నియోజకవర్గానికో గురుకుల డిగ్రీ కాలేజీ
మండలానికో జూనియర్ కాలేజీ ఏర్పాటు: కడియం
సాక్షి, హైదరాబాద్: వచ్చే విద్యా సంవత్సరంలో నియోజకవర్గానికో గురుకుల డిగ్రీ కాలేజీ, మండలానికో గురుకుల జూనియర్ కాలేజీని ఏర్పాటు చేస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. పాఠశాల విద్యా డైరెక్టరేట్‌లో సోమవారం ఆయన మాట్లాడారు. 2018–19 విద్యా సంవత్సరంలో ఈ కళాశాలలను ప్రారంభించే అవకాశం ఉందన్నారు. ఎమ్మెల్యేలు ఇచ్చిన ప్రతిపాదనలకు సీఎం ఆమోదం తెలిపారని, వాటిని పరిగణనలోకి తీసుకొని చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ మేరకు భవన నిర్మాణాలకు స్థలాలను సిద్ధం చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చామన్నారు.
కొత్తగా ఏర్పాటు చేస్తున్న 84 గురుకుల పాఠశాలలను ఆగస్టు 15 నాటికి ప్రారంభిస్తామన్నారు. కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాల్లో (కేజీబీవీ) 12వ తరగతి వరకు కొనసాగించేందుకు కేంద్రం అంగీ కరించలేదని, అయితే వచ్చే విద్యా సంవత్సరం నాటికి కేజీబీవీల ను 10వ తరగతి వరకు పెంచే అవకాశం ఉంద ని, అపుడు రాష్ట్రంలో 12వ తరగతి వరకు ప్రవేశపెట్టేందుకు యోచి స్తున్నామన్నారు. కేజీబీవీల స్పెషల్ ఆఫీసర్ల వేతనాలను రూ.20 వేల నుంచి రూ.25వేలకు పెంపు, కాంట్రాక్టు రెసిడెంట్ టీచర్ల (సీఆర్‌టీ) వేతనాలను రూ.15 వేల నుంచి రూ.20 వేలకు పెంచే ప్రతిపాదనల ఫైలు ప్రస్తుతం సీఎం పరిశీలనలో ఉందన్నారు.
కేజీబీవీల్లో వసతులకు రూ.548 కోట్లు..
525 గురుకులాలను ఒకేసారి ప్రారంభించి నందునా కొన్నింటిని అద్దె భవనాల్లో ఏర్పా టు చేశామని, త్వరలోనే వాటికి శాశ్వత ఏర్పాట్లు పూర్తి చేస్తామని కడియం చెప్పారు. కేజీబీవీల హాస్టల్ విద్యార్థులకు ట్రంక్ పెట్టెలు, గ్లాసులు, ప్లేట్లు కూడా ఇవ్వాలని నిర్ణయించామన్నారు. కొత్తగా వచ్చిన వాటిల్లో 34 కేజీబీవీల పక్కా భవనాలకు కేంద్రం రూ.90.72 కోట్లు మంజూరు చేసిందన్నారు.