
ముంబైకి కేటీఆర్.. ఢిల్లీకి ఈటల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఐటీ రంగం అభివృద్ధి... పెట్టుబడులను ఆకర్షించేందుకు ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు నేడు ముంబై పర్యటనకు బయల్దేరుతున్నారు. పర్యటనలో భాగంగా పలువురు పారిశ్రామికవేత్తలతో కేటీఆర్ భేటీ కానున్నారు. టాటా కంపెనీ ఛైర్మన్ సైరన్ మిస్త్రీతో పాటు లీలా హోటల్స్ ప్రతినిధులతో మంత్రి చర్చలు జరుపుతారు. తెలంగాణ నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటించనున్న నేపధ్యంలో పలువురు పారిశ్రామికవేత్తలతో చర్చలు జరుపనున్నట్లు మంత్రి తెలిపారు. మరోవైపు రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ నేడు ఢిల్లీకి బయల్దేరుతున్నారు.
కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్‌తో భేటీ అవుతారు. తెలంగాణకు 20 లక్షల ఎల్‌పీజీ కనెక్షన్లను మంజూరీ చేయాలని ఇటీవలే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ప్రధానంగా ఈ విషయాన్ని చర్చించేందుకు ఈటెల కేంద్ర మంత్రిని కలుసుకుంటారు. గ్యాస్ కనెక్షన్లు మంజూరీకి కేంద్రం అంగీకరిస్తే రాష్ట్ర అవతర దినోత్సవ కానుకగా వీటిని పంపిణీ చేయాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. దీంతో పాటు కేంద్రం నుంచి రావాల్సిన 13వ ఆర్థిక సంఘం బకాయిలు, కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులకు విజ్ఞప్తి చేసేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీని కలుసుకోనున్నారు.