
బాలికలే ఫస్ట్
రాష్ట్రంలో తొలిసారిగా ప్రకటించిన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో బాలికలదే పైచేయిగా ఉంది.
ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో అత్యధిక ఉత్తీర్ణత
అమ్మాయిల్లో 61.68 శాతం.. అబ్బాయిల్లో 49.60 శాతం పాస్
హైదరాబాద్ రాష్ట్రంలో తొలిసారిగా ప్రకటించిన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో బాలికలదే పైచేయిగా ఉంది. ఉత్తీర్ణత శాతం వారిదే అధికంగా ఉంది. ఇంటర్ ఫస్టియర్(జనరల్) పరీక్షలకు రాష్ట్రంలో 4,31,363 మంది హాజరు కాగా అందులో 2,39,954 మంది(55.62) ఉత్తీర్ణులయ్యారు. మొత్తం విద్యార్థుల్లో బాలికలు 2,15,029 మంది పరీక్షలు రాయగా 1,32,639 మంది (61.68 శాతం) ఉత్తీర్ణులయ్యారు. 2,16,334 మంది బాలురు పరీక్షలు రాయగా, 1,07,315 మంది(49.60 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఈ ఫలితాల్లో 71 శాతం అత్యధిక ఉత్తీర్ణతతో రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో ఉండగా, 43 శాతం ఉత్తీర్ణతతో నల్లగొండ చివరి స్థానంలో నిలిచింది. మార్చి 9 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాలను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి బుధవారం విడుదల చేశారు. వేగంగా ఫలితాలను సిద్ధం చేసిన అధికారులను అభినందించారు. ఈ నెలాఖరులోగా ద్వితీయ సంవత్సర ఫలితాలను విడుదల చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆచార్య, ఇంటర్‌బోర్డు కార్యదర్శి డాక్టర్ అశోక్, ఇంటర్ బోర్డు సలహాదారు వీరభద్రయ్య తదితరులు పాల్గొన్నారు. సలహాదారుగా అందించిన సేవలకుగాను వీరభద్రయ్యను ఈ సందర్భంగా సన్మానించారు.
బీసీ గురుకులాల్లో 86 శాతం ఉత్తీర్ణత
మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల విద్యాసంస్థల్లో చదువుకుంటున్న (2014-15) జూనియర్ ఇంటర్ విద్యార్థులు 86 శాతం ఉత్తీర్ణతను సాధించారు. సీఈసీ గ్రూపులో 500 మార్కులకు గాను 456 మార్కులు సాధించిన కె.అశోక్, ఎంఈసీ గ్రూపులో 500 మార్కులకుగాను 433 మార్కులు సాధించిన జి,అవినాశ్ మొదటిస్థానంలో నిలిచారు. ఈ విద్యార్థులను బీసీ సంక్షేమశాఖ మంత్రి జోగు రామన్న, ఈ శాఖ ముఖ్యకార్యదర్శి డాక్టర్ టి.రాధ, గురుకుల విద్యాలయాల సొసైటీ కార్యదర్శి మల్లయ్య భట్టు అభినందించారు.
26 నుంచి మెమోల జారీ
మార్కుల రిజిస్టర్లను రెండు రోజుల్లో సం బంధిత ప్రాంతీయ తనిఖీ అధికారులకు అందజేయనున్నారు. ప్రిన్సిపాళ్లు వాటిని తీసుకుని తమ తమ కాలేజీల్లో ప్రదర్శించాల్సి ఉంటుంది. అలాగే విద్యార్థుల మార్కుల జాబితాలను ఈ నెల 26 నుంచి ఆర్‌ఐవోలనుంచి ప్రిన్సిపాళ్లు తీసుకుని విద్యార్థులకు అందజేయాలి. మెమోల్లో ఏమైనా తప్పులు దొర్లితే సంబంధిత ప్రిన్సిపాల్ ద్వారా మే 22వ తేదీలోగా ఇంటర్ బోర్డుకు దరఖాస్తు చేసుకోవాలి.
ప్రభుత్వ కాలేజీల్లో 48.82 % పాస్: ఇంటర్ ప్రథమ సంవత్సర ఫలితాల్లో జిల్లాల వారీగా ఉత్తీర్ణతను ప్రకటించిన ఇంటర్ బోర్డు ప్రైవేటు కాలేజీల ఉత్తీర్ణతను మాత్రం ప్రకటించలేదు. ప్రభుత్వ కాలేజీల్లో 48.82 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా, ఎయిడెడ్ కాలేజీల్లో 36.12 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.