సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వైద్య పరీక్ష ల సంఖ్యను మరింత పెంచుతామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఇందుకు అన్ని బోధనా ఆస్పత్రుల్లో టె స్టుల కోసం సీబీనాట్ యంత్రాలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. కరోనా బాధితుల సంఖ్య ఎంత పెరిగినా వారికి చికిత్స ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభు త్వం సిద్ధంగా ఉందన్నారు. బాధితుల ప్రాణ రక్షణకు ఎన్ని నిధులైనా ఖర్చు చేసేందుకు ప్రభు త్వం సిద్ధంగా ఉందని చెప్పారు. శుక్రవారం కోఠిలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కొందరు రాజకీయ నాయకులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, సరైన చికిత్స చేయట్లేదని, వైద్యులకు కిట్లు ఇవ్వట్లేదంటూ సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం సరికాదన్నారు. వాస్తవ పరిస్థితులను ప్రత్యక్షంగా చూసిన తర్వాతే ఆరోపణలు చేయాలని సూచించారు. పీపీఈ కిట్లు, మాస్కులు వాడుతున్న డాక్టర్లకు కూడా కరోనా సోకే అవకాశం ఉందని, కిట్లు లేకపోవడం వల్లే డాక్టర్లకు కరోనా సోకిందనడం సరికాదని పేర్కొన్నారు.
ఎయిమ్స్‌లో, ముంబైలో, అమెరికాలో చాలా మంది డాక్టర్లకు కరోనా సోకిం దని, వారికి కూడా కిట్లు లేకపోవడంతోనే వ్యాధి వచ్చిందా అని ప్రశ్నించారు. అన్ని రకాల రక్షణ చర్యలు తీసుకున్నా కొన్నిసార్లు వైరస్ సోకే అవకాశం ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో 10 లక్షల పీపీఈ కిట్లు, 11 లక్షల ఎన్–95 మాస్కులు ఉన్నాయని, అన్ని రకాల మందులు సహా దేనికీ కొరత లేదన్నారు. అవసరమైన ప్రతి హాస్పిటల్‌లో కి ట్లు, మాస్కులు వాడుకోవాలని అధికారులకు సూచించామని స్పష్టంచేశారు. డాక్టర్లు, వైద్య సి బ్బందిని రక్షించుకోవడమే ఎజెండాగా అన్ని చర్యలూ తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. వైరస్ బారిన పడిన డాక్టర్లకు నిమ్స్‌లో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసి అక్కడే చికిత్స అందిస్తామని చెప్పారు. ఐసీఎంఆర్ చెప్పినట్లు లక్షణాలున్న వ్యక్తులకు, పాజిటివ్ వ్యక్తుల హైరిస్క్ కాంటాక్ట్స్ అందరికీ టెస్టులు చేస్తున్నట్లు తెలిపారు.
మనోధైర్యం దెబ్బతీయొద్దు..
ప్రభుత్వం పని చేసుకోకుండా కోర్టులో పిల్స్ వేస్తూ, అర్థం లేని వాదనలు చేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా సమస్యను ప్రపంచం మొత్తం ఎదుర్కొంటోందని, దీన్ని రాజకీయ కోణంలో చూడొద్దన్నారు. కరోనా టెస్టులు చేసేందుకు ప్రైవేటు ల్యాబ్స్‌కు అనుమతి ఇస్తే ఇబ్బందులొస్తాయని, ప్రైవేటులో టెస్టు చేయించుకున్న వారికి పాజిటివ్ వస్తే కాంటాక్ట్ ట్రేస్ చేయడం కష్టం అవుతుందని వివరించారు. ప్రైవేటు ల్యాబుల్లో టెస్టులకు పర్మిషన్ ఇచ్చిన రాష్ట్రాల్లో సమస్యలు తలెత్తాయని, వాటిపై అధ్యయనం చేస్తున్నామని చెప్పారు. గాంధీ ఆస్పత్రిలో కరోనా చికిత్స, వసతులు, సేవలపై వందల మంది పేషెంట్లు సంతృప్తి వ్యక్తం చేశారని, కేంద్ర బృందం కూడా ప్రశంసించిందని పేర్కొన్నారు. ఎవరో ఓ వ్యక్తి తీసిన వీడియోను టీవీ చానెళ్లు ప్రసారం చేయడాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. డాక్టర్లు ప్రాణాలకు తెగించి చికిత్స అందిస్తున్నారని, వాళ్ల మనోధైర్యం దెబ్బతీసేలా విమర్శలు చేయొద్దన్నారు.
లాక్‌డౌన్ సడలింపులు, ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి రాకపోకలతోనే రాష్ట్రంలో కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. ముంబై, భివండి నుంచి వచ్చిన వలస కూలీల్లో చాలా మందికి కరోనా సోకిందని పేర్కొన్నారు. ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారం లక్షణాలు లేని పేషెంట్లను ఇంట్లోనే ఉంచి ట్రీట్‌మెంట్ ఇస్తున్నట్లు తెలిపారు. ఇంట్లో వసతులు లేనివారిని నేచర్ క్యూర్, కింగ్ కోఠి సహా వేర్వేరు ఆస్పత్రుల్లో ఐసోలేట్ చేస్తున్నామన్నారు. ఇతర వైద్య చికిత్సలను నిలిపేసినా ఇబ్బందులు ఉండవని, కానీ ప్రసవాలను ఆపలేమని, వాటిని సకాలంలో చేస్తేనే తల్లీ బిడ్డ క్షేమంగా ఉంటారని చెప్పారు. రోజుకు 50 వేల ప్రసవాలు చేస్తున్నామని వెల్లడించారు. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని, కరోనా మరణాలను తగ్గించేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని చెప్పారు. కొత్తగా 150 వెంటిలేటర్లు అందుబాటులోకి వచ్చాయని, అందులో 50 కేంద్రం ఇచ్చిందని తెలిపారు. మరో 950 వెంటిలేటర్లను ఇచ్చేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హామీ ఇచ్చారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment