- సర్వేకు అన్ని వర్గాలు సహకరించాలి : డిప్యూటీ సీఎం రాజయ్య
- సీకేఎం కళాశాలలో జయశంకర్ విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ
- హాజరైన స్పీకర్, ఎంపీ, ఎమ్మెల్యేలు
పోచమ్మమైదాన్ : ఎన్నో ఏళ్ల పోరాటాల అనంతరం ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యత అన్నివర్గాలపై ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. ఈ మేరకు ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. వరంగల్‌లోని సీకేఎం కళాశాల మైదానంలో ప్రొఫెసర్ జయశంకర్ కాంస్య విగ్రహ ఏర్పాటుకు సోమవారం భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన స మావేశంలో రాజయ్య ముఖ్యఅతిథిగా మా ట్లాడుతూ సంక్షేమ పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేపడుతోందని, దీన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థి దశ నుంచే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నానని, అప్పట్లో వరంగల్‌లోని లక్ష్మీ థియేటర్ వద్ద జరిగిన కాల్పుల్లో తన తొడకు బుల్లెట్ దిగిందని గుర్తు చేశారు. అలాగే, 1977-1978 సంవత్సరంలో సీకేఎం కళాశాలలో బీఎస్సీ మొదటి సంవత్సరం పూర్తిచేయ గా, తర్వాత ఎంబీబీఎస్‌లో సీటు రావడంతో కేఎంసీలో చేరానని వివరించారు. కళాశాలల్లో అధ్యాపకులు పెట్టిన భిక్షతోనే తాను ఇప్పుడు డిప్యూటీ సీఎం స్థాయికి చేరుకున్నానని రాజయ్య అన్నారు. కాగా, ఎయిడెడ్ కళాశాలలో పనిచేస్తున్న పార్ట్‌టైం ఉద్యోగుల క్రమబద్ధీకరణకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
జయశంకర్ రాకతోనే కళాశాలకు వైభవం
వరంగల్ సీకేఎం కళాశాలే తన జీవితాన్ని తీర్చిదిద్దిందని అసెంబ్లీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. 1975 సంవత్సరంలో జయశంకర్ సార్ ఈ కళాశాలలో అధ్యాపకుడిగా చేరకముందే చదివేందుకు ఎవరూ ఆసక్తి చూపే వారు కాదని, ఆయన వచ్చాక కళాశాలలో విద్యార్థుల సంఖ్య పెరి గిందన్నారు. ఈ విషయంలో జయశంకర్ కూడా తన జీవితంలో సీకేఎం కళాశాలో పని చేసిన సమయమే సంతృప్తినిచ్చిందని చెప్పేవారని గుర్తు చేశారు.
జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ మాట్లాడుతూ తెలంగాణ కోసం పోరాడిన జయశంకర్ సార్ రాష్ట్రం ఏర్పడ్డాక లేకపోవడం దురదృష్టకరమన్నారు. మహబూబాబాద్ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్ మాట్లాడుతూ ఎయిడెడ్ కళాశాలలను ప్రభుత్వం టేక్‌ఓవర్ చేసేలా మేనేజ్‌మెంట్‌లు సహకరించాలని కోరారు. ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ మా ట్లాడుతూ విద్య, సాధన, శోధన సీకేఎం కళాశాలలో ఉన్నందునే ఇక్కడ చదివిన వారు ఉన్నత స్థాయికి చేరారని పేర్కొన్నారు.
మానకొండురు ఎమ్మెల్యే రాసమయి బాలకిషన్ మాట్లాడుతూ ఏ పదవిని ఆశించకుండా తెలంగాణ కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి జయశంకర్ అని కొనియాడారు. జయశంకర్ సార్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి కేసీఆర్ హాజరయ్యేలా కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పలు పాటలు పాడి విద్యార్థులను ఉత్తేజపరిచారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పూల రవీందర్, తెలంగాణ గాంధీ భూపతి కృష్ణమూర్తి, ఆకారపు చెన్నవిశ్వేశ్వర్‌రావు, చందా విజయ్‌కుమార్, ప్రిన్సిపాల్ డాక్టర్ ఉపేంద్రశాస్త్రి, శర్మ, ధర్మారెడ్డి, వెంకట్‌రెడ్డి, సాంబయ్య, వీరాచారి, సొల్లేటి విజయ్‌కుమార్, చక్రపాణి, శోభాకుమారి, స్వర్ణలత పాల్గొన్నారు.
పలువురి విరాళం
సీకేఎం కళాశాలలో జయశంకర్ విగ్రహ ఏర్పాటుకు పలువురు ఆర్థిక సాయం అందజేశారు. కళాశాల పూర్వ విద్యార్థులు రూ.లక్ష, ప్రొఫెసర్ ఎస్‌వీఎన్.శర్మ రూ 10వేల చెక్‌ను స్పీకర్ చేతుల మీదుగా ప్రిన్సిపాల్‌కు ఇచ్చారు. అలాగే, కళాశాలలోని సమస్యలు పరిష్కరించాలని కోరుతూ లంక రాజ్‌గోపాల్, నాగబెల్లి ప్రశాంత్, సాయి, నాగరాజు తదితరులు ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు అందజేశారు. కాగా, కొందరి ప్రసంగాలు సుదీర్ఘంగా సాగడంైతోఎంపీ సీతారాంనాయక్ ప్రిన్సిపాల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.