బద్దెనపల్లిలోని స్ట్రాంగ్‌రూం వద్ద పోలీసుల భద్రత
సాక్షి, సిరిసిల్ల: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. జిల్లాలో అత్యధికంగా 80.39 శాతం పోలింగ్ నమోదైంది. ఫలితమే మిగిలి ఉంది. ఈనెల 11న గెలుపు ఎవరిని వరించనుందో తేలనుంది. అప్పటివరకు సిరిసిల్ల, వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంల్లో భద్రంగా ఉంటుంది. లెక్క తేలేదాక అభ్యర్థులు, నాయకులతోపాటు అందరిలో ఉత్కంఠ తారస్థాయికి చేరుకుంది. అందరి నోటా
ఎవరు గెలుస్తారు? ఏ పార్టీ అధికారం చేపడుతుంద?నే మాటలే వినిపిస్తున్నాయి. జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు విజయావకాశాలపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నా పోలింగ్ కేంద్రాల వారీగా తమ గెలుపుపై లెక్కలు వేసుకుంటున్నారు. నియోజకవర్గంలోని బూత్‌ల వారీగా ఏజెంట్లు, నాయకులతో సమాచారం తెలుసుకుంటూ తమకు లభించే ఓట్లపై లెక్కలేసుకుంటున్నారు.
ఎవరి ధీమా వారిదే..
జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్, కూటమి అభ్యర్థులు ఎవరికి వారు తమ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత, ప్రజల నుంచి లభించిన సానుభూతి తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్ అభ్యర్థులు ఆశలు పెట్టుకున్నారు. బీజేపీ, బీఎల్‌ఎఫ్ నాయకులు ఈసారి ఓట్లు శాతం పెరగనుందని, ప్రత్యర్థి పార్టీలకు గట్టి సవాల్ విసిరామని భావిస్తున్నారు.
ఈవీఎంలకు పటిష్ట భద్రత
శుక్రవారం సాయంత్రం పోలింగ్ ముగిసిన అనంతరం ఈవీఎంలను బద్దెనపల్లిలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలోకి అధికారులు భద్రంగా చేర్చారు. ఈవీఎంలు, వీవీప్యాట్‌లను రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల పరిశీలకులు, ఎస్పీ, డీఎస్పీల సమక్షంలో పరిశీలించిన తర్వాత స్ట్రాంగ్‌రూముకు సీల్‌వేశారు. స్ట్రాంగ్‌రూం వద్ద మూడెంచల వ్యవస్థతో పోలీసులు పటిష్ట భద్రత కల్పించారు. మొదటి వరుసలో బీఎస్‌ఎఫ్ జవాన్లు, రెండోవరుసలో రాష్ట్రసాయుధ బలగాలు, మూడో అంచెలో సివిల్ ఫోర్స్‌తో గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు. వీరితోపాటు 24 గంటలపాటు సీసీ కెమెరాలతో
నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోంది.
పెరిగిన పోలింగ్ శాతం..
జిల్లాలో ఈసారి అత్యధిక పోలింగ్‌శాతం నమోదైంది. గత ఎన్నికల్లో కంటే ఈసారి వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో 7 శాతం కంటే ఎక్కువ ఓటింగ్ జరిగింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వేములవాడలో 73.04 శాతం, సిరిసిల్లలో 73.24 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఈసారి వేములవాడలో 80.30 శాతం, సిరిసిల్లలో 80.48 శాతం నమోదైంది. మొత్తంగా జిల్లాలో ఈసారి ఎన్నికల్లో 80.39 శాతం పోలింగ్ నమోదైంది. అసెంబ్లీ రద్దు నుంచి ఎన్నికల సంఘం, వివిధ పార్టీల నాయకులు పెద్దఎత్తున ఓటు నమోదు గురించి అవగాహన కల్పిస్తూ ప్రచారం చేయడంతో పోలింగ్ శాతం పెరిగినట్లు అధికారులు, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఓటింగ్‌శాతం పెరగడం ఎవరికి లాభం చేకూరుతుందనేది ఈనెల 11న తేలనుంది.
లెక్కల్లో అభ్యర్థులు..
నియోజకవర్గంలోని భూత్‌ల వారీగా నమోదైన పోలింగ్ శాతంతో ఎక్కడ ఎవరికి ఓట్లు పడ్డాయన్న లెక్కల్లో నేతలు ఉన్నారు. భూత్‌లో ఉన్న ఓటర్లులో మనపార్టీ వారు ఎందరు? ఇతర పార్టీలోని ఓటర్లు ఎందరు? తటస్థ ఓటర్లు ఎవరు? అందులో ఎంతమంది ఓటింగ్‌లో పాల్గొన్నారు? అనే లెక్కలు వేస్తున్నారు. ఎక్కడ పార్టీకి కలిసి వచ్చింది? ఎక్కడ దెబ్బతిన్నదో? సమీక్ష చేయటంతోపాటు, పార్టీలో ఉంటూ పోలింగ్ ముందురోజు ప్రత్యర్థి పార్టీలకు కోవర్టుగా పనిచేసిన నాయకులను గుర్తించే పనిలో పడ్డారు. ఓటింగ్ సరళిని బట్టి భూత్‌ల వారీగా తమకు దక్కిన మద్దతును లెక్కగట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు.
ఎక్కడ చూసినా ఇదే చర్చ
పోలింగ్ ముగిసిన వెంటనే ప్రకటించిన సర్వేలతో జోరుగా చర్చలు నడుస్తున్నాయి. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? మళ్లీ ఏ పార్టీ అధికారంలోకి రానుంది? అనే అంశాలపై పోటీ చేసిన అ భ్యర్థులతోపాటు పార్టీల నాయకులు, జనం చ ర్చించుకుంటున్నారు. అందరి నోటా ఇదేమాట వినిపిస్తోంది. దీనిపైనే బెట్టింగులు, సవాళ్లు కొనసాగుతున్నాయి. ఎన్నికల చివరి ఘట్టమైన ఫలి తాలు వెలువడే ఈనెల 11వ తేదీపైనే ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment