే ఎజెండా

గణతంత్ర వేడుకల్లో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్
కొత్త రాష్ట్రంలో అనేక సవాళ్లున్నా ప్రభుత్వం ముందడుగు వేస్తోంది.. పేదల పక్షపాతిగా మన్ననలు అందుకుంటోంది
బడ్జెట్‌లో సంక్షేమానికే రూ.40 వేల కోట్లు వెచ్చిస్తోంది
2018నాటికి 25 వేల మెగావాట్ల విద్యుత్ లభ్యత
ఈ ఏడాది చివర్లో 3 లక్షల చదరపు
అడుగుల విస్తీర్ణంలో రెండో విడత టీ-హబ్

 
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తోందని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ చెప్పారు. ప్రజలకు జవాబుదారీగా ఉంటూ పారదర్శక పరిపాలన అందించడానికి శాయశక్తులా కృషి చేస్తోందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ ఎజెండా పేదల పక్షపాతిగా మన్ననలు అందుకుంటోందని ప్రశంసించారు. గడచిన 19 నెలల్లో ప్రజల అవసరాలు, ప్రాథమ్యాలు గుర్తించడంలో సఫలమైన ప్రభుత్వం.. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు  తదితర పథకాలను ప్రవేశపెట్టిందన్నారు.

67వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం సికింద్రాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్‌లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం గవర్నర్ ప్రసంగించారు. ‘ప్రియమైన రాష్ట్ర ప్రజలందరికీ..’ అంటూ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన ఆయన.. ‘భూగర్భమున గనులు.. పొంగిపారే నదులు.. శృంగార వనతతుల సింగారముల పంట.. నా తల్లి తెలంగాణ రా.. వెలలేని నందనోద్యానమ్మురా!’ అని ఓ కవి రాసిన గీతాన్ని గుర్తుచేస్తూ రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

అనంతరం రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలును సమీక్షిస్తూ ఆంగ్లంలో ప్రసంగించారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ఎన్నో సవాళ్లు ఉన్నా ప్రభుత్వం అనేక రంగాల్లో ముందడుగు వేస్తోందని చెప్పారు. తాగునీరు, సాగునీరు, పరిశ్రమల అవసరాల కోసం కృష్ణా, గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోవడానికి ప్రభుత్వం అన్ని ప్రధాన నీటిపారుదల ప్రాజెక్టుల రీ డిజైనింగ్ ప్రక్రియను చేపట్టిందని, కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. గోదావరి, కృష్ణా నదులతో తెలంగాణ భూములు తడవాలని, పచ్చని పంటలతో ఈ నేల పరవశించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పథకాల అమలులో భాగస్వామ్యం కావాలని యువతరానికి పిలుపునిచ్చారు. బంగారు తెలంగాణ సాధన లక్ష్యంలో అహర్నిశం కృషి చేద్దామంటూ గవర్నర్ తన ప్రసంగాన్ని ముగించారు.

గవర్నర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..

  •  ఆదర్శ సంక్షేమ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, ఆస రా పింఛన్లు వంటి పథకాలను ప్రవేశపెట్టింది.
  •  మూడేళ్లలో రాష్ట్రంలోని ఇంటింటికీ తాగునీటి సరఫరా కోసం 1.26 లక్షల కి.మీ. పొడవున ‘వాటర్ గ్రిడ్’ నిర్మించేందుకు రూ.40 వేల కోట్లతో మిషన్ భగీరథ పథకాన్ని చేపట్టింది.
  •  స్థానిక సంస్థల బలోపేతానికి ‘గ్రామజ్యోతి’ పథకాన్ని ప్రవేశపెట్టింది.
  •  పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్ల పథకంలో భాగంగా ప్రతి నియోజకవర్గానికి 400 చొప్పున రాష్ట్రంలో ఇప్పటికే 66 వేల ఇళ్లను మంజూరు చేసింది.
  •  2015-16లో లక్షా 15 వేల కోట్ల రూపాయల బడ్జెట్‌లో కేవలం సంక్షేమ రంగంపైనే రూ.40 వేల కోట్లు వెచ్చిస్తోంది.
  •  మైనారిటీల సంక్షేమానికి రూ.1,100 కోట్లు, ఎస్సీల సంక్షేమానికి రూ.8 వేల కోట్లు, ఎస్టీల సంక్షేమానికి రూ.5 వేల కోట్లను కేటాయించి సంక్షేమానికి పెద్దపీట వేసింది.
  •  విద్యుదుత్పత్తి, సరఫరాల అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలు విద్యుత్ కోతలకు ముగింపు పలికాయి. 2018 నాటికి 5వేల మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తితో సహా మొత్తం 25 వేల మెగావాట్ల విద్యుత్ లభ్యతను సాధించడమే ప్రభుత్వ లక్ష్యం.
  •  రానున్న ఐదేళ్లలో రూ.22,500 కోట్ల వ్యయంతో రాష్ట్రంలోని 45,300 చెరువుల పునరుద్ధరణ కోసం మిషన్ కాకతీయ పథకాన్ని అమలు చేస్తోంది.
  •  రూ.1,31,988 కోట్ల వ్యయంతో 34 భారీ, మధ్యతర నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఏటా నీటిపారుదల ప్రాజెక్టుపై రూ.25 వేల కోట్లను ఖర్చు చేస్తాం.
  •  రాష్ట్ర ఐటీ పరిశ్రమ రంగం రూ.68,258 కోట్ల విలువైన ఉత్పత్తులను ఎగుమతి చేసింది. రూ.2,35,000 కోట్ల ఐటీ ఉత్పత్తులను ఎగుమతి చేసే లక్ష్యంతో హైదరాబాద్ చుట్టపక్కల ప్రాంతాల్లో కేంద్రం సాయంతో ఐటీఐఆర్ ప్రాజెక్టును చేపట్టాం.
  •  టీ-హబ్ తొలి విడతలో భాగంగా గచ్చిబౌలిలో 70 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో దేశంలోనే అతిపెద్ద ‘స్టార్ట్-అప్’ ఇన్‌క్యూబేటర్‌ను ప్రారంభించాం. ఈ ఏడాది చివర్లోగా రూ.150 కోట్ల పెట్టుబడితో 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండో విడత టీ-హబ్ ప్రారంభిస్తాం.
  •  ప్రభుత్వం ప్రవేశపెట్టిన టీఎస్-ఐపాస్ ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులను ఆకర్షిస్తోంది. ఇప్పటివరకు ప్రభుత్వం రూ.25,000 వేల కోట్ల పెట్టుబడులను రాబట్టింది. 1,013 కొత్త పరిశ్రమల స్థాపనకు అనుమతులు ఇచ్చింది.
  •  19వ అంతర్జాతీయ బాలల చిత్రోత్సవం నిర్వహణతో పాటు బోనాలు, బతుకమ్మ ఉత్సవాలు, గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించి రాష్ట్రంలో సంస్కృతీ, సాంప్రదాయ కార్యక్రమాలకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. కృష్ణా పుష్కరాలు, సమ్మక్క-సారక్క జాతరను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు జరుగుతున్నాయి.

 
 అమరవీరులకు సీఎం నివాళి
 పరేడ్ గ్రౌడ్‌లో నిర్వహిం చిన గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జెండా ఆవిష్కరణకు ముందు అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. వేడుకల్లో గవర్నర్ సతీమణి విమలా నరసింహన్, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, శాసన మండలి చైర్మన్ కె.స్వామిగౌడ్, డిప్యూటీ సీఎంలు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, మంత్రులు ఈటల రాజేందర్, నాయిని నర్సింహారెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జి.జగదీశ్‌రెడ్డి, పద్మారావు, జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, జోగురామన్న, ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ కవిత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ తదితరులు పాల్గొన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement